అన్నగారి పదవీ స్వీకారానికి నలభైయేళ్ళు.. మరి వెన్నుపోటుకు, అవమానాలకు ఎన్నేళ్లు?

9 Jan, 2024 18:51 IST|Sakshi

దివంగత నందమూరి తారకరామారావు మొదటి సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికీ సరిగ్గా 41 ఏళ్ళు అయ్యాయి. అయన 1983 జనవరి 9న మొదటిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి వరకు ఉన్న కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడి తొలిసారిగా ఓ ప్రాంతీయపార్టీ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పాలన మొదలైంది. అంతకుముందు తొమ్మిది నెలలపాటు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించిన ఎన్టీఆర్ ప్రజలతో మమేకమయ్యారు. ప్రజా సమస్యలు, ప్రజల ఆవేదన, కష్టాలను తెలుసుకున్నారు.

తర్వాత తన పాలనతో రెండు రూపాయలకు కిలో బియ్యం వంటి పథకాలతో ప్రజల మనస్సుల్లో నిలిచిపోయారు. ప్రజారంజక పాలనలో గొప్ప పేరు తెచ్చుకున్నారు. అయితే నాదెండ్ల భాస్కర రావు వంటివారి కారణంగా కాస్త ఇబ్బంది పడినా సరే మొత్తానికి మళ్ళీ ప్రజామోదం పొంది 1994లో ఘన విజయం సాధించారు. మొత్తం 294 స్థానాలకు గాను 216 సీట్లు తెలుగుదేశం ఖాతాలోకి వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ కేవలం 26 స్థానాల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక అప్పుడు ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో ఇన్నాళ్లుగా ఎన్టీఆర్‌ వెన్నంటి ఉంటూ వచ్చిన అయన చిన్నల్లుడు చంద్రబాబు చక్రం తిప్పడం మొదలుపెట్టారు. మెల్లగా తన తెలివితేటలు బయటకు తీయడం ప్రారంభించారు.

తనకున్న పైరవీ స్కిల్స్, లోపాయికారీ, బ్లాక్‌మెయిల్ వంటి విద్యలన్నీ బయటకు తీసి ఎన్టీఆర్‌ను విలన్ మాదిరి చిత్రీకరించడం మొదలు పెట్టారు. అయన సతీమణి లక్ష్మీపార్వతిని ఒక భూతం మాదిరి చూపెడుతూ ఎన్టీఆర్‌ను విలువలు లేని అసమర్ధుడు అంటూ చిన్నగా ప్రచారం మొదలు పెట్టారు. ఈ క్రమంలో లక్ష్మీపార్వతి ప్రాపకం పొంది.. ఎన్టీఆర్‌కు దగ్గరైన నాయకులు సైతం చంద్రబాబు ఉచ్చులో పడిపోయారు. 

లక్ష్మీపార్వతి ప్రమేయం ప్రభుత్వంలో పెరుగుతోందని.. ఎన్టీఆర్‌కు ప్రజలకు మధ్య గ్యాప్ ఉందని.. తన అనుయాయి మీడియాలో ప్రచారం మొదలు పెట్టిన చంద్రబాబు ఎమ్మెల్యేలను హైదరాబాద్‌లోని వైస్రాయ్ హోటల్లో రహస్యంగా దాచారు. పదిమంది తన క్యాంపులో ఉంటే వంద మంది ఉన్నట్లుగా పత్రికల్లో వార్తలు రాయించి మిగతావారిని సైతం తమవైపు తిప్పుకున్నారు. ఇదంతా చూసి ఎన్టీఆర్‌ మనసు చలించిపోయింది.
చదవండి: flash back: పిల్లి లేవని పొయ్యిపై చంద్రబాబు ఎసరు !

తాను పెట్టిన పార్టీ నుంచి తనను బయటకు పంపే కుట్రలను భరించలేక అయన తన భార్య లక్ష్మీపార్వతితోపాటు వైస్రాయ్ హోటల్ వద్దకు వచ్చి ధర్నా చేయగా ఆయన మీద చంద్రబాబు అనుచరులు చెప్పులతో దాడి చేశారు. ఇది మరింత అవమానకరంగా మారినా ఎన్టీఆర్‌ ఏం చేయలేని పరిస్థితి. మొత్తానికి చంద్రబాబు తన జిత్తులతో ఎన్‌టీ రామారావు నుంచి అధికారాన్ని లాక్కొని, పార్టీని.. పార్టీ నిధులను.. చివరకు సైకిల్ గుర్తును సైతం లాక్కుని 1995 సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారు. దాన్ని తెలుగుదేశం పార్టీతోపాటు రాజకీయ పరిశీలకులు ఆగస్టు సంక్షోభం అని అంటుంటారు.

ఈ అవమానాన్ని భరించలేక ఎన్టీఆర్‌ 1996 జనవరి 18న కన్ను మూశారు. అంతవరకూ రామారావును అసమర్ధుడు.. చేతకానివాడు అంటూ చెబుతూ వచ్చిన చంద్రబాబు.. అయన భజన మీడియా.. ఎన్టీఆర్‌ మరణం తరువాత ఆయనకు మళ్ళీ దండలు వేసి దండాలు పెట్టడం మొదలు పెట్టారు. ఏటా అయన జయంతిని.. వర్థంతిని తూతూమంత్రంగా నిర్వహించి ఆయనకు భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేయడం తెలుగుదేశం కార్యకర్తలకు ఒక  రివాజుగా మారింది. ఎన్టీఆర్‌ అసమర్ధుడు అంటూ ఆయన్ను అవమానించి పార్టీ నుంచి తరిమేసి మళ్లీ ఇప్పుడు అవి  స్వర్ణయుగపు రోజులు అని చెబుతూ చంద్రబాబు ఆయనకు నివాళులు అర్పిస్తూ కాసేపు నటిస్తుంటారు. 
- సిమ్మాదిరప్పన్న

whatsapp channel

మరిన్ని వార్తలు