75 కిలోమీటర్లు.. 350 గోతులు

30 Sep, 2019 08:42 IST|Sakshi

 నరకప్రాయంగా ఆర్‌వీనగర్‌– పాలగడ్డ రోడ్డు

కమీషన్ల కక్కుర్తితో పనులు 

కొత్త సర్కారు రాగానే మొదలైన పనులు

నిజ్జంగా నిజం.. నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు గానీ ఒక్కసారి ఆ రోడ్డు వెంట ప్రయాణం చేస్తే చాలు నరకమంటే ఏమిటో ప్రత్యక్షంగా తెలుస్తుంది.. ఓ విధంగా చెప్పాలంటే గిరిజనుల పట్ల గత తెలుగుదేశం పాలకుల చిన్నచూపు, అంతులేని నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది.. మన్యంలోని జీకే వీధి మండలం ఆర్‌వీనగర్‌– పాలగడ్డ వరకు మొత్తం 75.6కిలోమీటర్ల సింగిల్‌ రోడ్డును డబుల్‌ రోడ్డుగా విస్తరించే పనులకు 2016లోనే నిధులు విడుదలయ్యాయి. డబుల్‌రోడ్డు అటుంచి ఉన్న సింగిల్‌ రోడ్డు పూర్తిగా ధ్వంసమైపోయినా గత పాలకులు ఏమాత్రం పట్టించుకోలేదు.  కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆర్‌అండ్‌బీ అధికారులు ముందుగా ఈ రోడ్డు పనులపైనే దృష్టిసారించారు. అటవీ అనుమతులు వచ్చేలోగా ముందుగా సింగిల్‌ రోడ్డుకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులతో పాటు తారురోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు.
– సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం

సాక్షి, విశాఖపట్నం: చుట్టూ అభయారణ్యం.. మధ్యలో కొండలు, కోనలు.. విశాఖపట్నం–సీలేరు–భద్రాచలం బస్సు రూటులో కొయ్యూరు నుంచి సీలేరు వరకు ప్రయాణించిన వారికి నిజంగా ఆ ప్రయాణమే ఓ అద్భుతంగా అనిపిస్తుంది. ఆ రోడ్డు వెంట కారులోనో, ఆటోలోనో.. ద్విచక్రవాహనంలోనో ప్రయాణించినా చాలు.. అదో అందమైన మజిలీగా అనిపిస్తుంది.. ఇదంతా పర్యాటకుల అనుభూతి. మరి అక్కడే... ఆ మన్యంలోనే తరతరాలుగా నివసిస్తున్న గిరిజనులకు, గిరజనేతరులకు ఆ సింగిల్‌ రోడ్డు మార్గమే హైవేలాంటిది. అటు ఒడిశాలోని మల్కన్‌గిరి వెళ్లాలన్నా.. తూర్పు గోదావరి జిల్లా భద్రాచలం వెళ్లాలన్నా.. ఇటు కొండదిగి విశాఖపట్నం వయా నర్సీపట్నం రావాలన్నా ఆ ఒక్క రోడ్డు మార్గమే ఆధారం.

మరి అటువంటి రోడ్డు మార్గం ఎలా ఉండాలి
కానీ గత ఐదారేళ్లుగా ఆ రోడ్డు దాదాపుగా ధ్వంసమైపోయింది. ప్రధానంగా జీకేవీధి నుంచి జిల్లా సరిహద్దు సీలేరు వరకు ఉన్న రోడ్డు పూర్తిగా గొయ్యిలు, గతుకులమయమైంది. సీలేరు వైపున ఉన్న ఏజెన్సీలోని ఏకైక ప్రధాన రోడ్డును బాగుచేయండంటూ గిరిజనులు ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేస్తూ వచ్చారు. ఫలితంగా మూడేళ్ల కిందట దిగొచ్చిన అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆర్‌వీనగర్‌ నుంచి పాలగడ్డ వరకు మొత్తం 75.6 కిలోమీటర్ల సింగిల్‌ రోడ్డును డబుల్‌ రోడ్డుకు విస్తరించే పనులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు ట్రైబల్‌ సబ్‌ ప్లాన్‌ కింద రూ.84 కోట్లు కూడా మంజూరు చేసింది. సింగిల్‌ లైన్‌ నుంచి డబుల్‌ లైన్‌ రోడ్డు విస్తరణకు ఆరు రీచ్‌ల కింద పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఆ మేరకు నిర్మాణ కాంట్రాక్టును కేసీపీ కన్‌స్ట్రక్షన్స్‌కు మూడు రీచ్‌లు, సాయినాథ కన్‌స్ట్రక్షన్స్‌కు ఒక రీచ్, కోస్ట్టల్‌ ఇన్‌ఫీరియల్‌ సంస్థకు రెండు రీచ్‌లను కట్టబెట్టింది. కానీ సరిగ్గా అప్పుడే టీడీపీ నేతలు తెరపైకి వచ్చారు. ఆ రోడ్డు నిర్మాణం పేరిట రూ.కోట్లు మింగేయాలని భావించారు. అప్పట్లో ఓ మంత్రి కుమారుడిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే కొందరు కాంట్రాక్టర్లు టీడీపీ నేతల బెదిరింపులకు తలొగ్గలేదు. అడిగినంత ఇవ్వలేమని తేల్చి చెప్పారు.

మరోవైపు అభయారణ్యంలో రోడ్డు విస్తరణ పనులకు అటవీశాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తూ 39.9 హెక్టార్ల భూమి పరిహారంగా ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. పరిహారంగా భూమి ఇచ్చిన తర్వాతే పనులు చేపట్టాలని స్పష్టం చేసింది. వాస్తవానికి అప్పటి పాలకులకు చిత్తశుద్ధి ఉంటే జిల్లాలో ఎక్కడో చోట ఖాళీగా ఉన్న భూమిని అప్పజెప్పి పనులు వెంటనే చేపట్టేది. కానీ ఆ మాజీ మంత్రి కుమారుడు పెట్టిన బ్లాక్‌మెయిలింగ్‌కు తలొగ్గిన నాటి టీడీపీ సర్కారు మొత్తంగా ఆ పనులను అటకెక్కించేసింది. ఓ నెల కాదు.. రెండు నెలలు కాదు.. దాదాపుగా మూడేళ్లు నిధులు ఉండి కూడా పనులను నిలిపివేసింది. ఫలితంగా రోడ్డు మరింత అస్తవ్యస్తమైంది. 75.6 కిలోమీటర్ల రోడ్డులో దాదాపు 350కిపైగా గోతులు, గొయ్యిలు ఉంటాయంటే నమ్మశక్యం కాకపోవచ్చుగానీ పచ్చినిజం. ఆ రోడ్డు వెంట ప్రయాణం చేయాలంటే నరకం చూస్తున్నామని రోడ్డు విస్తరణ పక్కన పెట్టి కనీసం మరమ్మతులైనా చేపట్టాలని గిరిజనులు, ప్రయాణికులు నెత్తీనోరు కొట్టుకున్నా, చివరికి ధర్నాలు చేసినా నాటి టీడీపీ ప్రభుత్వం లెక్క చేయలేదు. వాస్తవానికి మరమ్మతు పనులకు అటవీశాఖ అనుమతి అక్కరలేదు. కానీ అసలు టీడీపీ ఏ కోశానా పట్టించుకోలేదు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా