అసంపూర్తి ఇందిరమ్మ ఇళ్లు రద్దు

6 Dec, 2013 04:15 IST|Sakshi

కెరమెరి, న్యూస్‌లైన్ : అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ ఇళ్లు రద్దు చేసి కొత్తగా మంజూరు చేస్తామని, స్వయంగా నిర్మించుకోవాలని ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్ అన్నారు. గురువారం ఆయన మండలంలోని పిట్టగూడ(కే) గ్రామాన్ని సందర్శించారు. గ్రామ సమస్యలపై పటేల్ మెంగును అడిగి తెలుసుకున్నారు. 2007లో 18 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా వాటి ఆనవాళ్లు లేకపోవడం, లబ్ధిదారులకు తెలియకుండానే రూ.26,200 డ్రా చేసినట్లు రికార్డుల్లో ఉండడంపై పీవో గ్రామస్తులను ప్రశ్నించారు. అర్ధంతరంగా నిలిచిన నిర్మాణాలపై గృహ నిర్మాణ శాఖ వర్క్‌ఇన్‌స్పెక్టర్ అధికారి నిరల్‌ను అడిగారు. సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
  పీటీజీ కోటా కింద ఇళ్లు మంజూరు చేస్తామని, కాంట్రాక్టర్లకు ఇవ్వకుండా లబ్ధిదారులే కట్టుకోవాలని సూచించారు. రోడ్డు సౌకర్యం లేదని, చెలిమెల నీరు తాగుతున్నామని గిరిజనులు చెప్పగా.. నీటి వసతి కల్పించాలని ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ మతిన్‌ను ఆదేశించారు. ఎంతమంది చదువుకున్నారు, రేషన్‌కార్డులు ఎందరికి ఉన్నాయి, గ్రూపుల్లో ఎన్ని డబ్బులు పొదుపు చేశారు, బ్యాంకు రుణాలు, ఉపాధి హామీ పనులపై ఆరా తీశారు. మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.10వేల చొప్పున మంజూరు చేస్తామని చెప్పారు. ఎడ్లజతలు మంజూరు చేయాలని, పింఛన్ రావడం లేదని వికలాంగులు పీవో దృష్టికి తీసుకెళ్లారు. మంగళవారం ఉట్నూర్‌కు వస్తే ఆదిలాబాద్‌లోని సదరం క్యాంపునకు తీసుకెళ్లి ధ్రువీకరణ పత్రాలు ఇప్పిస్తామని పేర్కొన్నారు.
 
 ఉపాధ్యాయుడిపై ఆగ్రహం
 ఉపాధ్యాయుడు పాఠశాల సక్రమంగా హాజరు కాకపోవడంపై పీవో జనార్దన్ నివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారానికోసారి ఉపాధ్యాయుడు వస్తారని గ్రామస్తులు తెలిపారు. విద్యావాలంటీరు జైతు పాఠాలు బోధిస్తారని పేర్కొన్నారు. దీంతో ఎంఈవో మల్లయ్యను వివరాలు అడిగారు. ఇంట్లోనే ఉండమని చెప్పండి అంటూ మండిపడ్డారు. పాఠశాల భవనం మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆయన వెంట సర్పంచ్ భీము, తహశీల్దార్ రవిచంద్రారెడ్డి, ఏంపీడీవో సాజిద్ అలీ, ఎంఈవో మల్లయ్య, హౌసింగ్ ఏఈ సత్యనారాయణ, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ మతిన్‌అహ్మద్, అధికారులు ఆత్మారాం, ప్రేంసింగ్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు