పెరగనున్న పురపరిధి..!

31 Aug, 2019 08:58 IST|Sakshi
చిత్తూరు నగర స్వరూపం

పుంగనూరు, శ్రీకాళహస్తిల్లో గ్రామాల విలీనం?

చిత్తూరు, మదనపల్లె, నగరి, పుత్తూరుల్లో..

2011 జనాభా ప్రకారం వార్డు జనాభా విభజన

సాక్షి, చిత్తూరు: జిల్లాలోని పలు మునిసిపాలిటీల పరిధి పెరగనుండడంతో పాటు మరికొన్ని మునిసిపాలిటీల్లో ఉన్న వార్డుల పునర్విభజన జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఆయా మునిసిపల్‌ కమిషన్లకు అందాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి మునిసిపాలిటీలోని జనాభాను వార్డుకు సరాసరి విభజించాలని ఆదేశాల్లో పేర్కొన్నా రు. ఇందుకు సంబంధించి విడుదల చేసిన షెడ్యూల్‌లో అధికారులకు పలు సూచనలు చేశారు.

ఉత్తర్వుల్లో ఇలా..
2011 జనాభా ప్రకారం మదనపల్లె, పలమనేరు, నగరి, పుత్తూరు మునిసిపాలిటీలతో పాటు చిత్తూ రు మునిసిపల్‌ కార్పొరేషన్‌లో వార్డుల పునర్విభజన చేయాలని రాష్ట్ర పురపాలన  పరిపాలనశాఖ సంచాలకులు విజయకుమార్‌ ఆదేశించారు. ఉదాహరణకు చిత్తూరు నగరంలో 1.89 లక్షల జనాభా ఉండగా.. ప్రతి డివిజన్‌లో సగటున 3,787 మంది చొప్పున (మొత్తం 50 డివిజన్లు) ఉండాలి. ఇందులో 10 శాతం తక్కువ, ఎక్కువ ఉండొచ్చు. అంతకన్నా తేడా ఉంటే దాన్ని సమీపంలోని వార్డుల్లో కలపాలి. ఇలా 2011 జనాభా లెక్కల ప్రకారం మదనపల్లెలో 35 వార్డులు, పలమనేరు 24 , నగరిలో 27, పుత్తూరులో 24 వార్డులు ఏర్పడ్డాయి. తాజా ఉత్తర్వుల ప్రకారం సగటు జనాభా 10 శాతం ఎక్కువ ఉన్నా, తక్కువ ఉన్నా వార్డుల పునర్విభజన జరగనుంది. చిత్తూరు కార్పొరేషన్‌లో 46, 47, 49, 50వ డివిజన్లలో స్వల్ప వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించిన అధికారులు దీన్ని ఇతర డివిజన్లలో సర్దుబాటు చేయనున్నారు. అయితే కార్పొరేషన్‌లో డివిజన్ల సంఖ్య పెరగకపోగా.. మునిసిపాలిటీల్లో ఈ సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

విలీనం తప్పదా ?
మరోవైపు ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లో శ్రీకాళహస్తి, పుంగనూరు మునిసిపాలిటీలతో పాటు తిరుపతి కార్పొరేషన్‌ పేరు ప్రస్తావించలేదు. అంటే శ్రీకాళహస్తి, పుంగనూరు మునిసిపాలిటీ పరిధిలోకి సమీపంలో ఉన్న పంచాయతీలను విలీనం చేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. గ్రామ పంచాయతీల విలీనం అనంతరం వీటిలో వార్డుల పునర్విభజన వర్తింపచేసే అవకాశాలున్నాయి. తిరుపతి కార్పొరేషన్‌కు సంబంధించి విలీన ప్రక్రియలో ఇప్పటికే న్యాయపరమైన సమస్యలుండా దీనిపై కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ప్రచురణ షెడ్యూల్‌
వార్డుల పునర్విభజన ముసాయిదాను సెప్టెంబరు 3వ తేదీ లోపు, అభ్యంతరాల స్వీకరణ సెప్టెంబరు 11లోపు, 13వ తేదీ జాబితాను రాష్ట్ర మునిసిపల్‌ అధికారులకు పంపడం, అక్టోబర్‌ 10వ తేదీ ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌ జారీచేస్తుందని షెడ్యూల్‌లో పేర్కొన్నారు. చిత్తూరు కార్పొరేషన్‌లో మాత్రం వచ్చేనెల 24వ తేదీ డివిజన్ల వారీ జనాభాను ప్రభుత్వం నోటిఫికేషన్‌ ద్వారా విడుదల చేస్తుంది.

మరిన్ని వార్తలు