నోటు కష్టం

2 Mar, 2018 10:45 IST|Sakshi

జిల్లాలో తీవ్రమైన నగదు కొరత

చేతులెత్తేసిన బ్యాంకర్లు

పింఛన్ల పంపిణీకీ క్యాష్‌ ఎఫెక్ట్‌  

మొదటి వారం కావడంతో బ్యాంకులపై తీవ్ర ఒత్తిడి  

ఈయన పేరు ఉప్పరి ధర్మరాజు. క్రిష్ణగిరి మండలం మాదాపురం గ్రామానికి చెందిన ఈయన పొలంలో పండిన వేరుశనగలను మద్దతు ధరతో ఆయిల్‌ఫెడ్‌ కొనుగోలు కేంద్రంలో అమ్ముకున్నాడు. ఇందుకు సంబంధించి రూ.95వేలు వెల్దుర్తి ఏపీజీబీలోని ఆయన ఖాతాకు 15 రోజుల క్రితం జమ అయింది. 10 రోజులుగా బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా నగదు లేదని సమాధానమిస్తున్నారు. గట్టిగా అడిగితే నగదు రావడం లేదని చెబుతున్నారు.

కర్నూలు(అగ్రికల్చర్‌)/వైఎస్‌ఆర్‌ సర్కిల్‌: అసలే మొదటి వారం.. ఆపై నగదు కొరత.. ఇంకేముంది. ఎక్కడ చూసినా రూకలకు ఇక్కట్లే. ఏటీఎంల ముందు నో క్యాష్‌ బోర్డులు, బ్యాంకుల్లో తర్వాత రండి అనే సమాధానాలు నిత్యకృత్యమయ్యాయి. ఫలితంగా అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా వేతన జీవుల అవస్థలు     అన్నీఇన్నీ కావు. 

ఇదీ పరిస్థితి..
జీతాలు, పింఛన్‌ల పంపిణీ కోసం జిల్లాకు కనీసం రూ.100 కోట్లు అవసరముండగా బ్యాంకుల్లో రూ.20 కోట్లు కూడా లేని దుస్థితి నెలకొంది. ఈ క్రమంలో పింఛన్ల పంపిణీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగిపోరాదని, ఇందుకు అవసరమైన నగదు సిద్ధం చేయాలన్న కలెక్టర్‌ ఆదేశాల మేరకు రూ.30 కోట్లు అత్యవసరంగా సర్దుబాటు చేయాలని ఎల్‌డీఎం 5 రోజుల క్రితమే ఆర్‌బీఐని కోరినా ఫలితం లేకుండా పోయింది. ఎఫ్‌ఆర్‌డీఏ బిల్లు వల్ల కలిగే పరిమాణాలు పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లడంతో బ్యాంకులకు డిపాజిట్‌లు రావడం  తగ్గిపోయింది. ఇదే సమయంలో బ్యాంకుల నుంచి నగదు ఉపసంహరణ మూడు,నాలుగు రెట్లు పెరిగింది.  దీంతో నగదు కష్టాలు పెరిగిపోయాయి. పింఛన్‌లు, జీతాల పంపిణే కష్టంగా మారింది. రైతులు ఇతర వర్గాల పరిస్థితి మరింత దారుణంగా ఉంది.  జిల్లాలో 465 బ్యాంకు శాఖలుండగా 80 శాతం డబ్బులేక దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. కోటి రూపాయలు పంపాలని ప్రాంతీయ కార్యాలయాలను కోరితే రూ.5లక్షలు కూడా ఇవ్వడం లేదు. ఏటీఎంలదీ ఇదే పరిస్థితి. జిల్లాలో 485 ఏటీఎంలుండగా 85శాతం వరకు నో క్యాష్‌ బోర్డులు కనిపిస్తున్నాయి.  ఫలితంగా 20 రోజులుగా  బ్యాంకుల్లో లావాదేవీలు గణనీయంగా పడిపోయాయి.  ఈ కారణంగా మళ్లీ పెద్ద నోట్ల రద్దునాటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 

6 నెలలుగా నగదు సరఫరా బంద్‌..
రిజర్వు బ్యాంకు నుంచి దాదాపు ఆరు నెలలుగా నగదు సరఫరా బంద్‌ అయింది. ‘తగినంత నగదు ముద్రించి పంపాము. ప్రజల్లోకి వెళ్లిన నగదు సర్క్యులేషన్‌లో లేదు. దాచి పెట్టుకుంటుండటం వల్ల నగదు సమస్య ఏర్పడుతోంది. ప్రభుత్వం, బ్యాంకులే సమన్వయంతో నగదు కొరత తీర్చుకోవాలి’ అని ఆర్‌బీఐ అధికారులు స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో నగదు రహిత లావాదేవీలు పెంచుకోవాలని ఉచిత సలహాలు ఇస్తున్నారు.  నగదు రహిత లావాదేవీలు పడిపోవడం, ప్రజల్లోకి వెళ్లిన నగదు తిరిగి బయటికి రాకపోతుండటం, డిపాజిట్లు బంద్‌ కావడం, ఆర్‌బీఐ నుంచి నగదు రావడం నిలిచిపోవడం తదితర కారణాల వల్ల క్యాష్‌ కష్టాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.  కొన్ని బ్యాంకులు నగదు కోసం రేపు, మాపు అంటుండగా మరికొన్ని బ్యాంకుల్లో రూ.50వేలు అడిగితే రూ.10 వేలు, రూ.5వేలు ఇచ్చి పంపుతున్నారు. దీంతో అందరూ అవస్థలు పడుతున్నారు.   

బ్లాక్‌ అవుతున్న పెద్ద నోట్లు..
 రూ.2వేల నోట్ల సర్క్యులేషన్‌ గణనీయంగా పడిపోయింది. ఈ నోట్ల ముద్రణను ఆర్‌బీఐ పూర్తిగా నిలిపివేసింది. బ్యాంకుల నుంచి బయటికి వెళ్లిన నోట్లు ఎక్కడివక్కడ బ్లాక్‌ అవుతున్నాయి. పెద్ద నోట్లను చాలా వరకు లాకర్లలో పెడుతున్నట్లు సమాచారం.  

రూ.15వేల కంటే ఎక్కువ ఇవ్వలేము....  
ఆర్‌బీఐ నుంచి ఆరు నెలలుగా నగదు రావడం లేదు. దీంతో క్యాష్‌కు ఇబ్బందిగా ఉంది. ఉద్యోగులకు  జీతాలు ఇవ్వడానికి ఒక్క ట్రెజరీ బ్యాంకుకే రూ.5కోట్లు అవసరం. 15 రోజుల నుంచి రోజు కింత తీసిపెడుతూ రూ.కోటి వరకు నిల్వ ఉంచాం. ఉద్యోగుల ఖాతాలకు జీతాలు జమ అయినా.. రూ.15వేల కంటే ఎక్కువ ఇవ్వలేం.  ట్రెజరీ బ్రాంచి ఏటీఎంలో మాత్రం నగదు ఉంచుతున్నాం. బయటి వాళ్లు వచ్చి నగదు తీసుకుంటున్న కారణంగా రాత్రిళ్లు క్లోజ్‌ చేస్తున్నాం.  – కల్యాణ్‌కుమార్, చీఫ్‌ మేనేజర్, ఎస్‌బీఐ ట్రెజరీ బ్రాంచ్‌

మరిన్ని వార్తలు