‘ఎస్‌ఎన్‌సీయూ’లో విద్యుత్ అంతరాయం

1 Jan, 2014 00:36 IST|Sakshi

తాండూరు టౌన్, న్యూస్‌లైన్: తాండూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో (ఎస్‌ఎన్‌సీయూ) ఏర్పడిన విద్యుత్ అంతరాయం చిన్నారులకు శాపంగా మారింది. విద్యుత్ సరఫరాలో ఏర్పడిన అంతరాయం వల్ల చికిత్స పొందుతున్న చిన్నారులను బయటకు తరలించారు. వివరాలిలా ఉన్నాయి. అనారోగ్యంతో జన్మించిన శిశువుల సంరక్షణార్థం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో  రోజుకు రూ.3వేల నుంచి రూ.5వేల ఖర్చు అయ్యే అవకాశం ఉంది. దీనిని నివారించటానికి ఎస్‌ఎన్‌సీయూని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. 20 పడకల సామర్థ్యం ఉన్న ఎస్‌ఎన్‌సీయూలో మంగళవారం విద్యుత్ సరఫరా చేసే ఇన్వర్టర్లు పాడయ్యాయి.
 
 దీంతో సరఫరాలో అంతరాయం ఏర్పడింది. జిల్లా ఆస్పత్రి టెక్నీషియన్లు మరమ్మతు చేసేందుకు విఫలయత్నం చేశారు. దీంతో తప్పనిసరి పరిస్థితిలో చికిత్స పొందుతున్న 13 మంది చిన్నారులను బయటకు తరలించాల్సి వచ్చింది. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటరమణప్పను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా అకస్మాత్తుగా ఎస్‌ఎన్‌సీయూకి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందన్నారు. ఇన్వర్టర్లలో సమస్య తలె త్తిందని వెంటనే మరమ్మతు చేయిస్తామన్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న 13 మంది శిశువుల్లో 10మంది ఆరోగ్యంగానే ఉన్నారని, వారిని ఇంటికి తీసుకెళ్లవచ్చని కుటుంబసభ్యులకు చెప్పామన్నారు. అయితే ముగ్గురు చిన్నారుల పరిస్థితి బాగలేకపోవడంతో రిఫర్ చేశామన్నారు. కాగా సాయంత్రం ఇన్వర్టర్లకు మరమ్మతు చేయించి తిరిగి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
 

>
మరిన్ని వార్తలు