బంగారం కేసులో.. పోలీసుల దొంగాట

3 Aug, 2018 11:56 IST|Sakshi
పోలీస్‌స్టేషన్‌లో టీడీపీ నేత బృందంతో మాట్లాడుతున్న పోలీసు అధికారి

పోలీసు అధికారుల కప్పదాటు ధోరణి

వివరాలు చెప్పకుండా ఎవరికి వారు తప్పించుకునే ధోరణి

కేసును పెద్దోళ్లు చూస్తున్నారన్న క్రైం ఎస్సై

ఫోన్‌లో చెప్పలేను.. నేరుగా రండి.. కానీ ఇవాళ కాదు అని తప్పించుకున్న క్రైం సీఐ

నేను కేవలం అడ్మిన్‌ చూస్తున్నా.. క్రైం  ఏడీసీపీ సురేష్‌బాబు

జరిగింది నిజమేనన్న నగల వర్తక సంఘం అధ్యక్షుడు

కలకలం రేపిన ‘సాక్షి’ కథనం

దొంగ బంగారం కేసులో అసలు కథ.. కాదు కాదు.. ఆట ఇప్పుడే మొదలైంది..కేసును ఛేదించి అసలు నిందితులను జైలులో పెట్టాల్సిన పోలీసు ఉన్నతాధికారులు ఒత్తిళ్లకు లొంగి గోప్యంగా కేసును చాపచుట్టేయాలనుకున్నారు..దాన్ని కాస్త ‘సాక్షి’ రట్టు చేయడంతో కుడితిలో పడ్డ ఎలుకల్లా కొట్టుకుంటున్నారు.. ‘గుమ్మడి కాయల దొంగ’.. అంటే భుజాలు తడుముకున్నట్లు తాజా వివరాల కోసం ఏ అధికారిని అడిగినా.. తాను చూడటం లేదంటే.. తాను చూడటం లేదని కప్పదాటు వైఖరి అనుసరిస్తున్నారు..టీడీపీ వార్డు అధ్యక్షుడిగా హల్‌చల్‌ చేస్తున్న ఓ నగల వ్యాపారి అరకేజీ దొంగ బంగారంతో నాలుగు రోజుల క్రితం దొరికిపోవడం.. ఎమ్మెల్యే ఒత్తిడితో పోలీసులు అతన్ని వదిలిపెట్టిన వైనం విశాఖ పాత నగరంలో కలకలం రేపింది.దీనికి సంబంధించి మరిన్ని వివరాల కోసం ఆరా తీసిన సాక్షికి పోలీసుల దొంగాట కూడా తెలిసొచ్చింది. తమకు సంబంధం లేదని చెబుతున్న పోలీసు అధికారులే మరోవైపు గురువారం రాత్రి ఈ కేసును సెటిల్‌ చేసేందుకు గోపాలపట్నం స్టేషన్‌లో ‘పంచాయితీ’ పెట్టడం విశేషం.

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: చోరీ బంగారం కేసు విచారణలో పోలీసులు దొంగాట మొదలెట్టారు. కేసులో ప్రధాన నిందితుడు అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ వార్డు అధ్యక్షుడు కావడం, ఆ పార్టీ ఎమ్మెల్యే ఒత్తిళ్ల నేపథ్యంలో పోలీసులు ఎవరికి వారు తప్పించుకునే ధోరణి అవలంభిస్తున్నారు. ఆ కేసులో అతన్ని స్టేషన్‌కు తీసుకొచ్చి విచారణ చేపట్టిన పోలీసులు నిజాయితీగా వివరాలు చెబుతున్నప్పటికీ పై అధికారులు మాత్రం కప్పదాటు వైఖరినే నమ్ముకున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో టీడీపీ వార్డు అధ్యక్షుడిగా హల్‌చల్‌ చేసే ఓ  నగల వ్యాపారి దొంగ బంగారం కేసులో అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. దొంగ బంగారం క్రయ, విక్రయాల్లో ఆరితేరిన వ్యాపారిగా గతంలోనే రికార్డులకెక్కిన అతని తాజా భాగోతాన్ని ‘సాక్షి’ బట్టబయలు చేసింది. ‘అసలు బండారం దొంగ బంగారం’  శీర్షికతో గురువారం సాక్షిలో వచ్చిన కథనం కలకలం రేపింది.

అసలేం జరిగిందంటే..
వారం కిందట కిందట కంచరపాలెం క్రైం పోలీసులకు పట్టుబడిన ఇద్దరు దొంగలు ఇచ్చిన సమాచారంతో సోమవారం రాత్రి వన్‌టౌన్‌ కురుపాం మార్కెట్‌ సమీపంలోని సదరు టీడీపీ నేతకు చెందిన జ్యూయలరీ షాపుపై పోలీసులు దాడి చేసి అరకేజీ బంగారంతోపాటు పది కేజీల వెండి స్వాధీనం చేసుకున్నారు. తాము చోరీ చేసిన బంగారాన్ని ఓ న్యాయవాది ద్వారా టీడీపీ నేతకు చెందిన షాపులోనే విక్రయించామని దొంగలు చెప్పడంతో ఆ షాపులో పనిచేస్తున్న యువకుడితో పాటు ధర్మకాటా వ్యాపారం చేసే మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తీసుకెళ్లారు. విషయం తెలిసి మంగళవారం స్టేషన్‌కు వెళ్లిన షాపు యజమాని అయిన టీడీపీ నేతను స్టేషన్‌లోనే కూర్చోబెట్టి తమదైన శైలిలో విచారణ చేపట్టారు. ఇంతలో టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధి.. నేర విభాగానికి చెందిన ఓ పోలీసు ఉన్నతాధికారికి ఫోన్‌ చేసిన దరిమిలా కంచరపాలెం పోలీసులు నిందితులను విడిచిపెట్టారు. అయితే రికవరీలో భాగంగా టీడీపీ వార్డు అధ్యక్షుడిని పది తులాల బంగారం, అతని షాపులో పని చేస్తున్న యువకుడిని ఐదు తులాలు, ఇద్దరు  ధర్మకాటా వ్యాపారులను తలో పది తులాలు.. అంటే మొత్తం 35 తులాల బంగారం ఇవ్వాలన్న పోలీసుల షరతుకు వారు అంగీకరించారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి 10.30గంటల సమయంలో కంచరపాలెం పోలీసులు రీడింగ్‌రూమ్‌ ప్రాంతంలోని అపోలో ఫార్మసీ సమీపంలో ఉన్న ఓ జ్యూయలరీ షాపు నుంచి 100 గ్రాముల బంగారం బిస్కెట్‌ను ఓ ధర్మకాటా వ్యాపారి తరఫున తీసుకెళ్లారు. ఇంత జరిగినా పోలీసు ఉన్నతాధికారులు మాత్రం ఏమీ తెలియనట్టే వ్యవహరించడం విమర్శలపాలవుతోంది.

మరిన్ని వార్తలు