రూ. 250 కోట్లు!

7 Feb, 2015 01:44 IST|Sakshi

దారుణం
 పెట్రోల్, డీజిల్ ధరల్లో కేంద్ర ప్రభుత్వం రెండు రూపాయలు తగ్గిస్తే.. రాష్ర్ట ప్రభుత్వం ఏకంగా వ్యాట్ రూపంలో నాలుగు రూపాయలు పెంచడం దారుణం. ఇప్పటికే పెరిగిన నిత్యావసరాల ధరలతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే ఈ ప్రభావం అన్నింటిపైనా ఉంటుంది. ఇక సామాన్యులు ఎలా బతకాలి. దీనికి తోడు విద్యుత్ చార్జీలు పెంచడానికి రంగం సిద్ధం చేసింది. సామాన్యుల బతుకును దుర్భరం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి.
 -  పుష్పలత, కన్నపుకుంట, డోన్.
 
 సాక్షి ప్రతినిధి, కర్నూలు: అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం స్వల్పంగా తగ్గిస్తే.. దానికి రెండింతలు రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ విధించింది. దీంతో పెట్రోలు, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఇది చాలదన్నట్లుగా విద్యుత్ చార్జీలను పెంచడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ వాతలు, షాక్‌లతో జిల్లా ప్రజలపై అదనంగా ఏకంగా రూ. 250 కోట్లకుపైగా భారం పడనుంది.
 
  పెరిగిన డీజిల్, పెట్రోలు ధరలతో సరకు రవాణా చార్జీలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా కూరగాయలు, పాలు, పండ్ల ధరలతో పాటు ఆర్టీసీ చార్జీలు కూడా త్వరలో పెరిగే ప్రమాదం పొంచి ఉంది. ప్రభుత్వ తాజా నిర్ణయంపై అట రాజకీయ పార్టీల నాయకులు ఇటు సామాన్య ప్రజలు మండిపడుతున్నారు. ప్రభుత్వ బాదుడుపై పోరాటం చేస్తామని ప్రకటిస్తున్నారు.
 
 డీజిల్ దంచుడు రూ. 120 కోట్లు..!
 జిల్లాలో రోజుకు 6,66,666 లీటర్లకు పైగా డీజిల్ అమ్మకాలు జరుగుతున్నాయి. అంటే నెలకు 2 కోట్ల లీటర్లు అవుతుంది. ఏడాదికి 24 కోట్ల లీటర్ల మేరకు వినియోగం ఉంటోంది. తాజాగా డీజిల్‌పై లీటరుకు రూ. 4 చొప్పున అదనపు భారాన్ని ప్రభుత్వం మోపింది. ఈ లెక్కన లీటరుకు రూ. 4 చొప్పున ఏకంగా 24 కోట్ల లీటర్ల డీజిల్ వినియోగానికిగానూ ఏకంగా రూ. 120 కోట్ల అదనపు భారం జిల్లా ప్రజలపై పడనుంది. అంతేకాకుండా సరుకు రవాణాకు ప్రధానంగా డీజిల్ వాహనాలనే వినియోగిస్తారు.
 
  జిల్లా నలుమూలల నుంచి పాలు, కూరగాయలు, పండ్లు ఈ వాహనాల్లోనే కర్నూలు కేంద్రానికి సరఫరా అవుతున్నాయి. డీజిల్ ధర పెరిగిన నేపథ్యంలో వీటి రవాణాకు అయ్యే వ్యయం కూడా పెరగనుంది. ఫలితంగా కూరగాయలు, పండ్లు, పాల ధరలు కూడా పెరిగే ప్రమాదం పొంచి ఉంది. అంతేకాకుండా వ్యవసాయానికి విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో పలువురు రైతులు డీజిల్ ఇంజన్లను వినియోగిస్తున్నారు. గతంలో వ్యవసాయ డీజిల్ వినియోగానికి ఇస్తున్న సబ్సిడీని ఎత్తివేసిన ప్రభుత్వం.. తాజాగా వ్యాట్ వేయడంతో రైతులపై కూడా అదనపు భారం పడనుంది.
 
 పెట్రోలు మంట
 రూ. 26.40 కోట్లు!
 జిల్లాలో రోజుకు 1,83,333 లీటర్లకుపైగానే పెట్రోలు వినియోగిస్తున్నారు. అంటే నెలకు 55 లక్షల లీటర్లు చొప్పున.. ఏడాదికి  6 కోట్ల 60 వేల లీటర్ల పెట్రోలును జిల్లా ప్రజలు వాడుతున్నారు. తాజాగా లీటరుకు రూ. 4 చొప్పున అదనపు బాదుడుతో 6 కోట్ల 60 వేల లీటర్లకు ఏడాదికి ఏకంగా రూ. 26.40 కోట్ల అదనపు భారం ప్రజలపై పడుతుంది. పెట్రోలు మంటతో ప్రజలు విలవిలవాడే పరిస్థితి ఏర్పడింది.
 
 కరెంటు షాక్ రూ. 100 కోట్లకుపైమాటే
 గతంలో తొమ్మిదేళ్ల పాలన కాలంలో ఎనిమిది సార్లు విద్యుత్ చార్జీలను చంద్రబాబు ప్రభుత్వం పెంచింది. ఇప్పుడు కూడా అదే పంథాలో మొదటి ఏడాదిలోనే విద్యుత్ చార్జీలను బాదడానికి సిద్ధమైంది. గృహ వినియోగదారులతో పాటు పరిశ్రమలు, వాణిజ్యవర్గాలు, కుటీర పరిశ్రమలకూ కరెంటు షాక్‌నిచ్చింది. విద్యుత్ చార్జీల పెంపుతో జిల్లాలోని 10 లక్షల 55 వేల విద్యుత్ కనెక్షన్లు కలిగిన వినియోగదారులపై ఏకంగా రూ. 100 కోట్లకుపైగా భారం పడనుంది. మొత్తం మీద అటు పెట్రోలు, డీజిల్ వాతలు, ఇటు కరెంటు చార్జీల షాక్‌లతో జిల్లా ప్రజలపై ఏకంగా ఏడాదికి రూ. 250 కోట్ల మేరకు భారం పడనుంది.
 
 
 ఇది బాదుడు ప్రభుత్వం
 గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో విద్యుత్ చార్జీలను ఒక్క పైసా కూడా పెంచలేదు. పైగా పరిశ్రమలకు సగటున 50 పైసల మేరకు విద్యుత్ చార్జీలను తగ్గించారు. చంద్రబాబు అధికారంలో ఉన్న గత తొమ్మిదేళ్లలో ఎనిమిది సార్లు చార్జీలను పెంచారు. ఇప్పుడు ఈ పాత రికార్డును కొనసాగిస్తున్నారు.
 
 అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన ధరల మేరకు ప్రజలకు లబ్ధి చేకూర్చకుండా.. ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాలోకి వేసుకోవడం విడ్డూరంగా ఉంది. ఆదాయం లేదంటూ బీద అరుపులు అరుస్తూ కోట్లకు కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన ధరల మేరకు ప్రజలకు ఊరట లభించకుండా చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ముందుండి పోరాడతాం.
 - బుడ్డా రాజశేఖర రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
 
 తగ్గిన మొత్తాన్నీ మింగేస్తున్నారు
 గతంలో వంట గ్యాస్ ధరను కేంద్ర ప్రభుత్వం 50 రూపాయలు పెంచితే... వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వమే భరించింది. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన ధరను కూడా ప్రజలు అనుభవించకుండా దానిని కూడా మింగేయాలని ప్రభుత్వం చూస్తోంది. ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉంటుందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉంది. విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ విద్యుత్ చార్జీలను పెంచాలని చూడటం దారుణం. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ప్రజలపై భారం మోపడంలో విశ్వరూపం చూపిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు చేస్తాం.
 - బీవై రామయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు
 
 
 ప్రజలను దోచుకోవడమే ఉద్దేశం
 ప్రజలను దోచుకోవడమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది. పెట్రోలు, డీజిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో తగ్గుతున్నాయి. ఇందుకు అనుగుణంగా ధరలు తగ్గి వినియోగదారులకు వెసులుబాటు కలగాలి. అయితే, ప్రభుత్వం వ్యాట్ పేరుతో ప్రజలను దోచుకుంటోంది. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లోనే పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్ వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు కాకముందే మెరుగైన విద్యుత్ అందించకపోగా విద్యుత్ చార్జీలను పెంచుతుండడం ఆందోళనకరం.
 - ప్రభాకర్ రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి
 
 నిత్యావసర ధరలు పెరుగుతాయి
 డీజిల్, పెట్రోలు ధరలను పెంచడంతో నిత్యావసర ధరలు పెరుగుతాయి. గతంలో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ధరలు పెరిగినప్పుడు పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ధరలు తగ్గిన సమయంలో వ్యాట్ పేరుతో బాదడం వల్ల ఆ మేరకు ప్రజలకు లబ్ధి చేకూరడం లేదు.
 - కె. రామాంజినేయులు, సీపీఐ జిల్లా కార్యదర్శి
 

>
మరిన్ని వార్తలు