-

రూ.56 కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్లు

30 Sep, 2013 01:39 IST|Sakshi
 ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో విద్యుత్ లో ఓల్టేజీ సమస్యను పరిష్కరించేందుకు రూ.56 కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. ఏలూరు ఇరిగేషన్ అతిథి గృహంలో ఆదివారం జిల్లా అధికారులతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెనుగొండ, యర్నగూడెం, నారాయణపురంలో 132/33 కేవీ సబ్ స్టేషన్లతో పాటు  మొత్తం 20 నిర్మించ నున్నట్టు తెలిపారు.  జిల్లాలో రూ. 69 కోట్లతో చేపట్టిన 69 వేల వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. జిల్లాలో 75 వేల మందికి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలని ప్రణాళిక రూపొందించగా తొలిదశలో 69 వేల మరుగుదొడ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. జిల్లాలో ఖాళీగా ఉన్న డాక్టర్  పోస్టులకు త్వరలో భర్తీచేస్తామని పేర్కొన్నారు. 
 
 ఉద్యాన పంటలకు ప్రోత్సాహం
 జిల్లాలో రూ. 6 కోట్ల 34 లక్షలతో పలు రకాల ఉద్యాన తోటల విస్తరణకు, 5 వేల ఎకరాల్లో పండ్ల తోటల సాగుకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. జ్వరాలు, అంటువ్యాధులు ప్రబల కుండా వైద్యశిబిరాలు నిర్వహించాలని డీఎంహెచ్‌వో టి.శకుంతలను ఆదేశించారు. మాతృత్వ సహయోగ పథకంకింద రూ. 10.78 కోట్లతో లబ్ధిదారులకు పోషకాహారం అందిస్తున్నామని వివరించారు. కలెక్టర్ సిద్ధార్థజైన్ మాట్లాడుతూ అమ్మహస్తం పథకం కింద నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని, నీలం తుపానుతో నష్టపోయిన రైతులకు రూ.205 కోట్ల పంటల బీమాను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు మాట్లాడుతూ గ్యాస్ వినియోగదారుల ఆధార్ అనుసంధాన ప్రక్రియ 45 శాతం పూర్తయిందని, త్వరలోనే 70 శాతం, నవంబర్ నాటికి నూరుశాతం పూర్తిచేస్తామన్నారు. ఇరిగేషన్ ఎస్‌ఈ వై.సుధాకర్, సోషల్ వె ల్ఫేర్ జేడీ కె.మల్లికార్జునరావు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు