ఉప ముఖ్యమంత్రి కేఈకి పరాభవం

19 May, 2017 14:37 IST|Sakshi
ఉప ముఖ్యమంత్రి కేఈకి పరాభవం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి మరోసారి అవమానం ఎదురైంది. జిల్లాల ఇన్‌చార్జి మంత్రుల నియామకంలో ఆయనకు చోటు దక్కలేదు. ఏ జిల్లాకూ ఇన్‌చార్జి మంత్రిగా ఆయనను నియమించలేదు. కేబినెట్‌లో అందరికంటే సీనియర్‌ అయినా ఆయనను సీఎం చంద్రబాబు పక్కనపెట్టడం గమనార్హం. మరో డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్పకు విశాఖ బాధ్యతలు అప్పగించారు.

 




ఇటీవల జరిగిన కేబినెట్‌ పునర్వ్యస్థీకరణలో శాఖలు మారిన మంత్రులు శిద్ధా రాఘవరావు, పరిటాల సునీత కూడా పరాభవం తప్పలేదు. వీరికి కూడా జిల్లాల ఇన్‌చార్జి మంత్రుల నియామకంలో చోటు దక్కలేదు. బీజేపీ మంత్రులు కామినేని శ్రీనివాస్‌, పైడికొండల మాణిక్యాలరావును పూర్తిగా విస్మరించడం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ-బీజేపీ విభేధాల నేపథ్యంలో ఈ ఇద్దరు మంత్రులను పక్కనపెట్టారన్న వాదనలు విన్పిస్తున్నాయి. అనంతపురం ఇన్‌చార్జిగా కామినేని శ్రీనివాస్‌ స్థానంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు స్థానం కల్పించారు.

జిల్లాలకు ఇన్‌చార్జి మంత్రులను నియమిస్తూ సీఎస్‌ దినేశ్‌ కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణా జిల్లాకు యనమల రామకృష్ణుడు, వైఎస్సార్‌ జిల్లాకు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, చిత్తూరు జిల్లాకు అచ్చెన్నాయుడిని ఇన్‌ చార్జి మంత్రిగా నియమించారు. ఇన్‌చార్జి మంత్రులు ఆయా జిల్లాల్లో ప్రభుత్వం చేపట్టే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షిస్తారు.  

మరిన్ని వార్తలు