భైరవా... నీ మార్గానికి మోక్షమెప్పుడు?

6 Feb, 2019 06:28 IST|Sakshi
రాళ్లు తేలిన మార్గంలో ఆలయానికి నడిచి వెళ్తున్న భక్తులు భైరవస్వామి

అప్పన్న దేవస్థానం ఆధీనంలో ఆలయం

అటవీశాఖ పరిధిలో ఆలయానికి వెళ్లే మార్గం

రాళ్లు తేలిన రోడ్డుపైనడవలేకపోతున్న భక్తులు

భక్తులు పెరుగుతున్నా... సౌకర్యాలు మాత్రం శూన్యం

మంత్రి గంటా హామీ మాటలకే పరిమితం

విశాఖపట్నం, సింహాచలం(పెందుర్తి): భైరవస్వామి ఆలయానికి వెళ్లే భక్తుల సంఖ్య విశేషంగా పెరుగుతోంది. అలాగే సింహాచలం దేవస్థానానికి ఆదాయం కూడా పెద్ద ఎత్తున చేకూరుతోంది. ఇక్కడ పూజాసామగ్రి విక్రయానికి దేవస్థానం నిర్వహించే బహిరంగ వేలం పాటకు కూడా లక్షల్లో డిమాండ్‌ ఏర్పడింది. కానీ ఆలయానికి చేరుకునే మార్గానికే ఏళ్ల తరబడి మోక్షం లభించడం లేదు. అలాగే ఆలయం వద్ద భక్తులకు సరైన సౌకర్యాలు కూడా అందుబాటులో లేవు. రోడ్డు వచ్చి తమ బాధలు ఎప్పుడు తీరతాయా అని భక్తులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అలాగే ఆలయం వద్ద సౌకర్యాలు ఎప్పుడు కల్పిస్తారా అని ఆశతో ఎదురుచూస్తున్నారు.

వివరాలికి వేళ్తే.... సింహాచలం నుంచి శొంఠ్యాం వెళ్లే ప్రధాన రోడ్డు మార్గంలో నాలుగు కిలోమీటర్ల దూరంలో భైరవవాక ఉంది. అక్కడి నుంచి రెండున్నర కిలోమీటర్లు అటవీ మార్గంలో పయనిస్తే భైరవస్వామి ఆలయం వస్తుంది. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకునేందుకు సింహాచలం వచ్చే భక్తుల్లో చాలా మంది భైరవస్వామిని దర్శించుకునేందుకు భైరవవాకు వెళ్తుంటారు. ముఖ్యంగా అమావాస్య రోజుల్లోను, భైరవుడి పుట్టిన రోజైన భైరవాష్టమిరోజుల్లోను, నెల నెలా వచ్చే అష్టమిరోజుల్లోను, ప్రతి శని, ఆదివారాల్లోనూ భక్తుల సంఖ్య గణనీయంగా ఉంటుంది. స్వామికి అభిషేకాలు నిర్వహించి, విభూదిని భక్తులు సమర్పిస్తారు. అమృతకలశలను అందజేస్తారు. ఇంతటి ఘన చరిత్ర ఉన్న భైరవస్వామి ఆలయానికి చేరుకునే మార్గంలో ప్రయాణించాలంటే మాత్రం భక్తులు నరకం చూస్తున్నారు. మార్గమంతా రాళ్లు తేలిన రోడ్డే ఉంటుంది. పెద్ద పెద్ద గోతులతో దర్శనమిస్తుంది. ఇక వర్షం వస్తే గోతుల్లో పెద్దె ఎత్తున నీరు నిలుస్తుంది. ఏళ్ల తరబడి భక్తులు ఈ దీనావస్థలో ఉన్న మార్గంలోనే రాకపోకలు సాగిస్తున్నారు. అలాగే అమావాస్య రోజుల్లో ఈ మార్గమంతా తీవ్ర రద్దీ నెలకుంటోంది. వాహనాలు పెద్ద ఎత్తున నిలిచి ట్రాఫిక్‌ స్తంభిస్తోంది.

అటవీశాఖ ఆధీనంలో ఆలయానికి వెళ్లే మార్గం–దేవస్థానం ఆధీనంలో ఆలయం
భైరవస్వామి ఆలయానికి మార్గం వేయాలంటే ఒక ముఖ్య సమస్య నెలకుంది. ఆలయానికి చేరుకునే రెండున్నర కిలోమీటర్లు ఉన్న మార్గం అటవీశాఖ ఆధీనంలో ఉండగా, ఆలయం మాత్రం సింహాచలం దేవస్థానం ఆధీనంలో ఉంది. సింహాచలం దేవస్థానం మార్గాన్ని వైడల్పు చేసి రోడ్డు వేసేందుకు పలుమార్లు పూనుకున్నా అటవీశాఖ నుంచి అనుమతి రాలేదు. ఇప్పటికే పలుమార్లు అటవీశాఖ, దేవస్థానానికి మధ్య రోడ్డు మార్గం ఏర్పాటుపై పరిశీలనలు కూడా జరిగాయి. కానీ ఇప్పటికీ సమస్య తీరలేదు.

ఆలయం వద్ద సౌకర్యాలు నిల్‌
ఇక ఆలయం వద్ద సౌకర్యాలు కల్పించడంలో కూడా దేవస్థానం అశ్రద్ధ వహిస్తోంది. కనీసం భక్తులు తాగడానికి మంచినీరుకూ కూడా నోచుకోవడం లేదు. అలాగే విశ్రాంతి తీసుకునేందుకు షెల్టర్లులేవు. ఇక్కడ ఉన్న బోరు పనిచేయకపోగా, నుయ్యి ఎండిపోయింది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

భయమేస్తోంది
నేను ప్రతి అమావాస్యకు భైరవస్వామి ఆలయానికి వస్తుంటాను. వచ్చినప్పుడల్లా నడిచే వెళ్తుంటాను. రోడ్డు మార్గంలో ఉన్న రాళ్లను చూస్తే నడవడానికి భయవేస్తోంది. అలాగే రాళ్లు తేలిన రోడ్డుపై చిన్నారులను ఎత్తుకుని నడిచే పలువురి భక్తులు పడే బాధ కూడా కలచివేస్తోంది. ఇప్పటికైనా మార్గాన్ని వెడల్పు చేసి రోడ్డు వేయాలి.–కె.సత్యనారాయణ, వేపగుంట

మంత్రి గంటా హామీ మాటలకే పరిమితం
భైరవస్వామి ఆలయానికి రోడ్డుమార్గం వేయడానికి కృషి చేస్తానని మంత్రి గంటా శ్రీనివాసరావు హామీలు కురిపించారు తప్ప ఆ తర్వాత పట్టించుకోలేదు. పలుమార్లు గంటా శ్రీనివాసరావు భైరవస్వామి దర్శనానికి వచ్చారు. అప్పట్లో పలువురు భక్తులు, స్థానికులు రోడ్డు విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అటవీశాఖ దృష్టికి విషయాన్ని తీసుకెళ్తామని హామీలు ఇచ్చారు తప్ప ఆ తర్వాత విషయాన్ని పట్టించుకోలేదు.

>
మరిన్ని వార్తలు