దళారులను నమ్మొద్దు: జేసీ మాధవీలత

3 May, 2020 17:06 IST|Sakshi

సాక్షి, విజయవాడ: నగరంలోని ఆరు రెడ్‌ జోన్లలో మొబైల్‌ బజార్లు ఏర్పాటు చేశామని జేసీ మాధవీలత పేర్కొన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు ఇబ్బందులు పడకుండా ఇళ్ల వద్దకే నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. నగరంలో మొత్తం 108 మొబైల్‌, 25 రైతు బజార్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. మూడో విడత ఉచిత రేషన్ పంపిణీ కొనసాగుతోందని.. పేదలందరికీ సరుకులు అందచేస్తామన్నారు. ప్రతీ రేషన్‌ డీలర్‌కు ఐదు మాస్కులు, ఐదు శానిటైజర్లు, హ్యాండ్ గ్లౌసులు, కరోనా నియంత్రణకు టైం స్లాట్‌ కూపన్లు ఇచ్చామని తెలిపారు.
(‘సరిహద్దుల వద్దకు వచ్చి ఇబ్బందులు పడొద్దు’) 

జిల్లాలో ఐదు లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారని.. రబీలో పంట దిగుబడులు కూడా బాగా వచ్చాయన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో రైతులు ఇబ్బందులు పడకూడదని ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తోందని పేర్కొన్నారు. జిల్లాలో 267 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని.. ఇప్పటి వరకు లక్ష టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ప్రతి ధాన్యపు గింజను గిట్టుబాటు ధరతో  కొనుగోలు చేస్తామన్నారు. కరోనా పేరుతో దళారుల మాటలు విని మోసపోవద్దని రైతులకు జేసీ మాధవీలత సూచించారు.
(ఫోన్‌కే కరోనా నిర్ధారణ ఫలితం..)

మరిన్ని వార్తలు