మీ చిత్తశుద్ధికి సెల్యూట్‌..కేంద్రం కితాబు

23 Apr, 2020 04:23 IST|Sakshi

అంగన్‌వాడీ కార్యకర్తకు భారత ప్రభుత్వం అభినందనలు

దివ్యాంగురాలైనా ట్రైసైకిల్‌ సాయంతో సరుకుల పంపిణీ

సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా ఈపూరుకు చెందిన అంగన్‌వాడీ కార్యకర్త సక్రూబాయ్‌ సేవలను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. దివ్యాంగురాలైనా కూడా కరోనా వైరస్‌కు భయపడకుండా ఇంటింటికీ వెళ్లి పిల్లలు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందిస్తున్నందుకు ఆమెను కొనియాడింది. ఈ మేరకు ఆమెకు లేఖ రాసింది. దీనిపై సక్రూబాయ్‌ సంతోషం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహంతోనే వైకల్యాన్ని లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. 
 

లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రంలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలను ప్రభుత్వం మూసివేసింది. ఆ కేంద్రాల్లోని పిల్లలు, బాలింతలు, గర్భిణులకు కార్యకర్తల ద్వారా ఇంటింటికీ రేషన్‌ సరఫరా చేసే ఏర్పాట్లు చేసింది. 

► ఇందులో భాగంగా గుంటూరు జిల్లా ఈపూరు ఐసీడీఎస్‌ ప్రాజెక్టులోని అంగన్‌వాడీ కార్యకర్త  తన పరిధిలోని అందరికీ మూడుసార్లు రేషన్‌ను సరఫరా చేసింది.
► ఆమె దివ్యాంగురాలైనా ట్రై సైకిల్‌ సాయంతో పిల్లలు, గర్భిణులు, బాలింతలకు రేషన్‌ పంపిణీ చేసింది. 
► ఈ సమాచారం తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ మంత్రిత్వశాఖ ఆమెను అభినందిస్తూ రాష్ట్ర ప్రభుత్వ శాఖకు లేఖ రాసింది. 
► దివ్యాంగురాలైనా రేషన్‌ పంపిణీలో ఆమె తన చిత్తశుద్ధి చాటుకున్నారని లేఖలో అభినందించింది. 
► సక్రూభాయిని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ సకల ఉద్యోగుల సంఘం మరో ప్రకటనలో అభినందించింది. 
► రాష్ట్రంలోని 6.20 లక్షల గర్భిణులకు, బాలింతలకు, 22 లక్షల మంది పిల్లలకు (ఆరు నెలల నుంచి ఆరేళ్లలోపు) మూడుసార్లు రేషన్‌ పంపిణీ చేసినట్లు రాష్ట్ర ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ కృతికా శుక్లా చెప్పారు. 

మరింతగా సేవలందిస్తా..
కేంద్ర ప్రభుత్వం నేను చేస్తున్న సేవలను గుర్తించటం చాలా సంతోషంగా ఉంది. 2002లో ఉద్యోగంలో చేరిన నాటి నుంచి నిబద్ధతతో పనిచేస్తున్నా. మా ఉన్నతాధికారుల ప్రోత్సాహంతో వైకల్యాన్ని లెక్కచేయకుండా విధులు నిర్వర్తిస్తున్నా. ఈ రోజు నాకు వచ్చిన గుర్తింపుతో పడ్డ కష్టమంతా మరచిపోయా. మా ఉన్నతాధికారులు, తోటి కార్యకర్తలు, బంధువులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉత్సాహంతో మరింతగా పనిచేస్తాను.    –కె.సక్రూభాయి, అంగన్‌వాడీ కార్యకర్త, మన్నేపల్లి, బొల్లాపల్లి మండలం, గుంటూరు జిల్లా

మరిన్ని వార్తలు