బాబూ.. మళ్లీ మీరే ఎందుకు రావాలి?

25 Nov, 2018 07:49 IST|Sakshi

గత ఎన్నికల హామీలే నెరవేర్చలేదు

నాలుగున్నరేళ్ల కాలంలో రైతుకు మిగిలింది కన్నీరే

వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జల్లి విల్సన్‌

ఒంగోలు టౌన్‌: ‘గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో నాలుగున్నరేళ్ల కాలంలో ఏ ఒక్కదానిని నెరవేర్చలేదు. అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేశారు. ముఖ్యంగా వ్యవసాయ కార్మికుల ఉనికినే దెబ్బతీస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి మొదలుకొని అధికారపార్టీ శాసనసభ్యుడి వరకు మళ్లీ మీరే రావాలంటూ ఫ్లెక్సీలు పెట్టించుకుంటున్నారు. ఎవరికి ఎలాంటి మేళ్లు చేయకుండా, చట్టాలను అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మీరే మళ్లీ ఎందుకు రావాలని’ శాసనమండలి మాజీ సభ్యుడు, ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జల్లి విల్సన్‌ ప్రశ్నించారు.

 శనివారం ఒంగోలు వచ్చిన సందర్భంగా స్థానిక మల్లయ్య లింగం భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్ల కాలంలో రైతు కళ్లల్లో కన్నీరు పెట్టించారని, వారిపై ఆధరాపడిన వ్యవసాయ కార్మికుల జీవనం ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. రైతు సుఖాంగా ఉంటేనే వ్యవసాయ కార్మికుడు సుఖంగా ఉంటాడని, అలాంటి పరిస్థితులను ప్రభుత్వం కల్పించడం లేదని విమర్శించారు. జిల్లాలో వరుసగా కరువు పరిస్థితులు నెలకొనడం, ప్రభుత్వం కరువు జిల్లాగా ప్రకటించడం తప్పితే ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదని విమర్శించారు.

 రాష్ట్రంలోని పేదలకు 20లక్షల ఇళ్లు నిర్మిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని, నాలుగున్నరేళ్ల కాలంలో అతికష్టంగా మూడులక్షల ఇళ్లు కట్టించారని, ఆరునెలల కాలంలో 17లక్షల ఇళ్లు ఎలా కట్టిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో భూ బ్యాంకు పేరుతో చంద్రబాబు పేదల నుండి భూములను బలవంతంగా లాక్కుంటున్నారని విమర్శించారు. ఎక్కడైనా ప్రభుత్వం భూములను స్వాధీనం చేసుకుంటే వాటితో ఆసుపత్రులు, ఆట స్థలాలు, గ్రంథాలయాలను నిర్మిస్తారని, అయితే చంద్రబాబు మాత్రం కార్పోరేట్‌ సంస్థలకు, పెట్టుబడిదారులకు భూములను ధారాదత్తం చేసేందుకు పేదల నుండి బలవంతంగా లాక్కుంటున్నారని ధ్వజమెత్తారు. ఒంగోలులో మూడు రోజులపాటు జరగనున్న వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభల్లో వ్యవసాయ కార్మికుల జీవన విధానం గురించి చర్చించి కార్యాచరణ  ప్రణాళిక రూపొందించడం జరుగుతుందన్నారు.

 50సంవత్సరాలు నిండిన వ్యవసాయ కార్మికుడికి నెలకు 5వేల రూపాయల చొప్పున పింఛన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి హామీ పనుల్లో యంత్రాల వినియోగాన్ని తగ్గించి వ్యవసాయ కార్మికులకు పనులు కల్పించాలన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్‌ నారాయణ మాట్లాడుతూ ఐదేళ్లపాటు ఎమ్మెల్యేగా ఉన్నవారికి జీవితకాలం పింఛన్‌ ఇస్తున్న ప్రభుత్వం, రెక్కల కష్టాలపై ఆధారపడిన వ్యవసాయ కార్మికులకు ఎందుకు పింఛన్‌ ఇవ్వరని ప్రశ్నించారు. వామపక్షాల ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న మూడవ రాజకీయ ప్రత్యామ్నాయాన్ని బలపరచాలని కోరారు. విలేకరుల సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆవుల శేఖర్, జిల్లా అధ్యక్షుడు ఎస్‌డీ మౌలాలి, కార్యదర్శి ఆర్‌ వెంకట్రావు పాల్గొన్నారు. 
 

మరిన్ని వార్తలు