సొంత జిల్లాలకు వలస కూలీలు

30 Apr, 2020 03:59 IST|Sakshi
గుంటూరు జిల్లా నుంచి కర్నూలు జిల్లా ఆస్పరికి చేరిన వలస కూలీలు

2 రోజుల్లో 11,048 మంది తరలింపు

అత్యధికంగా గుంటూరు నుంచి 8,849 మంది కర్నూలు జిల్లాకు తరలింపు

14 రోజులు క్వారంటైన్‌ తర్వాతే ఇంటికి

షెల్టర్లలో ఇంకా 13,800 మంది కూలీలు

సాక్షి, అమరావతి: ఉపాధి కోసం ఇతర జిల్లాలకు వలస వెళ్లిన కూలీలు లాక్‌డౌన్‌తో ఆ జిల్లాల్లో చిక్కుకుపోయారు. ఇలా ఇతర జిల్లాల్లో చిక్కుకుపోయిన వలసకూలీలను రాష్ట్ర ప్రభుత్వం సొంత జిల్లాలకు తరలిస్తోంది. గ్రీన్‌ జోన్‌లో ఉన్న కూలీలను వారి సొంత జిల్లాల్లోని గ్రామాలు కూడా గ్రీన్‌ జోన్‌లోనే ఉంటే కొన్ని నిబంధనలతో తరలించేలా మార్గదర్శకాలు జారీ చేసింది. మంగళ, బుధవారాల్లో 11,048 మంది కూలీలను సొంత జిల్లాలకు తరలించినట్లు కోవిడ్‌–19 నోడల్‌ అధికారి, వాణిజ్య పన్నుల చీఫ్‌ కమిషనర్‌ పీయూష్‌ కుమార్‌ తెలిపారు. అత్యధికంగా 8,849 మందిని గుంటూరు  నుంచి కర్నూలు జిల్లాకు తరలించారు. విశాఖ జిల్లాకు 98 మందిని, విజయనగరానికి 51 మందిని, శ్రీకాకుళానికి 50 మందిని పంపారు. ప్రభుత్వం, వివిధ స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న శిబిరాల్లో ప్రస్తుతం సుమారు 13,800 మంది వలస కూలీలకు ఆశ్రయం కల్పిస్తున్నారు. 

ఇవీ మార్గదర్శకాలు...
► శిబిరాల్లో ఉన్న వలస కూలీలు వ్యవసాయం లేదా పారిశ్రామిక రంగానికి చెందిన వారో గుర్తించాలి
► సొంత జిల్లాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నవారిని గ్రీన్‌ జోన్‌ నుంచి గ్రీన్‌ జోన్‌లోకి మాత్రమే అనుమతిస్తారు.
► రెడ్‌ జోన్‌ నుంచి గ్రీన్‌ జోన్‌కు, గ్రీన్‌ నుంచి రెడ్‌ జోన్‌లోకి వెళ్లేందుకు అనుమతించరు.
► వలస కూలీలకు ర్యాండమ్‌గా కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించాలి. పరీక్షలో నెగిటివ్‌ వస్తేనే ఆయా గ్రామాలకు పంపిస్తారు. 
► తరలింపు సమయంలో భౌతిక దూరం పాటిస్తూ బస్సుల్లో 50 శాతం మందే ప్రయాణించాలి
► శిబిరాల నుంచి తరలించే ముందు ఆయా జిల్లాల అధికారులకు ముందుగా తెలియచేయాలి
► సమీప గ్రామాలతో కలిపి స్థానికంగా క్వారంటైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి విధిగా 14 రోజులు ఉన్న తరువాతే  సొంత ఇళ్ల్లకు వెళ్లేందుకు అనుమతించాలి
► కూలీలు క్వారంటైన్‌లో ఉన్న 14 రోజుల సమయంలో కుటుంబ సభ్యులు, బంధు వులను కలిసేందుకు అనుమతించరు.
► కరోనా నిర్థారణ పరీక్షలో పాజిటివ్‌ వస్తే కోవిడ్‌ ఆస్పత్రికి  తరలించి చికిత్స అందించాలి. 

మరిన్ని వార్తలు