తోడొకరుండిన అదే భాగ్యము!

8 Oct, 2023 07:25 IST|Sakshi

తోడుండటమే పండు జీవితం. ఏడడుగులతో పడే బంధం. ఏడు జన్మలు కొనసాగాలనుకునే బంధం వైవాహిక బంధం. భార్యకు భర్త.. భర్తకు భార్య.. సంసారాన్ని ఈదాక ఏడు పదుల వయసు దాటాక ఒకరికి ఒకరై మరీ మెలగాలి. తమిళనాడులోని ఒక వృద్ధ జంట మధ్యాహ్న భోజనం తయారు చేసుకునే వీడియో పది లక్షల వ్యూస్‌ పొందింది. 

రోజులు కొందరికి కలిసి వస్తాయి. పెళ్లయిన నాటి నుంచే భార్య మనసు భర్తకు అర్థమయ్యి, భర్త స్వభావాలు భార్య అకళింపు చేసుకుని కాపురాన్ని కాపాడుకుంటూ వస్తారు. పిల్లల్ని కని, పెద్ద చేసి ఒక దారికి చేరుస్తారు. ఆ తర్వాత? తామిద్దరూ జీవించాలి. ఏం భయం? ఇప్పటికే ఎంతో జీవితం గడిపారు. కష్టసుఖాలు పంచుకున్నారు. అనుబంధాన్ని దృఢం చేసుకున్నారు. పిల్లలు దూరంగా ఉన్నా హాయిగా జీవిస్తారు. అతను కూరగాయలు తెస్తాడు. ఆమె వంట చేస్తుంది. ఇద్దరూ కలిసి హాస్పిటల్‌కు వెళ్లి వస్తారు.

గుళ్లకు తిరుగుతారు. ఓపికుంటే పర్యటనలు చేస్తారు. నేనున్నానని.. నీకై నిలిచే.. తోడొకరుండిన అదే భాగ్యము.. అదే స్వర్గము అని రాశాడు శ్రీశ్రీ. తమిళనాడులో ఒక జంట అలాంటిదే. మధ్యతరగతికి చెందిన ఈ జంట ముదిమి వయసులో కలిసి మధ్యాహ్న వంట చేసుకుంటున్న వీడియోను అభిషేక్‌ చందరమరక్షణ్‌ అనే ఇన్‌స్టా యూజర్‌ పోస్ట్‌ చేశాడు. తన భార్యతో కలిసి వీడియోలు చేసే అభిషేక్‌ ఈ వీడియో పోస్ట్‌ చేస్తూ ‘భవిష్యత్తులో నువ్వూ నేనూ’ అనే క్యాప్షన్‌ పెట్టాడు. నిజమే.. ఈ వీడియో చూసిన యువ జంటలు ఆ వయసులో తాము అలా ఉంటే ఎంత బాగుంటుంది అని వ్యాఖ్యానించారు. జీవితం పండాలి... అని పెద్దలు అంటారు. పండు వయసులో భార్యకు భర్త; భర్తకు భార్య.

(చదవండి: అయ్‌బాబోయ్‌... ఇదేం డాన్సండీ!)

మరిన్ని వార్తలు