బీమా పథకాలతో పేదలకు భద్రత

10 May, 2015 01:54 IST|Sakshi
బీమా పథకాలతో పేదలకు భద్రత

జాతీయ బీమా, పెన్షన్ పథకాల ప్రారంభసభలో సీఎం చంద్రబాబు
 జన్‌ధన్ యోజన అత్యుత్తమ పథకం: కేంద్రమంత్రి పారికర్

 
విజయవాడ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మూడు పథకాలు ప్రధానమంత్రి జీవన్ సురక్షా యోజన, జీవన్‌జ్యోతి యోజన, అటల్ పెన్షన్ పథకాలతోపాటు రాష్ట్రంలో డ్రైవర్ల బీమా పథకం అసంఘటిత రంగ కార్మికులు, పేదలకు ఎంతో మేలు చేస్తాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎవరైనా ప్రమాదవశాత్తూ చనిపోయినప్పుడు ఈ పథకాలతో వారి కుటుంబానికి రూ.9 లక్షలు వస్తుందని చెప్పారు. శనివారం సాయంత్రం కోల్‌కతాలో ప్రధానమంత్రి మోదీ ఈ పథకాలను ప్రారంభిస్తున్న సమయంలోనే రాష్ట్రంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సీఎం చంద్రబాబు, కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్  ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అటల్ పెన్షన్ యోజన ద్వారా పేదలు, కార్మికులు, డ్వాక్రా మహిళలు కూడా పెన్షన్ పొందవచ్చని చెప్పారు.  కేంద్ర మంత్రి పారికర్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే ఎన్డీఏ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేసిందన్నారు. కేంద్ర అత్యుత్తమ పథకాల్లో జన్‌ధన్ యోజన ఒకటని చెప్పారు. ప్రధాని ప్రసంగాన్ని ఇక్కడి నుంచే సీఎం, కేంద్ర మంత్రి వీక్షించారు. ఎప్పుడూ వ్యతిరేక వార్తలు రాసే మీడియా ఇలాంటి అనుకూల వార్తలు కూడా రాయాలని సమావేశం చివర్లో చంద్రబాబు సూచించారు. కార్యక్రమంలో మంత్రులు డి.ఉమామహేశ్వరరావు, కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, ఆంధ్రా బ్యాంక్ ఈడీ ఎస్ కర్లా, నాబార్డు సీజీఎం,ఆర్‌బీఐ ఏజీఎం పాల్గొన్నారు.

చంద్రబాబుతో ఎమ్మెల్సీ ఆశావహుల భేటీ

శాసనమండలికి జరగనున్న ఎన్నికల్లో సీటు ఆశిస్తున్న పలువురు టీడీపీ నేతలు సీఎం, పార్టీ అధ్యక్షుడు చం ద్రబాబుతో శనివారమిక్కడ భేటీ అయ్యారు. తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలంటూ విన్నవించారు.  అయితే, బాబు వారికి ఎలాంటి హామీ ఇవ్వలేదు.

భూమి ఇస్తే మరో అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తాం: టాటా గ్రూప్ ప్రతినిధులు

హైదరాబాద్: నిజాంపట్నం లేదా కావలిలో 1,750 ఎకరాల భూమిని కేటాయిస్తే ఆరు వేల మెగావాట్ల సామర్థ్యంతో మరో అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు వద్ద టాటా గ్రూప్ ప్రతినిధులు ప్రతిపాదించగా కావలి పరిసర ప్రాంతాల్లో భూమిని కేటాయించే అంశాన్ని పరిశీలి స్తామని చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని సీఎం క్యాంపు ఆఫీసులో చంద్రబాబుతో అటామిక్ ఎనర్జీ చైర్మన్ ఆర్కే సిన్హా, టాటా గ్రూప్ ప్రతినిధులు సమావేశమయ్యారు. కొవ్వాడ వద్ద నిర్మిస్తోన్న అణు విద్యుదుత్పత్తి కేంద్రం పనుల పురోగతిపై చర్చించారు.
 
ఏపీ సీం చంద్రబాబుపై కేసు నమోదు
 
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై హైదరాబాద్ చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో శనివారం కేసు నమోదైంది. ఏపీలోని కాకినాడ, రాజమండ్రి బహిరంగసభల్లో చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని జనార్దన్‌గౌడ్ అనే న్యాయవాది రంగారెడ్డి కోర్టులో రెండురోజుల క్రితం పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు చంద్రబాబుపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టాలని కోర్టు ఆదేశించటంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
 
 

మరిన్ని వార్తలు