మెనూ చూడ కడుపు నిండు.. భోజనం చూడ గుండె మండు!

23 Jun, 2014 01:18 IST|Sakshi
మెనూ చూడ కడుపు నిండు.. భోజనం చూడ గుండె మండు!

కర్నూలు(అర్బన్): సంక్షేమ వసతి గృహాల్లో నిర్లక్ష్యం గూడుకట్టుకుంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో సంక్షేమాధికారుల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. మెనూ చార్టులో భోజనం వివరాలు పరిశీలిస్తే కడుపు నిండిపోతుంది. వాస్తవంలోకి వెళితే మెనూ ఎక్కడా అమలుకు నోచుకోని పరిస్థితి నెలకొంది. ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో వారంలో ఆరు రోజులు(సెలవు రోజులు మినహా) ఆయా పాఠశాలల్లోనే హాస్టల్ విద్యార్థులకూ మధ్యాహ్న భోజనం అందుతోంది. ఇక మిగిలింది ఆదివారం మాత్రమే. ఆ రోజు మూడు పూటలా మెనూ అమలు చేయాల్సి ఉండగా.. పెట్టింది తినాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
 
మెనూ ప్రకారం ఉదయం పాలు, పంచదారతో కలిపిన రాగి జావ, టిఫెన్‌కు ఇడ్లీ, పల్లీల చెట్నీ, మధ్యాహ్నం గుడ్డుతో బిరియానీ, కుర్మా, పెరుగుపచ్చడి.. సాయంత్రం ఉడికించిన శనగలు.. రాత్రి అన్నం, కూర, రసం వడ్డించాల్సి ఉంది. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోని పెద్దపాడు బీసీ బాలుర వసతిగృహాన్ని ఉదాహరణగా తీసుకుంటే ఆదివారం ఉదయం ఉగ్గాని.. మధ్యాహ్నం తెల్లన్నం, ఉడికించిన గుడ్డు, రసంతో సరిపెట్టారు. 250 మంది విద్యార్థులున్న ఈ వసతిగృహంలో సగానికి పైగా విద్యార్థులకు గ్లాసులు కూడా లేకపోవడం గమనార్హం. తిన్న ప్లేట్‌ను శుభ్రం చేసుకున్న తర్వాత అందులోనే నీళ్లు పట్టుకుని తాగాల్సిన దుస్థితి. అదేవిధంగా ఏడు గదుల్లోనే వీరంతా సర్దుకుపోవాల్సి వస్తోంది. ఒక్కో గదిలో 30 మందికి పైగా విద్యార్థులు ఉండాల్సి రావడం ఇక్కడి పరిస్థితి అద్దం పడుతోంది.
 
జిల్లాలోని సగానికి పైగా వసతిగృహాల్లోనూ ఇదే పరిస్థితి. ఉడికీ ఉడకని.. లావు బియ్యంతో చేసిన ఆహారం తినలేక అధిక శాతం విద్యార్థులు చెత్తకుండీల్లో పారబోస్తున్నారు. నీళ్ల చారు తినలేక వెక్కిళ్లతో నీటి కోసం విద్యార్థులు పరుగులు తీయడం పరిపాటిగా మారింది. ఆదివారం సెలవు దినం కావడంతో ఉన్నతాధికారులెవరూ పర్యవేక్షించరనే భావన సంక్షేమ హాస్టళ్లలో ఈ దుస్థితికి కారణంగా తెలుస్తోంది. అధిక శాతం హాస్టళ్లకు ప్రహరీ గోడలు లేకపోవడంతో విద్యార్థులు భోజనం చేస్తున్న సమయంలో పశువులు, కుక్కలు, పందులు ఆ ప్రాంతంలో సంచరిస్తున్నాయి. ఈ కారణంగా వ్యాధులు ప్రబలుతుండటం తల్లిదండ్రులను కలవరపరుస్తోంది. అదేవిధంగా చాలీచీలని గదులు.. తాగునీటి ఇక్కట్లు.. మరుగుదొడ్ల కొరతతో విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి.
 
కొరవడిన పర్యవేక్షణ
సంక్షేమ వసతి గృహాలను పర్యవేక్షించాల్సిన సహాయ సంక్షేమాధికారులు ఆయా వసతి గృహాలకు చుట్టపుచూపుగా మాత్రమే వెళ్తున్నారు. వీరంతా కేవలం తమ కార్యాలయాలకే పరిమితం అవుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. బీసీ సంక్షేమ శాఖకు సంబంధించి సహాయ సంక్షేమాధికారుల పోస్టులు దాదాపు ఐదు ఖాళీగా ఉంటే.. వీటికి గ్రేడ్-1 వసతి గృహ సంక్షేమాధికారులు ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా 21 హెచ్‌డబ్ల్యుఓ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. మిగిలిన వాచ్‌మెన్, కమాటీ పోస్టులు దాదాపు 40 వరకు ఖాళీగా ఉన్నా భర్తీకి చర్య చూపని పరిస్థితి నెలకొంది. నాల్గో తరగతి సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్న వసతి గృహాల్లో ఆయా పనులన్నీ విద్యార్థులే చేయాల్సి వస్తుండటం గమనార్హం.

>
మరిన్ని వార్తలు