జగనన్నా కోలుకో..!

27 Oct, 2018 13:38 IST|Sakshi
వైఎస్‌ జగన్‌ త్వరగా కోలుకోవాలని కోరుతూ ఒంగోలు లాయరుపేట సాయిబాబా ఆలయం వద్ద 101 కొబ్బరికాయలు కొడుతున్న వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు

సాక్షి ప్రతినిధి,ఒంగోలు : తమ ప్రియతమ నాయకుడు వైఎస్‌ జగన్‌ త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ శుక్రవారం ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఆయన అభిమానులు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు శుక్రవారం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. గురువారం విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రక్త గాయాలతో బయటపడిన విషయం విధితమే. హత్యాయత్నం నుంచి జగన్‌ దేవుడి దయ వల్ల గాయాలతో బయటపడ్డాడని, ఆయన త్వరగా పూర్తి స్థాయిలో కోలుకోవాలని వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు టెంకాయలు కొట్టి పూజలు చేశారు.   

ఒంగోలులో పార్టీ నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు లాయర్‌పేట సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 101 టెంకాయలు కొట్టారు. ముందుగా పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసం నుంచి నాయకులు ర్యాలీగా ఆలయం వద్దకు వెళ్లారు.  
మార్కాపురంలో బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు బ్రాహ్మణ భవన్‌లో వైఎస్‌ జగన్‌ కోసం మృత్యుంజయ హోమం నిర్వహించారు.  
 పర్చూరులో పార్టీ శ్రేణులు స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో జగన్‌ కోలుకోవాలని పూజలు నిర్వహించారు. మార్టూరు మసీదులో, ఇంకొల్లు చర్చిలో పార్టి శ్రేణులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
 అద్దంకి నియోజకవర్గంలోని సింగరకొండలోని ఆంజనేయస్వామి ఆలయంలో పార్టీ నేతలు టెంకాయలు కొట్టి జగన్‌ కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
 కనిగిరిలోని కాశీరెడ్డి కాలనీలో క్రైస్తవులు వైఎస్‌ జగన్‌ కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నియోజకవర్గంలోని హెచ్‌ఎంపాడులో జగన్‌పై దాడికి నిరసనగా నిరసన కార్యక్రమం చేపట్టారు.
 గిద్దలూరులో పార్టీ నేతలు స్థానిక వేంకటేశ్వరస్వామి ఆలయంలో వైఎస్‌ జగన్‌ త్వరగా కోలుకోవాలని పూజలు నిర్వహించారు. కొమరోలు ఆంజనేయస్వామి ఆలయంలోనూ, కంభం, బేస్తవారిపేట, అర్థవీడు మండలాల్లోనూ పార్టీ శ్రేణులు ఆలయాలు, మసీదుల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు.

మరిన్ని వార్తలు