నేడు కూడా పింఛన్ల పంపిణీ

4 Feb, 2020 05:16 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఇప్పటికే 93 శాతం మందికి అందజేత 

సాక్షి, అమరావతి : వలంటీర్ల ద్వారా ఇంటి వద్దే పింఛన్లను పంపిణీ చేసే కార్యక్రమం మంగళవారం కూడా కొనసాగనుంది. ప్రతినెలా మూడు పనిదినాలు వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈనెల ఒకటో తేదీనే వాటి పంపిణీని ప్రారంభించిన వలంటీర్లు.. రెండో రోజు ఆదివారం సెలవు దినమైనప్పటికీ పింఛన్లు అందజేశారు. సోమవారం సాయంత్రం నాటికి 93 శాతం పూర్తికావడంతో మంగళవారం కూడా పింఛన్లను పంపిణీ చేస్తారని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) సీఈఓ రాజాబాబు ‘సాక్షి’కి తెలిపారు.  

ఫిబ్రవరిలో కొత్త పింఛన్లు మంజూరు చేసిన వారితో కలిపి రాష్ట్రంలో మొత్తం 54,68,309 మంది పింఛనుదారులుండగా.. సోమవారం నాటికి 50,42,126 మంది లబ్ధిదారులకు పంపిణీ పూర్తయిందని రాజాబాబు చెప్పారు. రూ.1,210 కోట్ల మొత్తం లబ్ధిదారులకు చేరిందన్నారు. వలంటీర్ల వల్ల ఎప్పుడూ లేని విధంగా ఈసారి 99 శాతం దాకా పింఛన్ల పంపిణీ జరిగే అవకాశం ఉందన్నారు.   

మరిన్ని వార్తలు