17న సీమాంధ్ర జిల్లాల్లో వైద్య సేవలు బంద్

15 Sep, 2013 00:39 IST|Sakshi

 విజయవాడ,న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాల ని కోరుతూ ఈనెల 17న సీమాంధ్ర జిల్లాలో వైద్యసేవలు నిలిపివేయనున్నట్లు  ఏపీ మెడికల్ జేఏసీ చైర్మన్ డాక్టర్ పీవీ రమణమూర్తి తెలిపారు. తెలుగుజాతిని విడగొట్టాలని చేస్తున్న కుతంత్రాలను తిప్పికొట్టేందుకు ఉద్యమిస్తున్న వారితో కలసి వైద్య జేఏసీ పోరాటం చేస్తుందన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయం ప్రకటించిన నాటినుంచి 45 రోజులు ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారన్నారు.
 
 సమైక్యాంధ్ర ఉద్యమంలో తాము కూడా భాగస్వాములవుతూ ఇప్పటివరకూ వివిధరూపాల్లో నిరసనలు తెలిపామని, అందులో భాగం గానే సీమాంధ్ర 13 జిల్లాల్లో 17న వైద్య బంద్ పాటించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు, వైద్య, నర్సింగ్ కళాశాలలు, లేబరేటరీలు, డెంటల్ వైద్యులు ఈ సమ్మెలో పాల్గొననున్నట్లు తెలిపారు. ఆరోజు మెడికల్ జేఏసీ ఆధ్వర్యంలో అన్నిజిల్లాల్లో భారీ ర్యాలీలు నిర్వహించడంతోపాటు, రిలే దీక్షలు చేపడతామన్నారు. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వైద్య విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని, సూపర్ స్పెషాలిటీ కోర్సులు అందుబాటులో లేని దుస్థితి నెలకొంటుందన్నారు.17న అత్యవసర సేవలు మినహా అన్ని సేవలు నిలిపివేస్తామని, దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
 

మరిన్ని వార్తలు