‘బిల్లు’లో అభ్యంతరకర అంశాలు

7 Dec, 2013 23:42 IST|Sakshi

 జోగిపేట, న్యూస్‌లైన్:  కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన విభజన బిల్లులో తెలంగాణకు అభ్యంతరకరమైన అంశాలు ఉన్నాయని వాటిని వెంటనే తొలగించాలని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్. సత్యనారాయణ డిమాండ్ చేశారు. శనివారం ఆయన జోగిపేటలో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాలు, పెన్షను, జలాలు, ఆస్తులు, అప్పులు, ఉన్నత విద్యకు సంబంధించిన అం శాల్లో  తెలంగాణకు నష్టం జరిగే విధంగా ముసాయిదాలో పొందుపరచారన్నారు. ఆరు సూత్రాల పథకానికి విరుద్ధంగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన 83వేల మంది తెలంగాణ వారికి చెందిన ఉద్యోగాల్లో అక్రమంగా చేరారన్నారు.  

1969లో జీఓ 36 ప్రకారం 24వేల మంది అక్రమంగా నియమితులయ్యారని, 1985లో జీఓ 610 ప్రకారం 59 వేల మంది అక్రమంగా నియమితులయ్యారని, వీరిని వెంటనే వారి వారి స్వస్థలాలలకు పంపించాలని జీఓ జారీ చేసినా నేటి వరకు అమలుకాలేదన్నారు. ఆరు సూత్రాల పథకానికి విరుద్ధంగా ఆంధ్ర ఉద్యోగులు 1.62 లక్షల మంది తెలంగాణలో పనిచేస్తున్నారన్నారు. వీరందరిని ఆంధ్ర ప్రాంతానికి పంపిస్తే తెలంగాణకు సంవత్సరానికి రూ.5 వేల కోట్లు మిగులుతాయన్నారు. కృష్ణా, గోదావరి జలాలను ప్రాం తాల వారీగా పంపిణీ చేయాలన్నారు. రాష్ట్రంలో రూ.1.70 వేల కోట్ల అప్పులున్నాయని, వీటిని ఏ ప్రాంతానికి ఎక్కువ ఖర్చుపెట్టారో ఆ విధంగానే పంపకాలుండాల న్నారు.

సింగరేణి, విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ఆంధ్ర ఉద్యోగుల నుంచి ఎలాంటి సూచనలు ముసాయిదాలో చేయలేదన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ శాంతి భద్రతలను రాష్ట్ర గవర్నర్‌కు అప్పగించారని విమర్శించారు. సమావేశంలో అందోల్ నియోజకవర్గ ఇన్‌చార్జి పి.కిష్టయ్య, జిల్లా నాయకులు డీబీ నాగభూషణం, ఏ.శంకరయ్య, మండల నాయకులు సిహెచ్.వెంకటేశం, జి.ఎల్లయ్య, ఎండి.ఖాజా పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు