డబ్బులివ్వలేదనే జేసీ కక్ష గట్టారు

9 Oct, 2018 03:41 IST|Sakshi

ఆశ్రమంలో ఎలాంటి అవకతవకలు జరగట్లేదు

మమ్మల్ని అరెస్టు చేస్తున్న పోలీసులు జేసీ వర్గీయులపై కేసు పెట్టినా తీసుకోవట్లేదు

సీఎం చంద్రబాబుకు ప్రబోధానంద స్వామి భక్తుల ఫిర్యాదు  

సాక్షి, అమరావతి: జేసీ సోదరులు డిమాండ్‌ చేసినంత డబ్బు ఇవ్వకపోవడం వల్లే తమపై కక్ష గట్టి గొడవలు సృష్టించారని ప్రభోదానందస్వామి భక్తులు సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. జేసీ దివాకర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి ఆశ్రమం నుంచి భారీగా డబ్బు డిమాండ్‌ చేస్తున్నారని వెల్లడించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో ప్రబోధానందస్వామి ఆశ్రమం వద్ద కొద్దిరోజుల క్రితంజేసీ, ఆయన వర్గీయులు, ఆశ్రమంలోని భక్తుల మధ్య ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై సోమవారం తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలకు చెందిన వందలాది మంది ప్రబోధానందస్వామి భక్తులు సీఎంను కలిసేందుకు ఉండవల్లి వచ్చారు. వారిలో నలుగురిని మాత్రమే భద్రతా సిబ్బంది చంద్రబాబు వద్దకు పంపడంతో వారు తమ సమస్యలను ఆయనకు వివరించారు. ఆశ్రమంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మాత్రమే జరుగుతున్నాయని ఎలాంటి అవకతవకలు జరగట్లేదని తెలిపారు.

జేసీ సోదరులు డబ్బు కోసం తమను వేధించారని, డబ్బులివ్వకపోవడంతో కక్ష పెట్టుకుని తరచూ గొడవలు సృష్టిస్తున్నారని వివరించారు. అధికారులు, పోలీసులు జేసీ సోదరుల మాటలే వింటున్నారని తమను పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశ్రమం మొత్తం ప్రస్తుతం పోలీసుల ఆధీనంలో ఉందని, వందలాది మంది భక్తులను గృహనిర్బంధం చేశారని, బయట నుంచి తమను లోపలికి వెళ్లనీయట్లేదని వాపోయారు. జరిగిన ఘర్షణలకు సంబంధించి తమపై 30కి పైగా కేసులు పెట్టారని, 85 మందిని అరెస్టు చేశారని, కానీ తాము జేసీ వర్గీయులపై ఫిర్యాదులు చేసినా పోలీసులు తీసుకోలేదని, రిజిష్టర్‌ పోస్టులో సీఎం కార్యాలయానికి ఫిర్యాదులు పంపినా స్పందన లేదని చెప్పారు. ఆశ్రమం వద్ద శాంతియుత వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకోవాలని, ఆశ్రమాన్ని యథావిధిగా నిర్వహించేందుకు అనుమతివ్వాలని కోరారు. చంద్రబాబు మాట్లాడుతూ.. శాంతిభద్రతల సమస్య రాకుండా ఉంటే సమస్యను పరిష్కరిస్తానని, అందుకు సహకరించాలని చెప్పి వారిని పంపించివేశారు.

ఆశ్రమాన్ని నాశనం చేయాలని చూశారు 
ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత ప్రబోధానంద భక్తుల బృందానికి నేతృత్వం వహించిన గడియం పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. జేసీ సోదరులు కేవలం డబ్బు కోసమే తమ ఆశ్రమాన్ని నాశనం చేయాలని చూశారని తెలిపారు. గత కొన్నేళ్లుగా వారు ఆశ్రమంలోని భక్తులను ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము కోర్టుకు వెళ్లగా జేసీ సోదరులను న్యాయస్థానం మందలించిందని, అయినా వారిలో మార్పు రాలేదన్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా గ్రామస్తులను దారిమళ్లించి మందిరం వైపునకు తీసుకొచి మహిళలపై కుంకుమ చల్లుతూ అసభ్యంగా ప్రవర్తించారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో అక్కడున్న భక్తులు వారిని ప్రశ్నించారని అది గొడవగా మారిందని అప్పటి పరిస్థితులను వివరించారు. జేసీ సోదరుల చర్యల వల్లే భయానక పరిస్థితులు నెలకొన్నాయని, వారిపై కేసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు