ఆవులపై విష ప్రయోగం జరగలేదు

11 Aug, 2019 15:13 IST|Sakshi

నిజాలు నిగ్గు తేల్చేందుకు రహస్య విచారణ

సాక్షి, విజయవాడ: కొత్తూరు తాడేపల్లిలోని గోసంరక్షణశాలలో ఆవుల మృతికి టాక్సిసిటీ కారణమని ప్రాథమిక విచారణలో తేలినట్లు పశుసంవర్థక శాఖ అడిషనల్ డైరెక్టర్ దామోదర్ నాయుడు తెలిపారు. అయితే, టాక్సిసిటీ అంటే విష ప్రయోగం కాదని, విషతుల్యమైన పదార్థాలు కారణమని ఆయన చెప్పారు. పచ్చగడ్డిలో పాస్ఫరస్, నత్రజని శాతం ఎక్కువైనా టాక్సిసిటీ కారణమయ్యే అవకాశముంటుందని తెలిపారు. ఆవులపై విషప్రయోగం జరగలేదని ఆయన స్పష్టం చేశారు. మృతిచెందిన ఆవుల పోస్టుమార్టం నివేదిక మంగళవారం వస్తుందని, వారంలోపు ఫోరెన్సిక్ నివేదిక కూడా రానుందని దామోదర్‌ నాయుడు వెల్లడించారు.  కొత్తూరు తాడేపల్లిలోని గోశాలలోని దాదాపు 80కిపైగా గోమాతలు ఆకస్మికంగా మృతి చెందిన సంగతి తెలిసిందే.

పోలీసుల విచారణ వేగవంతం
ఆవుల మరణంపై పోలీసులు తమ విచారణను వేగవంతం చేశారు. ఈ ఘటనపై గోశాల నిర్వాహకులు చెప్తున్న విషయాలపై పోలీసులు సంతృప్తి చెందడం లేదు. ఈ ఘటన వెనుక వాస్తవాలు వెలికితీసేందుకు రహస్య విచారణ చేపట్టారు. గోవులు మృతిచెందిన రోజు సాయంత్రం నుంచి రాత్రివరకు గోశాలలో ఎవరెవరు ఉన్నారు?.  కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చారా?. పశుగ్రాసం విషతుల్యం అయిందా? చనిపోయిన గోవులు మాత్రమే ఆ గ్రాసం తిన్నాయా? అది సాధ్యమా? పనికట్టుకుని ఎవరైనా గోవులకు విషతుల్యమైన ఆహారం అందేలా చేశారా? ఒకవేళ పశువైద్యులు అనుమానిస్తున్నట్లు అధిక ఆహారం వల్లే గ్యాస్‌ ఏర్పడి మృత్యువాత పడ్డాయా? విషపూరితమైన లేత జున్నుగడ్డిని గోవులకు ఎవరైనా పెట్టారా? అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆవుల మృతి చెందిన ఘటనపై విజయవాడ కొత్తపేట పోలీస్‌ స్టేషన్‌లో శనివారం కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. గో సంరక్షణ సమితి కార్యదర్శి సాబు గోవిందకుమార్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 9వ తేదీ రాత్రి గడ్డి తిన్న ఆవులు మృతి చెందాయని గోశాల సూపర్‌వైజర్‌ ఫోన్‌చేసి తమకు సమాచారం అందించాడని, దాంతో తామంతా అక్కడికి వెళ్లి  పరిస్థితిని పరిశీలించామని గోవింద్‌కుమార్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

గోశాలను సందర్శించిన కమలానంద భారతీ స్వామి
వీహెచ్‌పీ నేతలతో కలిసి కొత్తూరు తాడేపల్లిలోని గోశాలను భువనేశ్వరి మఠం పీఠాధిపతి కమలానంద భారతీ స్వామి సందర్శించారు. గోశాలలో జరిగిన సంఘటన హృదయాన్ని కలచివేసిందని ఈ సందర్భంగా కమలానంద భారతీ స్వామి పేర్కొన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. ఖననం చేసిన గోమాతలకు శాంతి పూజలు  చేయించాలని నిర్వాహకులకు సూచించారు.

మరిన్ని వార్తలు