మామిడి పోతోంది! 

12 May, 2019 12:48 IST|Sakshi
ఎర్రావారిపాళెం మండలంలో నీళ్లు లేక ఎండిపోయిన మామిడి తోటలు

జిల్లాలో మామిడి తోటలు ఎండిపోతున్నాయి.. విపరీతమైన ఎండలకు చెట్లు మాడిపోతున్నాయి. మూడేళ్లుగా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. సాగునీటి బోర్లలో చుక్కనీరు లేక బోరుమంటున్నాయి. కన్నబిడ్డలతో సమానంగా పెంచిన మామిడి చెట్లు కళ్ల ముందే ఎండిపోతుంటే మామిడి రైతులు కుమిలిపోతున్నారు. చేసేది లేక తోటలను వదిలేస్తున్నారు. మరోవైపు ప్రతికూల వాతావరణం దిగుబడిపై పెను ప్రభావమే చూపింది. 

పుత్తూరు: మామిడి సాగు జూదంలా మారిపోయిం ది.. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా మామిడి రైతుకు కాలం కలిసి రాలేదు. సాగు ఖర్చులు తక్కువగా ఉండడం, ధరలు ఆశాజనకంగా ఉండడంతో పాటు నీటి అవసరం తక్కువ కావడంతో జిల్లా రైతులు సంప్రదాయ పంటల స్థానంలో మామిడి సాగు వైపు ఎక్కువగా మొగ్గు చూపారు. దీంతో జిల్లాలో మామిడి సాగు విస్తీర్ణం దశాబ్ద కాలంలో గణనీయంగా పెరిగింది. కేవలం మామిడి సాగును ఆసరా చేసుకుని జీవితాలను గడుపుతున్న రైతుల సంఖ్య కూడా క్రమంగా పెరిగిపోయింది.

మాడిపోతున్న తోటలు
గతంలో ఎన్నడూ లేని విధంగా మామిడి తోటలు ఈ ఏడాది ఎండితున్నాయి. కొన్నేళ్లుగా నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలమట్టం జిల్లాలో అథఃపాతాళానికి పడిపోయింది. గత ఏడాది మే నాటికి 17.96 మీటర్లుగా ఉన్న భూగర్భ జలమట్టం ఈ ఏడాది మేలో 28.17 మీటర్లకు పడిపోయింది. దీంతో బోర్లు పూర్తిగా ఎండిపోయాయి. ట్యాంకర్ల ద్వారా నీటిని అందించేందుకు స్థోమత లేని రైతులు తోటలను వదిలేశారు. ఎర్రావారిపాళెం మండలం వీఆర్‌ అగ్రహారం గ్రామానికి చెందిన రైతు నారాయణకు ఉన్న 12 ఎకరాల మామిడి తోట పూర్తిగా ఎండిపోవడంతో గత్యంతర లేక కూలి పనులకు పోతుండడం మామిడి రైతుల పరిస్థితికి అద్దం పడుతోంది.

తుడిచిపెట్టుకుపోయిన దిగుబడి
మరోవైపు ఈ ఏడాది ప్రతికూల వాతావరణం మామిడి రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. సాధారణంగా జిల్లాలో డిసెంబర్, జనవరి ఆఖరు నాటికి చెట్లుకు పూత వస్తుంది. ఇందుకు పగటిపూట 30 డిగ్రీల లోపు రాత్రి పూట 18 డిగ్రీల ఉష్ణోగ్రతలు అనుకూలిస్తాయి. అయితే ఈ ఏడాది మార్చి వరకు కూడా పూత రాకపోవడంతో వచ్చిన పూత సైతం అధిక ఉష్ణోగ్రతల కారణంగా రాలిపోయిందని ఉద్యానవన శాఖ అధికారులు పేర్కొంటున్నారు. మరికొన్ని తోటల్లో వచ్చిన పూతలో మగపూలు ఎక్కువగా రావడంతో పిందె కట్టలేకపోయిందని అధికారులు వివరిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మామిడి రైతుకు వాతావరణం ప్రతిబంధకంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది జిల్లాలో 30 శాతం మించి మామిడి దిగుబడి వచ్చే పరిస్థితి లేదని వారు అంచనా చేస్తున్నారు. 

నీరందించలేకున్నారు
కాయలు కాసే ముందు చెట్లు నిలువునా ఎండిపోతుంటే అన్నదాత గుండె తరుక్కుపోతోంది. కొందరు రైతులు ట్యాంకర్ల ద్వారా మామిడి చెట్లకు నీరందించాలనుకుంటే ఆ ఖర్చు భరించలేకున్నారు. ఒక్క ట్యాంకరుకు రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. అంత స్థోమత లేక వదిలేస్తున్నారు. అప్పో సప్పో చేసి బోర్లు వేసుకుందామంటే చాలాచోట్ల వెయ్యి అడుగులు డ్రిల్‌ చేసినా నీటి జాడ కానరావడం లేదు. 

వర్షాలు కురిస్తేనే..
అధిక ఉష్ణోగ్రతల కారణంగా మా మిడి తోటలు ఎండిపోతున్నాయి. కనీసం 15 రోజులకు ఒకసారైనా ట్యాంకర్ల ద్వారా నీళ్లు అందించాలని రైతులకు సూచిస్తున్నాం. వేరే ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. రైతులు ప్రభుత్వం సబ్సిడీపై మంజూరు చేస్తున్న ఫారం పాండ్స్‌ను ఏర్పాటు చేసుకుంటే వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు తోటలను సంరక్షించుకోవచ్చు. మళ్లీ వర్షాలు కురిస్తే తోటలు పునరుజ్జీవం పొందే అవకాశం ఉంది. రైతులు భయపడాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం.  – నరేష్‌కుమార్‌రెడ్డి, ఉద్యానవన శాఖ అధికారి, పుత్తూరు

మూడెకరాల తోట ఎండిపోయింది
నీటి వసతి లేకపోవడంతో మూడెకరాల్లో ఉన్న మా మామిడి తోట ఎండిపోయింది. ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాలంటే చాలా ఖర్చుతో కూడినది కావడంతో అలాగే వదిలేశాను. కొత్తగా బోరు వేసుకుందామన్నా మా ప్రాంతంలో నీళ్లు పడతాయనే నమ్మకం కూడా లేదు. మా పరిస్థితి ఘోరంగా ఉంది. ఎలా బతకాలో తెలియక అయోమయంలో పడిపోయాం. ఆనందరెడ్డి, మామిడి రైతు, టీకేఎం పురం

మరిన్ని వార్తలు