రెడ్‌ అలెర్ట్‌!

9 May, 2019 11:40 IST|Sakshi

ఒడిశాలో భారీ ఎన్‌కౌంటర్‌

నేపథ్యంలో అప్రమత్తమైన జిల్లా పోలీసు యంత్రాంగం

ఏవోబీలో కూంబింగ్‌ ముమ్మరం

విశాఖపట్నం , అరకులోయ: ఒడిశాలోని కోరాపుట్‌ జిల్లా పాడువా సమీపం కిటుబడి అటవీ ప్రాంతంలో బుధవారం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగిన నేపథ్యంలో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టుల శిబిరంపై ఒడిశా పోలీసులు దాడులు చేసి అయిదుగురు మావోయిస్టులను మట్టుబెట్టారు. ఈ పరిస్థితిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా ఏవోబీకి సమీపంలో ఉన్న అరుకులోయ ఏజెన్సీలో పోలీసులు కూంబింగ్‌ ప్రక్రియను ముమ్మరం చేశారు. గత నెల రోజుల నుంచి ఒడిశాలోని పాడువా ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో ఆ రాష్ట్ర పోలీసు పార్టీలు కూంబింగ్‌ చర్యలను విస్తృతం చేసింది. పాడువా ప్రాంతానికి సరిహద్దులో ఉన్న విశాఖ జిల్లా అరకులోయ, డుంబ్రిగుడ, హుకుంపేట సరిహద్దు వరకు పోలీసు పార్టీలు గాలింపు చర్యలను విస్తృతం చేశాయి.

ఈ క్రమంలోనే మావోయిస్టులు పోలీసులకు తారసపడడంతో కాల్పులు చోటుచేసుకున్నాయి. మొత్తం అయిదుగురు మావోలు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒకరు మహిళా మావోయిస్టు కూడా ఉన్నారు. వీరంతా ఆంధ్రా, ఒడిశా సరిహద్దు మావోయిస్టు పార్టీకి చెందిన కీలకనేతలుగా ఒడిశా పోలీసులు అనుమానిస్తున్నారు.  ఎన్‌కౌంటర్‌ సంఘటన నుంచిమరింత మంది మావోయిస్టులు తప్పించుకోవడంతో ఒడిశా పోలీసు  గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాయి. ఈ పరిస్థితిలో ఏవోబీలో పోలీసు అధికారులు రెడ్‌ అలెర్ట్‌ను ప్రకటించారు. ఒడిశాకు సరిహద్దులో ఉన్న ముంచంగిపుట్టు, పెదబయలు పోలీసు స్టేషన్లతో పాటు ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న డుంబ్రిగుడ, అరకులోయ, హుకుంపేట పోలీసు స్టేషన్ల పరిధిలో కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఎన్‌కౌంటర్‌ ఘటనపై విశాఖ రూరల్‌ జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ కూడా వివరాలు సేకరించారు. ఒడిశా పోలీసు అధికారులతో ఫోన్‌లో సమీక్షించినట్టు సమాచారం.

విశాఖ ఏజెన్సీలోని పోలీసు స్టేషన్లను ఎస్పీ అప్రమత్తం చేశారు. ఒడిశాలోని పాడువా ప్రాంతంలో ఒడిశా పోలీసు పార్టీలు కూంబింగ్‌ కొనసాగిస్తుండడంతో ఎన్‌కౌంటర్‌లో తప్పించుకున్న మరింత మంది మావోయిస్టులు విశాఖ జిల్లా అటవీ ప్రాంతాలలోకి చొరబడి తలదాచుకుంటారనే అనుమానంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఒడిశా ప్రాంతంలో పోలీసు బలగాలు అధికంగా మొహరించడంతో ఏవోబీలో యుద్ధ వాతావరణం నెలకొంది.

>
మరిన్ని వార్తలు