రావొద్దు.. వెళ్లొద్దు

22 Apr, 2020 13:01 IST|Sakshi
గుంటూరు 60 అడుగుల రోడ్డులోని రెడ్‌జోన్‌లో ఉన్న శ్రీనివాసరావుతోట

రెడ్‌జోన్, కంటైన్మెట్‌ ప్రాంతాల్లో రాకపోకలపై అధికారుల కఠిన ఆంక్షలు

కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో మరింత అప్రమత్తం

మంగళవారం తాజాగా తొమ్మిది పాజిటివ్‌ కేసులు

జిల్లాలో 158కు చేరిన కరోనా కేసుల సంఖ్య

అత్యధికంగా గుంటూరు నగరంలో 102 మంది బాధితులు   

సాక్షి, అమరావతి బ్యూరో: కరోనా మహమ్మారిని నిలువరించేందుకు అధికార యంత్రాంగం అలుపెరుగక పని చేస్తోంది. అనుక్షణం అప్రమత్తతతో క్షేత్ర స్థాయి నుంచి క్షుణ్ణంగా పర్యవేక్షిస్తోంది. మంగళవారం జిల్లాలో మరో తొమ్మిది పాజిటివ్‌ కేసులు నమోదవ్వడంతో అధికారులు మరింత అలర్ట్‌ అయ్యారు. ఎక్కడ ఏ చిన్న అనుమానం వచ్చినా.. ఆయా ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. ముఖ్యంగా గుంటూరు నగరంలో అధికంగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టారు. ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రావొద్దని.. ఆయా ప్రాంతాల్లోకి బయట వారెవ్వరూ వెళ్లొద్దని కఠిన ఆంక్షలు విధించారు. 

రెడ్‌జోన్‌పై ప్రత్యేక దృష్టి
గుంటూరు నగరంలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. రెడ్‌ జోన్‌ ప్రాంతాలతో పాటు, అన్ని డివిజన్లలో ప్రత్యేక యంత్రాల ద్వారా హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని స్ప్రే చేస్తున్నారు. దీంతో పాటు ఉదయం, సాయంత్రం వేళల్లో బ్లీచింగ్, సున్నం జల్లుతున్నారు. ఎక్కడా చెత్త నిల్వలు లేకుండా చర్యలు చేపట్టారు. 

నిరాశ్రయులకు ఆశ్రయం
లాక్‌ డౌన్‌ నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన కూలీలు, యాచకులు, రహదారులపై ఉండే నిరాశ్రయుల ఆకలిని తీరుస్తున్నారు. ఈ క్రమంలో గుంటూరు నగరంలో ఏడు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి భోజన, వసతి సౌకర్యాలు కల్పించారు. సామాజిక దూరం పాటించే విధంగా జాగ్రత్తలు చేపట్టారు.  

తొమ్మిదిలో ఎనిమిది.. నగరంలోనే
మంగళవారం జిల్లా వ్యాప్తంగా తొమ్మిది కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా అందులో ఎనిమిది కేసులు గుంటూరు నగరంలో వెలుగులోకి వచ్చాయి.
సంగడిగుంటలో రెండు, ఆనందపేటలో రెండు, పాత గుంటూరులోని ఓల్డ్‌ పార్క్‌ రోడ్డులో మూడు, యానాది కాలనీలో ఒక కేసు నమోదయ్యింది.  
మొత్తం నగరంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 102కు చేరింది. ఇందులో ఒక కేసు మాత్రం నరసరావుపేటలో నమోదైంది.
జిల్లాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 158కి చేరగా ఆరుగురు మృతి చెందారు.

కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో ప్రత్యేక సేవలు
గుంటూరు నగరంలోని 12 కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సిబ్బంది నిత్యావసరాలు, రేషన్‌ సరుకులను ఇళ్ల వద్దకే అందజేస్తున్నారు.
ఆయా ప్రాంతాల పరిధిలో ఆరు ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేసి ప్రజల ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు.
బహిరంగ ప్రాంతాల్లో ప్రత్యేకంగా 13 కూరగాయల మార్కెట్లు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల సంచారా రైతు బజార్లను నడిపిస్తున్నారు. సూపర్‌ మార్కెట్, షాపింగ్‌మాల్స్‌ యాజమాన్యాలతో చర్చించి సరుకులను డోర్‌ డెలివరీ చేసేల ఏర్పాట్లు చేశారు.  
నిత్యావసరాలను అధిక ధరలకు విక్రయించకుండా ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్‌
నెహ్రూనగర్‌(గుంటూరు): కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో ప్రజలు బయటికి రాకుండా, ఇతర ప్రాంత ప్రజలు లోపలికి వెళ్లకుండా కట్టుదిట్టమైన భద్రత, పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా అనురాధ అధికారులను ఆదేశించారు. చాకలిగుంట, శ్రీనివాసరావుతోట ప్రాంతాల్లో మంగళవారం పర్యటించారు. కంట్రోల్‌ రూమ్‌లో విధుల్లో ఉండే ఉద్యోగులు నిర్దేశిత సమయానికి విధులకు హాజరు కావాలన్నారు. కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు నిర్వహించాలన్నారు. శ్రీనివాసరావుతోటలో సైడు కాలువలు శుభ్రం చేయడం లేదని స్థానికులు ఫిర్యాదు మేరకు స్థానిక శానిటరీ ఇన్‌స్పెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సైడు కాలువలు ప్రతి రోజు శుభ్రం చేయించాలన్నారు.  నోడల్‌ అధికారి రవికుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు