జీ హుజూర్..

23 Feb, 2014 03:12 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, అనంతపురం : దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న నానుడిని మంత్రిగా చివరి క్షణం వరకూ శైలజానాథ్ అమలు చేశారా..? మాజీ మంత్రి శైలజానాథ్‌కు అధికారులు సాగిలపడ్డారా..? రూ.20 కోట్ల విలువైన పనులను నామినేషన్ పద్ధతిలో మంత్రి అస్మదీయులకు కట్టబెట్టారా..? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నాయి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.. అధికారవర్గాలు. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున పర్సంటేజీలు చేతులు మారాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశంపై ఓ సీనియర్ ప్రజాప్రతినిధి అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడటం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. శింగనమల నియోజకవర్గంలో తన అనుచరగణాన్ని కాపాడుకోవడానికి మాజీ మంత్రి శైలజానాథ్ పడరాని పాట్లు పడుతున్నారు.
 
 మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి స్థాపించే కొత్త పార్టీలో చేరే దిశగా సాగుతోన్న ఆయన.. తన అనుచరులనూ అదే పార్టీలోకి తీసుకెళ్లడానికి పావులు కదుపుతున్నారు. ఆ క్రమంలోనే అస్మదీయులకు భారీ ఎత్తున పనులు కట్టబెట్టేందుకు ముందస్తుగానే వ్యూహం రచించారు.
 
 కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శింగనమల నియోజకవర్గానికి స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్(ఎస్‌డీఎఫ్) కింద రూ.6 కోట్లు, గ్రామీణ సిమెంటు రోడ్లు(సీఆర్‌ఆర్) పథకం కింద మరో రూ.5 కోట్లు, పంచాయతీకి రూ.ఐదు లక్షల చొప్పున నియోజకవర్గంలోని 116 పంచాయతీలకూ రూ.5.80 కోట్లు మంజూరు అయ్యాయి. వీటితోపాటూ బీఆర్‌జీఎఫ్(వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి), సాధారణ నిధులు తదితర పథకాల కింద రూ.20 కోట్లతో శింగనమల నియోజకవర్గంలోని 116 పంచాయతీల పరిధిలో అభివృద్ధి పథకాలు చేపట్టేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రూ.రెండు లక్షల్లోపు విలువైన పనిని ఈఈ స్థాయి అధికారి.. రూ.5 లక్షల్లోపు విలువైన పనిని ఎస్‌ఈ స్థాయి అధికారి నామినేషన్‌పై కట్టబెట్టవచ్చునని ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులు కేవలం యుద్ధప్రాతిపదికన(కరువు, వరదలు వంటి ఉత్పాతాలు ఉత్పన్నమైనప్పుడు మాత్రమే) చేయాల్సిన పనులకు మాత్రమే వర్తిస్తాయి. కానీ.. ఆ ఉత్తర్వులకు అధికారులు నీళ్లొదిలారు. కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచులుగా ఉన్న పంచాయతీలకు పనులను మార్చాలని అధికారులపై తీవ్ర  ఒత్తిడి తేవడంతో.. మంత్రికి సాగిలపడిన అధికారులు.. ఆ మేరకు ప్రతిపాదనలను మార్చి సరి కొత్త ప్రతిపాదనలను ప్రతిపాదించారు. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా రూ.20 కోట్ల విలువైన పనులను శైలజానాథ్ అనుచరులైన ఐదారుగురికి కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేశారు.
 
 
 చివరి రోజున ఉత్తర్వులు జారీ.. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం పదవికి చేసిన రాజీనామాను శుక్రవారం గవర్నర్ ఆమోదించడంతో మంత్రిమండలి రద్దయింది. శైలజానాథ్ మాజీ మంత్రిగా మారిపోయారు. కాసేపట్లో సీఎం రాజీనామాను గవర్నర్ ఆమోదిస్తారనే సమాచారం అందుకున్న మంత్రి.. వివిధ శాఖల అధికారులను శుక్రవారం ఉదయం తన ఇంటికి రప్పించుకున్నట్లు సమాచారం.
 
 రూ.20 కోట్ల విలువైన పనులను తన అనుచరులకు కట్టబెడుతూ అక్కడికక్కడే ఉత్తర్వులు జారీ చేయించినట్లు కాంగ్రెస్ వర్గాలు.. అధికారులు వెల్లడించారు. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున పర్శంటేజీలు చేతులు మారినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశంపై పంచాయతీరాజ్ ఎస్‌ఈ రవికుమార్‌ను ‘సాక్షి’ సంప్రదించగా.. శుక్రవారం ఉదయం శైలజానాథ్ ఇంటికి వెళ్లిన మాట వాస్తవమేనన్నారు. ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశామన్నారు. నామినేషన్ పనులకు సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదన్నారు.
 

>
మరిన్ని వార్తలు