కబేళాలకు మూగజీవాలు

24 May, 2014 02:01 IST|Sakshi
కబేళాలకు మూగజీవాలు

ప్యాపిలి, న్యూస్‌లైన్: వర్షాభావ పరిస్థితుల కారణంగా అడవుల్లో పచ్చగడ్డి జాడ కరువైంది. పాడి పశువులకు గ్రాసం కొరత ఏర్పడటంతో బక్కచిక్కి పోతున్నాయి.  వేసవి ప్రారంభానికి ముందే చెరువులు ఎండిపోవడంతో పశువులకు నీటి కొరత ఏర్పడింది. ఎండలు భగభగ మండిపోతుండటంతో మూగజీవాలు పశుగ్రాసం లేక విలవిలలాడుతున్నాయి. మండల కేంద్రంతో పాటు   కౌలుపల్లి, బూరుగల, రాచర్ల, బోంచెర్వుపల్లి, సీతమ్మతాండ, గార్లదిన్నె, పీఆర్ పల్లి, గుడిపాడు, కొమ్మేమర్రి, సిద్దనగట్టు, జలదుర్గం, చిన్నపూదెళ్ల, పెద్దపూదెళ్ల  తదితర గ్రామాల్లో ఎక్కువ శాతం మంది రైతులు పశుపోషణపైనే ఆధారపడి జీవిస్తున్నారు.

పశువులకు ప్రస్తుతం పశుగ్రాసం కొరత ఏర్పడటంతో పశుపోషకులు అందోళన కు గురవుతున్నారు. గతేడాది వర్షాలు అంతంత మాత్రంగానే కురవడంతో చెరువులు, కుంటలకు ఆశించిన నీరు చేరలేదు. పశుగ్రాసం కొనాలన్నా చేతిలో డబ్బులు లేక పోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ట్రాక్టర్ వరి గడ్డి రూ. 7 నుంచి 10 వేలు పలుకుతోందని రైతులు వాపోతున్నారు. పశుగ్రాసం కొనలేక  విధిలేని పరిస్థితుల్లో పశువులను కబేళాలకు తరలించాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు