99 మున్సిపాల్టీల్లో ప్రత్యేక అధికారుల పాలన

1 Jul, 2019 04:44 IST|Sakshi

జూలై 2తో ముగియనున్న పదవీకాలం

త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారుల కసరత్తు  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పాలక వర్గాల పదవీ కాలం ముగియనున్న 99 పురపాలక సంఘాల్లో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం కానుంది. వచ్చే నెల 2వ తేదీతో వీటి పదవీ కాలం ముగియనుండటంతో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ వివరాలు సేకరిస్తోంది. ఒకటి రెండు రోజుల్లో వీటి వివరాలను ప్రభుత్వానికి నివేదించనుంది. ఎన్నికలు జరిగే వరకు ఆయా పురపాలక సంఘాల్లో ప్రత్యేక అధికారుల పాలన తీసుకొచ్చేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఆ శాఖ అధికారులు ప్రభుత్వాన్ని కోరనున్నారు. దీంతో పాలకవర్గాల పదవీ కాలం ముగియనున్న మున్సిపాల్టీల స్థాయికి అనుగుణంగా ప్రత్యేక అధికారుల నియామకాలు జరగనున్నాయి.

జాయింట్‌ కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు– 2, సబ్‌ కలెక్టర్లు, రెవెన్యూ డివిజనల్‌ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించనున్నారు. ఇప్పటికే 7 కార్పొరేషన్లు, ఒక మున్సిపాల్టీ, మూడు నగర పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. కాగా, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మున్సిపల్‌ అధికారులు ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు 94 మున్సిపాల్టీల్లో కులాల వారీ ఓటర్ల గణనను పూర్తి చేశారు. ఇందులో 85 మున్సిపాల్టీలు, 9 కార్పొరేషన్లు ఉన్నాయి.

ప్రత్యేక అధికారుల పాలన గడువు పొడిగింపు
రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లు, ఒక మున్సిపాల్టీ, 3 నగర పంచాయతీల్లో కొనసాగుతున్న ప్రత్యేక అధికారుల పాలన ఈ ఏడాది డిసెంబర్‌ 31 వరకు పొడిగిస్తూ మున్సిపల్‌ శాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ప్రత్యేక పాలన జూన్‌ 30న ముగియడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, ఒంగోలు, తిరుపతి, కర్నూలు కార్పొరేషన్లు, కందుకూరు మున్సిపాల్టీ, రాజాం, నెల్లిమర్ల, రాజంపేట నగర పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలనను పొడిగించారు.  

మరిన్ని వార్తలు