టీటీడీ ఆగమ సలహా మండలి సభ్యునిగా రమణ దీక్షితులు

6 Nov, 2019 04:41 IST|Sakshi

కొత్త అర్చకులకు మార్గనిర్దేశం చేసే బాధ్యతలు కూడా ఉత్తర్వులు జారీచేసిన తిరుమల తిరుపతి దేవస్థానం

సాక్షి, తిరుమల: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గతంలో ఇచ్చిన హామీ మేరకు తిరుమల శ్రీవారి ఆలయ పూర్వ ప్రధాన అర్చకుడు ఏవీ రమణదీక్షితులును తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆగమ సలహా మండలి సభ్యునిగా నియమించారు. ఈ మేరకు టీటీడీ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. కొత్తగా నియమితులయ్యే అర్చకులకు సలహాలు, సూచనలు ఇచ్చి తగిన విధంగా మార్గనిర్దేశం చేయడానికి ఆయన సేవలను టీటీడీ వినియోగించుకుంటుందని కూడా ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. రమణ దీక్షితులు సుదీర్ఘకాలం శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడుగా సేవలు అందించారు. శ్రీవారి ఆలయ విశిష్టత,  సంప్రదాయాలు, స్వామివారి వివిధ కైంకర్యాలపట్ల ఆయనకు అపార పరిజ్ఞానం ఉంది.

అందుకే ఆయన్ని ఆగమ సలహా మండలి సభ్యునిగా నియమించినట్లు టీటీడీ తెలిపింది. ఆగమ సంప్రదాయాలకు అనుగుణంగా ఆలయ నిర్వహణపై  కొత్తగా నియమితులయ్యే అర్చకులకు ఆయన తగిన మార్గానిర్ధేశం చేస్తారని టీటీడీ ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. గతంలో టీడీపీ ప్రభుత్వం రమణ దీక్షితులును హఠాత్తుగా పదవీ విరమణ పేరుతో ఆలయ విధుల నుంచి తొలగించింది. అనువంశిక అర్చకులకు పదవీ విరమణ ఉండదని ఎందరు చెప్పినా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు వినిపించుకోలేదు. దీనిపై స్పందించిన అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రమణదీక్షితులును మళ్లీ తిరుమల శ్రీవారి ఆలయ సేవలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఆయన్ను టీటీడీ ఆగమ సలహా మండలి సభ్యునిగా నియమించి మళ్లీ శ్రీవారి సేవాభాగ్యం కల్పించారు. 

మరిన్ని వార్తలు