ప్రత్యేక హోదా కల్పించకపోవడం దారుణం

22 Mar, 2015 01:46 IST|Sakshi

పాతగుంటూరు: రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ప్రత్యేక హోదా కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం చొరవ చూపకపోవడం దారుణమని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. నగరంలోని కొత్తపేట మల్లయ్యలింగం భవన్‌లో సీపీఐ ఆధ్వర్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజనచట్టం అమలు, పోలవరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపులపై శనివారం పలు పార్టీల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముప్పాళ్ల మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వం విభజన సమయంలో ఐదు సంవత్సరాలు ఆంధ్రాకు ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పిన సందర్భాల్లో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఐదేళ్లు చాలదు పదేళ్లు ప్రత్యేక హోదా కల్పించాలని అప్పట్లో డిమాండ్ చేశారని గుర్తు చేశారు.

ప్రస్తుతం వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదా సాధ్యం కాదని చెప్పడం, కేంద్ర మంత్రి సుజనాచౌదరి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా నిధులు అధిక మొత్తంలో వస్తాయని చెప్పడం రాష్ట్ర ప్రజల్లో పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయన్నారు. దీనిపై సీపీఐ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం కొనసాగిస్తుంటే తమ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను అరెస్టు చేశారన్నారు. రాజకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు సీపీఐ కృషి చేస్తుందన్నారు.  సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని చీల్చేందుకు మద్దతు ఇస్తూ ఎన్నికల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇస్తామని చెప్పిన బీజేపీ ఇప్పుడు మాట మార్చిందని మండిపడ్డారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలతో ఉద్యమించేందుకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. రాజధాని నిర్మాణానికి 32 వేల ఎకరాలు ప్రభుత్వం స్వీకరించిందని, ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టకుండా ఆ భూములను కార్పొరేట్ సంస్థలకు అప్పగించి వారిచ్చే డబ్బులతో అభివృద్ధి చేసేలా చంద్రబాబు చూస్తున్నారని మండిపడ్డారు. వామపక్షాలు, ప్రతిపక్షం, ప్రజా సంఘాలు కలసికట్టుగా ప్రజా సమస్యలపై, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.  

సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు విభజన చట్టం అమలుకు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయలేక మౌనం దాలుస్తున్నారని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే కృష్ణా డెల్టా రైతులు, ప్రజలకు సాగునీరు, తాగునీటి సమస్యలు తీరుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టిసీమను వెలుగులోకి తెచ్చి పోలవరంను నిర్వీర్యం చేసేలా చూస్తుందన్నారు. చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఆతుకూరు ఆంజనేయులు మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తీసుకురావడంలేదో అర్థం కావడంలేదన్నారు.  

రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఉద్యమంలో పాల్గొంటామన్నారు. సమావేశంలో ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి తూమాటి శివయ్య, సీపీఐ నగర కార్యదర్శి కోటా మాల్యాద్రి, ప్రజానాట్యమండలి జిల్లా నాయకులు పున్నయ్య, లోక్‌సత్తా జిల్లా జాయింట్ సెక్రటరీ జి.వెంకయ్య, లోక్‌సత్తా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎస్.మనోరమ, అయ్యస్వామి, వెంకటేశ్వరరావు, రాధాకృష్ణమూర్తి, సుబ్బారావు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు