ఎమ్మెల్యే కోటంరెడ్డి అరెస్ట్‌

7 Oct, 2019 04:47 IST|Sakshi

వెంకటాచలం ఎంపీడీఓ సరళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు

ఎమ్మెల్యేతో పాటు రీకాంత్‌రెడ్డిని అరెస్టు చేసిన నెల్లూరు రూరల్‌ పోలీసులు

నిందితులకు బెయిల్‌ మంజూరు

నిజనిర్ధారణ కమిటీ వేసి విచారణ జరిపించాలి: శ్రీధర్‌రెడ్డి

నెల్లూరు(సెంట్రల్‌)/సాక్షి, అమరావతి: తన ఇంటిపై దాడి చేశారని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడీఓ సరళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నెల్లూరు రూరల్‌ పోలీసులు ఆదివారం ఉదయం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని అరెస్టు చేశారు. ప్రభుత్వ వైద్యశాలకు తరలించి, వైద్య పరీక్షలు నిర్వహించి, రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఇదే కేసులో ఎమ్మెల్యేతో పాటు వైఎస్సార్‌సీపీ నేత బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డిని కూడా అరెస్టు చేశారు. ఎమ్మెల్యేను, శ్రీకాంత్‌రెడ్డిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా, బెయిల్‌ మంజూరు చేశారు.

దౌర్జన్యం చేశానని నిరూపిస్తే క్షమాపణ చెబుతా..
తాను ఏ తప్పూ చేయలేదని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. న్యాయమూర్తి బెయిల్‌ మంజూరు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంపీడీఓ సరళ ఇంటిపై తాను దాడి చేశాననడం అవాస్తవం అని చెప్పారు. సరళ తనకు సోదరితో సమానమని పేర్కొన్నారు. ఆమె తల్లి తనకు తల్లితో సమానమన్నారు. తన సన్నిహితుడికి సంబంధించిన లేఔట్‌ విషయంలో మంచినీటి కుళాయి ఇవ్వాలని గతంలో అడిగాను తప్ప ఏనాడూ ఆమెను తిట్టడం గానీ, ఆమె ఇంటికి వెళ్లి దౌర్జన్యం చేయడం గానీ చేయలేదన్నారు. ప్రభుత్వం నిజనిర్ధారణ కమిటీ వేసి, విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవచ్చని చెప్పారు.

తాను ఎంపీడీఓ విషయంలో తప్పు చేసి ఉంటే తనను పార్టీ నుంచి షోకాజ్‌ నోటీసు ఇవ్వకుండా బహిష్కరించవచ్చని అన్నారు. తాను ఎంపీడీఓ ఇంటికి వెళ్లి దౌర్జన్యం చేశానని నిరూపిస్తే సరళకు క్షమాపణ చెప్పడంతో పాటు, ఆమె తల్లికి కూడా క్షమాపణ చెబుతానన్నారు. నెల్లూరు ఎస్పీ పక్షపాతంగా అర్ధరాత్రులు వచ్చి, తన ఇంటి వద్ద హడావుడి చేసి అరెస్టు చేశారని శ్రీధర్‌రెడ్డి ఆక్షేపించారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులపై దాడులు జరిగినా బాధ్యులపై చర్యలు తీసుకోలేదని గుర్తుచేశారు. ఇప్పుడు ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తక్షణమే స్పందించడం అభినందనీయమని అన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని వ్యాఖ్యానించారు.

ప్రభుత్వంపై నమ్మకం పెరిగింది: ఎంపీడీఓ సరళ
తన ఇంటిపై దాడి జరిగిన ఫలితంగా ఇకపై ఉద్యోగం చేయగలమా అనే పరిస్థితుల్లో.. ఇంకెవరికీ ఇలా జరగకూడదనే ఉద్దేశంతో పోలీసులకు ఫిర్యాదు చేశానని వెంకటాచలం ఎంపీడీఓ సరళ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించిన తీరు ఉద్యోగులందరికీ ఒక భరోసా, ధైర్యం, నమ్మకాన్ని కలిగించిందని తెలిపారు. స్వేచ్ఛగా పనిచేయగలిగే ధైర్యాన్ని ముఖ్యమంత్రి కల్పించారని అన్నారు. ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని ముఖ్యమంత్రి కాపాడారని చెప్పారు. ప్రభుత్వంపై ఉద్యోగులకు నమ్మకం పెరిగిందన్నారు.

సీఎంకు ఏపీ జేఏసీ ధన్యవాదాలు  
ఎంపీడీఓ సరళ ఫిర్యాదుపై స్పందించి, జరిగిన సంఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఏపీ జేఏసీ–అమరావతి ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు ఏపీ జేఏసీ నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఫణి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వెంకటాచలం ఎంపీడీఓ సరళపై ఇంటిపై దాడి ఘటనలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆయన అనుచరులను అరెస్టు చేయడం పట్ల ఏపీ జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. అధికారం చేపట్టిన అనతి కాలంలోనే అన్ని వసతులు కల్పిస్తూ వైఎస్‌ జగన్‌ ఉద్యోగుల పక్షపాతిగా పేరొందారని వెల్లడించింది. ఉద్యోగులపై దాడి జరిగినప్పుడు అండగా నిలిచి, వెంటనే చర్యలు చేపట్టడం పట్ల ధన్యవాదాలు తెలియజేసింది.
 

మరిన్ని వార్తలు