మిస్‌ ఫైర్‌తో మంత్రి ‘ఆది’ గన్‌మ్యాన్‌ మృతి

29 Sep, 2017 03:19 IST|Sakshi

కడప అర్బన్‌: రాష్ట్ర మంత్రి ఆదినారాయణరెడ్డి గన్‌మ్యాన్‌గా ఉన్న ఏఆర్‌ కానిస్టేబుల్‌గా (ఏఆర్‌ పీసీ 1245) బసిరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి (45) గురువారం తన ఇంట్లో ‘పిస్టల్‌’ని శుభ్రపరుస్తుండగా పేలడంతో మృతి చెందారు. దీనిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలిలా వున్నాయి. వైఎస్సార్‌ జిల్లా వల్లూరు మండలం అంబవరానికి చెందిన బసిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మంత్రి ఆదినారాయణ రెడ్డి వద్ద విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం విధులు ముగించుకుని ఇంటికి వచ్చాడు. ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ‘పిస్టల్‌’ను శుభ్రపరుస్తుండగా అకస్మాత్తుగా పేలి బుల్లెట్‌ అతని ఛాతీ కింది భాగం నుంచి దూసుకెళ్లింది.

వెంటనే కుటుంబసభ్యులు గమనించి కడపలోని హిమాలయ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి రిమ్స్‌కు తీసుకెళ్లారు. అప్పటికే చంద్రశేఖర్‌ రెడ్డి మృతి చెందినట్లు రిమ్స్‌లో వైద్యులు నిర్ధారించారు. అతని మృతదేహాన్ని జిల్లా ఎస్పీ బాబూజీ అట్టాడ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘పిస్టల్‌’ను శుభ్రం చేస్తుండగా దురదృష్టవశాత్తు పేలడంతో ప్రమాదం జరిగిందన్నారు. అతని కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ఆయన వెంట జిల్లా అదనపు ఎస్పీ ఎ. శ్రీనివాసులరెడ్డి, ఏఆర్‌ అదనపు ఎస్పీ రిషికేశవ్‌ రెడ్డి, కడప డీఎస్పీ షేక్‌ మాసుంబాష, సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు