భార్య ఇష్ట ప్రకారమే భర్తకు పోస్టింగ్

4 Aug, 2013 04:06 IST|Sakshi
భార్య ఇష్ట ప్రకారమే భర్తకు పోస్టింగ్
హైదరాబాద్: విభజన తర్వాత ఏ రాష్ట్రంలో పనిచేయాలో నిర్ణయించుకొనే అవకాశాన్ని (ఆప్షన్) ఉద్యోగులకు ఇవ్వాలని కేంద్ర మార్గదర్శకాలు చెబుతున్నాయి. 13 సంవత్సరాల క్రితం ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల ఏర్పాటు సమయంలో మాతృ రాష్ట్రం, కొత్త రాష్ట్రాల మధ్య ఉద్యోగాల కేటాయింపు.. ఉద్యోగుల బదిలీల్లో అనుసరించాల్సిన విధానాలను పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. విభజనకు ముందు నిర్దిష్ట తేదీని నిర్ణయించి, ఆ రోజు రాష్ట్రంలో ఉన్న మొత్తం ఉద్యోగాలు, ఖాళీలను ఇరు రాష్ట్రాలకు చేసే కేటాయింపునకు ఆధారంగా తీసుకుంటారు. ఉదాహరణకు మధ్యప్రదేశ్ విభజన సమయంలో 2000 నవంబర్ 1వ తేదీని ఆధారంగా తీసుకొని ఉద్యోగాల విభజన చేశారు. ‘ఆప్షన్, సొంత జిల్లా ఆధారంగా ఉద్యోగుల విభజన చేయాలి. మొత్తం పోస్టులు, ఆప్షన్ ఎంపిక చేసుకున్న ఉద్యోగుల సంఖ్య సమానంగా లేకపోతే.. ‘జూనియర్ మోస్ట్’ను బదిలీ చేసి సమతుల్యత సాధించాలి. అవసరమైతే ‘ఆప్షన్’కు వ్యతిరేకంగా కూడా ‘జూనియర్ మోస్ట్’ ఉద్యోగులను బదిలీ చేయవచ్చు. ఒకసారి ‘ఆప్షన్’ ఇచ్చిన ఉద్యోగులు దాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉండదు..’ అని కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
 
అయితే మోస్ట్ జూనియర్లను వారి ఆప్షన్‌కు వ్యతిరేకంగా బదిలీ చేసినా కొన్ని కేటగిరీల ఉద్యోగులకు కోరుకున్న చోట ఉండేలా మినహాయింపునిస్తారు. ‘మహిళలు, నాలుగో తరగతి ఉద్యోగులు, వికలాంగులను కోరుకున్న రాష్ట్రానికే కేటాయించాలి. భార్యాభర్తలను ఒకే రాష్ట్రంలో ఉంచాలి’ అని స్పష్టం చేశారు. మహిళా ఉద్యోగులను వారు కోరుకున్న రాష్ట్రాలకే కేటాయించాలి కాబట్టి.. భార్య ఇష్టం మేరకే భర్తకు పోస్టింగ్ ఉంటుంది. ఉద్యోగి లేదా కుటుంబసభ్యుల్లో ఎవరైనా కేన్సర్ రోగి ఉన్నా, రెండేళ్ల లోపల బైపాస్ సర్జరీ చేయించుకున్నా, ఉద్యోగి లేదా కుటుంబ సభ్యుల్లో మానసిక రోగులు ఉన్నా కూడా మినహాయింపు వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు కూడా మినహాయింపు ఉంటుంది. కుటుంబ సభ్యులంటే.. భార్య/భర్త, ఉద్యోగి మీద ఆధారపడిన పిల్లలు, తల్లిదండ్రులుగా నిర్వచించారు. రాష్ట్ర, మల్టీజోనల్ స్థాయి అధికారులు, రాజధానిలోని శాఖాధిపతుల కార్యాలయాలు, సచివాలయం, రాజ్‌భవన్, శాసనసభలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి. జిల్లా స్థాయి పోస్టుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు డిప్యుటేషన్ల మీద పనిచేస్తుంటే.. వాటిని రద్దు చేసి సొంత జిల్లాలకు పంపిస్తారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం పోస్టులను లెక్కగట్టి వాటిని ఇరు రాష్ట్రాలకు వాటి వైశాల్యం, జనాభా, క్షేత్రస్థాయి, శాఖాధిపతుల కార్యాలయాల్లో పోస్టుల అవసరం.. ఆధారంగా కేటాయింపులను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే రాష్ట్ర సలహా మండలి నిర్ణయించనుంది. 
 
సలహా మండలి సిఫారసులే కీలకం
గతంలో మూడు రాష్ట్రాలు విభజన జరిగినప్పుడు.. రాష్ట్రాల రాజధానులున్న ప్రాంతాలు విడిపోలేదు. విడిపోయిన ప్రాంతం వైశాల్యం కూడా మాతృ రాష్ట్రంతో పోలిస్తే చిన్నది. కొత్త రాష్ట్రాలకు వెళ్లడానికి సిబ్బంది లభించని పరిస్థితి అక్కడ ఏర్పడింది. మన రాష్ట్రంలో పరిస్థితి భిన్నం. రాజధాని ఉన్న ప్రాంతం విడిపోనుంది. హైదరాబాద్‌లో ఉండటానికి సీమాంధ్ర ఉద్యోగులు ఆసక్తి చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో.. కేంద్రం ఏర్పాటు చేయనున్న రాష్ట్ర సలహామండలి స్థానిక పరిస్థితులను పరిగణనలోనికి తీసుకుని చేయనున్న సిఫారసుల ఆధారంగా కేంద్రం మార్గదర్శకాలు జారీ చేస్తుంది. ఇరు రాష్ట్రాలకు ఉద్యోగుల కేటాయింపు, బదిలీ జరుగుతుంది.
>
మరిన్ని వార్తలు