ఉపాధికి వంద కోట్లు

16 Mar, 2015 02:03 IST|Sakshi

 ఏలూరు :జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జిల్లాకు రూ.100 కోట్లు కేటాయించారు. సోమవారం నుంచి ఈ పనులు ప్రారంభిం చేందుకు డ్వామా అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకూ ప్రతి కూలీకి కనీసం 100 రోజుల పనిదినాలు కల్పిస్తుండగా, ఇకపై దానిని 150 రోజులకు పెంచారు. కేవలం కూలి పనులపైనే ఆధారపడి జీవించేవారికి ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
 
 ఈసారైనా పనులు పూర్తయ్యేనా!
 జిల్లాలో 2008లో ఉపాధి హామీ పథకం ప్రారంభమైంది. కూలీలకు పెద్దఎత్తున పనులు కల్పించాలనే ఉద్దేశంతో ఏటా ఘనమైన లక్ష్యాలు విధిస్తున్నా ప్రయోజనం కలగటం లేదు. మార్గదర్శకాలను అనుసరించి పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నా నిధులను పూర్తిస్థాయిలో వినియోగించటం లేదు. ఫలితంగా కూలీలకు తగిన స్థాయిలో పనులు దొరకటం లేదు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.171 కోట్లతో పనులు చేపట్టారు. మొత్తం 46 బ్లాకులో 888 గ్రామాల్లో 6.10 లక్షల మందికి జాబ్‌కార్డులు జారీ చేశారు. కార్డులు పొందిన కుటుంబాల్లో 12.94 లక్షల మంది కూలీలు ఉన్నారు. మొత్తం కార్డుదారుల్లో ఇప్పటివరకు
 
 కేవలం 1.67లక్షల కుటుంబాలకే పనులు చేసే అవకాశం దక్కింది. ఇందులో 8వేల మందికి మాత్రం 100 రోజుల పని దినాలు కల్పించినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కాగా, మరో 7వేల కుటుంబాలకు 75-100 రోజుల మధ్య పని దొరికింది. అప్పట్లో మిగిలిన పనులను సోమవారం నుంచి చేపట్టి పూర్తి చేయాలనే ఆలోచనతో ఉన్నారు. ఇకపై కూలీలకు 150 రోజుల పనులు కల్పించాలని నిర్ణయించగా, 150 పనిదినాల చొప్పున 6 లక్షల మంది జాబ్ కార్డుదారుల్లో కేవలం 15వేల మందికి మాత్రమే పనులు దొరికే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు పనులు చేసిన కూలీలకు వేతనాలు చెల్లించే విషయంలోనూ అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
 
 136 రకాల పనులు
 జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద 2015-16 సంవత్సరంలో రూ.100 కోట్ల విలువైన పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే 48 మండలాల్లో 136 రకాల పనులను గుర్తించేందుకు గ్రామసభలు నిర్వహిస్తున్నారు. నెలాఖరు నాటికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి నివేదించనున్నారు.
 

>
మరిన్ని వార్తలు