రౌడీయిజం చేస్తున్న టీడీపీ నాయకులు

23 Oct, 2018 13:30 IST|Sakshi
విలేకరులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి

కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి

నెల్లూరు, కావలి: దగదర్తి మండలంలో పేదల భూములను, ఇళ్ల స్థలాలను అక్రమంగా స్వాధీన పరచుకోవడానికి టీడీపీ నాయకులు పేదల ప్రజలపై రౌడీయిజం చేస్తున్నారని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. దగదర్తి తహసీల్దార్‌ కార్యాలయంలో సోమవారం పెద్ద ఎత్తున తరలివచ్చిన అర్జీదారుల నుంచి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి వివిధ సమస్యలపై వినతి పత్రాలను స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే రామిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ గ్రీవెన్స్‌డే రోజున తహసీల్దార్‌ ఉండరన్నారు. జిల్లాలో ఎక్కడా లేనివిధంగా దగదర్తి మండలంలో టీడీపీ నాయకులు ప్రజల భూములపై రాబందుల్లా పడుతున్నారన్నారు. ప్రజల ఆస్తులైన భూములు, ఇంటి స్థలాలను టీడీపీ నాయకులు అక్రమంగా స్వాధీనం చేసుకుంటున్నప్పటికీ తహసీల్దార్, సిబ్బంది టీడీపీ గూండాలకే సహకరిస్తుండటం సిగ్గుచేటన్నారు. బాధిత ప్రజలు అధికారులకు వద్దకు వస్తే, పని కావాలంటే టీడీపీ నాయకులను కలవాలని చెబుతున్నారని ఇంతకన్నా అధికార వ్యవస్థకు సిగ్గుమాలిన పని ఉందా అని ప్రశ్నించారు. హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా ఖాతరు చేయకుండా టీడీపీ నాయకులు కొందరు కార్యకర్తలతో వెళ్లి నిర్మాణంలో ఉన్న ఇంటిని కూడా కూల్చేశారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దగదర్తి మండలంలో భూకబ్జాలు చేసిన టీడీపీ నాయకుల బాగోతాన్ని పూర్తి స్థాయిలో వెలికి తీస్తామన్నారు.

బీద, మాలేపాటి సోదరులు మండలంలో భూకబ్జాలకు పాల్పడుతున్నారన్నారు. గ్రావెల్‌ దోపిడీ, భూకబ్జాలపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ చెప్పి మూడు వారాలు గడిచిపోయినప్పటికీ చర్యలు తీసుకోలేదన్నారు. మాలేపాటి సోదరులు ఒక్క భూకబ్జాలే కాకుండా ఇరిగేషన్‌ శాఖ ద్వారా నిధులను కూడా స్వాహా చేస్తూనే తాము ఉచితంగా చేస్తున్నట్లుగా బుద్ధిలేని మాటలు చెబుతున్నారన్నారు. దగదర్తి మండలంలో మాలేపాటి సోదరులు తమకు చంద్రబాబు రూ.80 లక్షలు ప్రత్యేకంగా ఇచ్చి పనులు చేసుకోమన్నారని చెబుతున్నారని తెలిపారను. మాలేపాటి సోదరుల దోపిడీని ప్రశ్నిస్తున్న వారిపై రౌడీయిజం చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యేతో పాటు వెఎస్సార్‌సీపీ నాయకులు తాళ్లూరు ప్రసాద్‌ నాయుడు, పార్టీ మండల యువజన విభాగం అధ్యక్షుడు వెలినేని మహేష్‌నాయుడు, శాఖ మూరి వెంకటకృష్ణమనాయుడు, కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, గంథం ప్రసన్నాంజనేయులు, కుందుర్తి కామయ్య ఉన్నారు.

మరిన్ని వార్తలు