కనికరం లేదా?

4 Jul, 2014 02:17 IST|Sakshi

 ‘నిలుచునే శక్తి లేక నీరసించి పోతున్నాం.. అయ్యా.. మమ్మల్ని లోపలకి పంపించండి’. మారుమూల గ్రామం నుంచి వచ్చాం. ఆలస్యమైతే బస్సు దొరకదు’ అంటూ వికలాంగులు చేసుకుంటున్న విజ్ఞప్తులతో గురువారం అనంతపురంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రాంగణం మారుమోగింది. 80 శాతం అంగవైకల్యం ఉన్న వారికి రూ.1500 పింఛన్ ఇస్తామంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో.. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వికలాంగులు పెద్దఎత్తున ఆస్పత్రిలోని సదరం క్యాంపు వద్దకు చేరుకున్నారు.
 
 గతంలో వైద్యులు తక్కువ పర్సెంటేజీ వేశారని, మరోసారి పరీక్షిస్తే పర్సెంటేజీ పెరుగుతుందేమోన్న భావంతో గురువారం సుమారు వెయ్యి మంది దాకా రావడంతో సద రం క్యాంపుతోపాటు, 9,13 నెంబర్ల ఓపీలు, మందులు పంపిణీ చేసే గది చుట్టుపక్కల కిక్కిరిసింది. ఫలితంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. గంటల తరబడి వేచి చూసి పలువురు అస్వస్థతకు గురైనా పట్టించుకునే నాథులే లేకుండా పోయారు.         
 
 
 సొమ్మసిల్లిన వృద్ధులు
 బయటకు వెళితే క్యూలో వెనకబడతామేమోనన్న భయంతో  ఆకలిదప్పులను కాదనుకుని గంటల కొలదీ నిలుచున్నా ఫలితం లేకుండా పోయింది. అందుబాటులో తాగునీరు సైతం లేకపోవడంతో రాజీవ్ కాలనీకి చెందిన పుల్లమ్మ, మల్లాపురానికి చెందిన నాగ న్న సొమ్మసిల్లిపడిపోయారు. అయి నా, ఎవరూ వీరిని పట్టించుకున్న పాపాన పోలేదు.
 
 డీఆర్‌డీఏ అధికారుల
 వైఫల్యం
 వారం రోజులుగా సదరం క్యాంపునకు వస్తున్న వికలాంగుల సంఖ్య పెరుగుతున్నా అందుకు అనుగుణంగా క్యాంపు అధికారులు చర్యలు తీసుకోలేదు. గురువారం క్యాంపులో డాక్టర్ జగన్నాథ్, డాక్టర్ ఆనంద్ నాయక్, ఫిజియోథెరపిస్టులు శ్రీలక్ష్మి, అనిల్‌కుమార్‌లు పరీక్షలు నిర్వహించారు.
 
 దళారుల రాజ్యం
 అంగవైకల్య నిర్ధారణ ధ్రువీకరణ పత్రాల కోసం వందల సంఖ్యలో వికలాంగులు వస్తుండడాన్ని ఆసరాగా చేసుకుని లబ్ధి పొందేందుకు కొందరు ఉద్యోగులే దళారుల అవతారం ఎత్తినట్లు తెలుస్తోంది. వీరు లబ్ధిదారులను మభ్యపెట్టి దండుకుంటున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా పలువురు వికలాంగులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఇలా...
 
 దళారులను అడ్డుకోవాలి
 ఆస్పత్రిలో వికలాంగులను మోసం చేసే ముఠాలున్నాయి. ఆ దళారులను అడ్డుకోవాలి. అధికారులు ఏమాత్రం చొరవ చూపడం లేదు. అసలది వైద్య పరీక్షల కేంద్రంలా ఉందా చూడండి.
 - పరమేశ(వికలాంగుల సమైక్యత సంక్షేమ సంఘం అధ్యక్షుడు)
 
 కరువైన కరుణ
 అంగవైకల్య నిర్ధారణకు వచ్చిన వారి పట్ల సదరం క్యాంపులో పనిచేసే ఏపీఎంలు, కిందిస్థాయి సిబ్బంది నిర్దయగా ప్రవర్తించారు. క్యూలోంచి పక్కకు తోసేశారు. మహిళలని కూడా చూడకుండా నెట్టేశారు.  చిన్నారులను భుజాలపై వేసుకుని లోనికి తీసుకెళ్లేందుకు కొందరు ప్రయత్నించినా అవకాశం రాలేదు.
 
 మాట్లాడే ఓపీకే లేదయ్యా
 పొద్దున్నే వచ్చినా.. ఇప్పటి దాకా లోపలికి పంపలేదు. నిలబడేందుకు కూడా చేత కావడం లేదు. నోరెండిపోతోంది. మాట్లాడే ఓపిక కూడా లేదు. ఆ సర్టిఫికెట్ ఏదో దయచేసి ఇప్పించండి.
 - పుల్లమ్మ (రాజీవ్ కాలనీ)
 
 ప్రాణం పోతాంది
 అంగవైకల్య పరీక్ష కోసం ఉదయమే వచ్చా. అతి కష్టం మీద లోపలికి వెళ్లా. జనం మధ్యలో ఊపిరాడక సొమ్మసిల్లి పోయా. రెండు గంటలపాటు జీవచ్ఛవంలా పడి ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. నీరసంతో ప్రాణం పోతాంది.
  - నాగన్న(మల్లాపురం)
 
 ఈ నరకం ఎవరికీ వద్దు
 ఏం సార్ ఎవరూ లోపలికి పంపరు. కాస్త లోపలికి పంపడయ్యా అని వేడుకుంటున్నా.. నిర్దయగా తోసేస్తున్నారు. ఈ నరకం ఎవరికీ వద్దు.
  - దేవీ బాయి(బీ కొట్టాల, ముదిగుబ్బ)
 

>
మరిన్ని వార్తలు