అమరావతికి ఆహ్వానం

21 Jan, 2016 03:53 IST|Sakshi
అమరావతికి ఆహ్వానం

ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాలకు సీఎం పిలుపు
♦ దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఇండియన్ కమ్యూనిటీ సమావేశంలో చంద్రబాబు
 
 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచశ్రేణిలో నిర్మిస్తున్నామని, పెట్టుబడులతో వచ్చి కార్యాలయాలు ప్రారంభించాలని ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాలకు  సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. దావోస్ కాంగ్రెస్ సెంటర్‌లో మంగళవారం రాత్రి వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో ఇండియన్ కమ్యూనిటీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రత్యేక అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ‘‘పారిశ్రామిక దిగ్గజాలైన మీకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మీరు మా నూతన రాజధాని అమరావతికి వచ్చి కార్యాలయాలు ప్రారంభించండి.. ప్రపంచంలోనే జీవయోగ్య నగరంగా అమరావతిని తీర్చిదిద్దనున్నాం.

అక్కడ పరిశ్రమలు పెట్టి ఉత్పాదన పెంచుకోవచ్చు. లాభపడవచ్చు. మీకు ఎలాంటి ఆటంకాలు ఉండవు. పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్ డెస్క్ విధానం ద్వారా అన్ని అనుమతులను ఒకే ఛత్రం కింద 21 రోజుల్లో ఇస్తున్నాం’’ అని చెప్పారు. సమావేశంలో బజాజ్ గ్రూప్ ఛైర్మన్ రాహుల్ బజాజ్, ఇన్ఫోసిస్ ఎండీ, అమెరికన్ సీఈవో విశాల్ సిక్కా, భారతి ఎంటర్ ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ భారతి మిట్టల్, పిరమిల్ గ్రూప్ ఛైర్మన్ అజయ్ పిరమల్, సుజనాల్ రిన్యువబుల్ ఎనర్జీ ఛైర్మన్  తులసి తంతి తదితరులు పాల్గొన్నారు.

సమావేశానికి హాజరైన ఏపీ బృందంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుతో పాటు పరకాల ప్రభాకర్, ఉన్నతాధికారులు పీవీ రమేష్,  జి.సాయిప్రసాద్, అజయ్‌జైన్, ఎస్ ఎస్ రావత్‌లతో పాటు  జాస్తి కృష్ణకిషోర్, కార్తికేయ మిశ్రా ఉన్నారు. దావోస్ కాంగ్రెస్ సెంటర్‌లో ‘ఫ్యూచర్ ఆఫ్ అర్బన్ డెవలప్‌మెంట్ అండ్ సర్వీసెస్’ అనే అంశంపై జరిగిన సమావేశంలో సీఎంప్రసంగిస్తూ రాష్ట్రం ఎదుర్కొంటున్న సవాళ్లు, సంక్షోభాన్ని అవకాశంగా తీసుకుని పనిచేస్తున్న తీరు, రాజధాని నిర్మించుకునేందుకు దక్కిన అరుదైన అవకాశాన్ని వివరించారు. అమరావతి భూముల సమీకరణ విధానంపై సదస్సులో పలువురు ప్రముఖులు ఆసక్తి కనబర్చారు.

 ఏపీ పర్యాటకంపై శ్రీలంక ప్రధాని ఆసక్తి
 ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకరంగంలో ఉన్న అవకాశాలపై శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమ సింఘే ఆసక్తి కనబరిచారు. రణిల్ విక్రమ సింఘే, ఆర్థిక మంత్రి రవి కరుణనాయకే, బెల్జియం ప్రిన్సెస్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనను శ్రీలంక ప్రధానమంత్రి విందుకు ఆహ్వానించారు. సదస్సులో సీఎంని కలిసిన టాటా చైర్మన్ సైరస్ మిస్త్రీ ఏపీలో విభిన్న రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచిన నెస్లే సీఈవో పౌల్ బుల్కె పాల ఉత్పత్తులు, కాఫీ సెక్టారులలో పెట్టుబడులు పెడతామని చెప్పారు.

కేపీఎంజీ  నెదర్లాండ్ చైర్మన్ రిచర్డ్ రెఖేతో ద్వైపాక్షిక చర్చలు జరిపిన సీఎం తీరప్రాంత అభివృద్ధిలో నెదర్లాండ్ సాధించిన విజయాలను, అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. శ్రేయ్ ఇంటర్నేషనల్ ఫండ్ మేనేజర్స్ ఎండీ హేమంత్ కనోరియాసీఎంతో సమావేశమై ఏపీలో మౌలిక వసతులు, తయారీ రంగంలో ఆసక్తి చూపారు. కేంబ్రిడ్జి యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సర్ లెజెక్ బోరీ స్యూయిజ్‌తోనూ చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీ-కేంబ్రిడ్జి వర్సిటీ పరస్పర సహాయ సహకారాలపై అధ్యయనానికి వర్సిటీ నుంచి 18 మంది స్కాలర్స్‌ను త్వరలో రాష్ట్రానికి పంపనున్నటు వీసీ చెప్పారు.

నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌కు చెందిన ప్రొఫెసర్ కిషోర్ మెహబూబాని సీఎంతో సమావేశమై ప్రజా విధానాలు, వాణిజ్యం, పోటీతత్వంలో ఏపీకి ఉన్న అవకాశాలను శోధిస్తున్నామని, త్వరలోనే  నివేదిక అందిస్తామని తెలిపారు. ఏపీని విద్య, వైజ్ఞానిక హబ్‌గా తీర్చిదిద్దేందుకు నేషనల్ వర్సిటీ ఆఫ్ సింగపూర్‌కు అనుబంధంగా ఉన్న లీ ఖాన్ యూ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ముందుకొచ్చింది.

మరిన్ని వార్తలు