‘అవుట్‌ పేషెంట్‌’కూ అండ!

11 May, 2020 04:40 IST|Sakshi

కరోనా నేపథ్యంలోనూ ఆగని సేవలు

అన్ని ఆస్పత్రుల్లోనూ అవుట్‌ పేషెంట్లకు అందుతున్న వైద్యం 

ఏప్రిల్‌ నెలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చిన ఓపీ రోగులు 11.41 లక్షలు

సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లోనూ భారీగా నమోదు

సాక్షి, అమరావతి: ఓ వైపు కోవిడ్‌ నివారణకు వైద్యం అందిస్తూనే, మరోవైపు మిగాతా వైద్య సేవలకు ఇబ్బందుల్లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీంతో లక్షలాది మంది అవుట్‌ పేషెంట్, ఇన్‌పేషెంట్‌ సేవలు పొందారు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల నేపథ్యంలో వారికి వైద్యం, క్వారంటైన్‌లు తదితర పనుల్లో అధికారులు మునిగితేలుతున్నారు. దీంతో చాలా రాష్ట్రాల్లో మిగతా వైద్య సేవలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. అయితే ఇలాంటి పరిస్థితులు రాకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. 

► ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాస్పత్రుల వరకూ అవుట్‌ పేషెంట్, ఇన్‌పేషెంట్‌ సేవలు, శస్త్రచికిత్సలు.. ఇలా అన్నిరకాల వైద్యసేవలనూ అందుబాటులోకి తెచ్చింది. 
► రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1175 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏప్రిల్‌ నెలలోనే 11.41 లక్షల మంది అవుట్‌ పేషెంట్‌ సేవలు వినియోగించుకోగా, మరో 27 వేల మంది పైచిలుకు ఇన్‌పేషెంట్‌ సేవలు పొందారు.
► మరోవైపు ఐదు బోధనాస్పత్రులను కోవిడ్‌ ఆస్పత్రులుగా మార్చినా ప్రత్యామ్నాయంగా కరోనేతర కేసులకు ఇతర ఆస్పత్రుల్లో సేవలందిస్తున్నారు.
► రాష్ట్రంలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో పీహెచ్‌సీల్లో 1.46 లక్షల మంది వైద్యసేవలు పొందారు
► బోధనాస్పత్రుల్లో తీవ్ర శ్వాసకోశ వ్యాధులకు సంబంధించి 1070 మంది చికిత్స చేయించుకున్నారు. 
► అత్యధికంగా అనంతపురం జిల్లాలోని సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో 1.05 లక్షల మంది సేవలు పొందారు.
► సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో ఏప్రిల్‌ నెలలోనే 13 వేలకు పైగా ప్రసవాలు జరిగాయి.
► ఓపీ, ఐపీ (అవుట్‌ పేషెంట్, ఇన్‌పేషెంట్‌) సేవలతో పాటు ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో ఆ ఒక్క నెలలో 2.87 లక్షల ల్యాబొరేటరీ నిర్ధారణ పరీక్షలు జరిగాయి
► ఇన్‌పేషెంట్ల విషయంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో ఏప్రిల్‌ నెలలో 10,894 మంది సేవలు పొందారు
► మే ఒకటో తేదీ నుంచి కూడా నాన్‌ కోవిడ్‌ సేవలు యథావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి.
► అన్ని ఆస్పత్రుల్లో కలిపి ఒక్క నెలలో ఓపీ సేవలు వినియోగించుకున్న వారు 20,89,603 మంది ఉన్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు