ఆటబొమ్మలతో అక్షర వెలుగులు

21 Aug, 2015 02:01 IST|Sakshi
ఆటబొమ్మలతో అక్షర వెలుగులు

సంకల్పం ఉండాలేగానీ... ఎలాంటి చోటైనా ఫలితాలు సాధించొచ్చు. చిత్తశుద్ధితో బోధించాలే గానీ... చిన్నారులను సైతం చాకుల్లా తయారు చేయొచ్చు. ఇది ఓ మారుమూల ఒడిశా సరిహద్దులోని పాఠశాలలో ఉపాధ్యాయుడు నిరూపించారు. ఆటబొమ్మల్నే బోధనాంశాలు చేశారు. పిల్లల్లో సృజనాత్మకతను వెలికి తీసేలా ప్రోత్సహించారు. కార్పొరేట్‌కు దీటుగా ఫలితాలు సాధిస్తున్నారు. ఇదీ బసవపుట్టుగ సర్కారు బడి విశేషం.    
- చిన్నపాటి పరికరాలు... ఆటవస్తువులే బోధనాంశాలు
- చిన్నారులను ఆకట్టుకునేలా శిక్షణ
- బసవపుట్టుగలో ఫలిస్తున్న ప్రయోగాలు

మండలంలోని జాడుపూడి పంచాయతీ పరిధి బసవపుట్టుగ గ్రామంలో గల ప్రాధమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు బూరాడ బాలమోహన్‌రావు వినూత్న రీతిలో విద్యాబోధన సాగిస్తున్నారు. సింగిల్ టీచర్‌గా వ్యవహరిస్తూనే చిత్తశుద్ధితో శ్రమపడి అక్కడి విద్యార్థుల ఉన్నతికి పాటుపడుతున్నారు. అంతేకాదు మంచి ఫలితాలు సైతం సాధించారు. పిల్లలను ఆకట్టుకునేలా... ఎంతో సులభతరంగా బోధన ఉండటంతో మిగతా పాఠశాలల నుంచి పలువురు ఉపాధ్యాయులు ఇక్కడికి వచ్చి పరిశీలిస్తున్నారు. విజయనగరం జిల్లాకు చెందిన బాలమోహన్ 32 మంది విద్యార్థులున్న ఈ పాఠశాలకు ఏకోపాధ్యాయునిగా నియమితులయ్యారు. గ్రామస్తుల సహకారంతో అన్ని సౌకర్యాలను సమకూర్చుకున్నారు. వివిధ ఆటవస్తువులు ఉపయోగించి చిన్న తరగతులవారికి బోధిస్తూ వారి మెదడులో నిక్షిప్తమయ్యేలా చేస్తున్నారు.
 
ఆటవస్తువులే బోధనాంశాలు
ఆటవస్తువులను ఉపయోగించి నంబర్లు, వాటిని కూడిక, తీసివేత, భాగహారం, గుణించటం వంటివి నేర్పుతున్నారు. ఎక్కాలు సులభపద్ధతిలో నేర్చుకొనేందుకు గోళీ పిక్కలను ఉపయోగిస్తున్నారు. గణితంలో వివిధ రకాల ఆకృతులను ఒక బల్లకు మేకులు కొట్టి ఎలస్టిక్ సహాయంతో ఆ ఆకారాలను చూపించి బోధిస్తున్నారు. గోడలపై ఇంగ్లిష్ అక్షరాలను ఆల్ఫాబేట్ ప్రకారం పెయింట్‌చేసి, వాటిద్వారా ఒక్కో అక్షరానికి ఐదు నుంచి పది పదాలు వచ్చేలా రూపొందించారు. ఈ విధానం సరికొత్తగా ఉంది. ఆ ఐదు పదాలతో చిన్న కథను రూపొందించి విద్యార్థులకు బోధించటం వల్ల వారికి ఎప్పటికీ అది గుర్తుండిపోతుందన్నది ఆయన అభిప్రాయం.
 
ప్రత్యేక రోజుల్లో సాంస్కృతిక కార్యక్రమాలు
ప్రత్యేక రోజుల్లో విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇతని పనితనానికి మెచ్చి గ్రామానికి చెందిన తాడి హరిబంధు పాఠశాలలో చదువుతున్న విద్యార్ధులందరికీ రూ. 5వేలు విలువ చేసే కుర్చీలు కొనుగోలు చేసి ఇచ్చారు. ఈయన శ్రద్ధ వల్ల పాఠశాల అభివృద్ధి కోసం గ్రామస్తులు సహాయపడుతున్నారు. ఈయనకు సహాయంగా గ్రామానికి చెందిన బసవ ఢిల్లీరావు అనే విద్యావలంటీరును గ్రామస్తులు నియమించారు. రెండు కాళ్ళు లేని ఢిల్లీరావు ఒకవైపు దూరవిద్య ద్వారా డిగ్రీ చదువుతూ ఇక్కడ కేవలం వెయ్యి రూపాయలు తీసుకొని బోధిస్తున్నారు.
 
విద్యావిధానంలో మార్పు రావాలి
ప్రస్తుత విద్యావిధానంలో మరిన్ని మార్పులు తెస్తే విద్యార్థులకు సులభతరంగా బోధించవచ్చు. ప్రైవేటు పాఠశాలల నుంచి వస్తున్న పోటీని తిప్పికొట్టాలంటే ఇటువంటి చిన్నచిన్న ప్రయోగాలు ఎంతో ఉపకరిస్తాయి. దీనికి పెద్దగా ఖర్చు కూడా కాదు. ఇంగ్లిష్‌లో బోధనకోసం ఒక ప్రత్యేక పుస్తకాన్ని రూపొందించి అందరికీ సరఫరా చేయాలనుకుంటున్నాను.
-బూరాడ బాలమోహనరావు, హెచ్‌ఎం, బసవపుట్టుగ ప్రాధమిక పాఠశాల
 
ఆ ఉపాధ్యాయుని కృషి అమోఘం..
బసవపుట్టుగ లాంటి మారుమూల గ్రామంలో ఇంతటి శ్రద్ధతో విద్యాబోధన సాగించటం మాకు గర్వకారణం. ఇటువంటి ఉపాధ్యాయుల సేవలు గ్రామస్తుల్లో, పిల్లల్లో చిరకాలంగా గుర్తుండిపోతాయి. దీన్ని ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు స్పూర్తిగా తీసుకుంటే ప్రైవేటు పాఠశాలలకు చోటే ఉండదు.
- పిలక చిన్నబాబు, మాజీ సర్పంచ్, జాడుపూడి
 
సేవాదృక్పథంతో బోధిస్తున్నా..
ఈ గ్రామానికి చెందిన నేను కేవలం సేవాదృక్పథంతోనే ఇక్కడ బోధిస్తున్నా. రెండు కాళ్ళకు పోలియో వ చ్చిన నేను.  గ్రామ పాఠశాలలో విద్యాబోధన చేస్తుంటే ఎంతో సంతృప్తికరంగా ఉంది. ఇక్కడి ఉపాధ్యాయుడు బాలమోహన్‌సేవలు కొత్తకొత్త పద్ధతుల్లో విద్యాబోధన చేయటం మా గ్రామానికి గర్వకారణం.
-బసవ ఢిల్లీరావు, గ్రామస్తులు నియమించిన వలంటీరు

మరిన్ని వార్తలు