పల్లవి ప్రశాంత్‌కు అండగా ఉంటా.. సీఎం రేవంత్‌కు ఫిర్యాదు చేస్తాం: హైకోర్టు న్యాయవాది

20 Dec, 2023 10:25 IST|Sakshi

ప్రజల హృదయాలను గెలుచుకున్న యువకునికి ఇదేనా బహుమానం

పోలీసులు నిర్లక్ష్యం వహిస్తే సీఎంకు ఫిర్యాదు చేస్తాం ∙

హైకోర్టు న్యాయవాది డాక్టర్‌ రాజేశ్‌కుమార్‌ ∙

ప్రెస్‌మీట్‌లో కంటతడిపెట్టుకున్న తల్లిదండ్రులు

సాక్షి, గజ్వేల్‌: కోట్లాదిమంది తెలుగు ప్రజల హృదయాలను గెలుచుకున్న బిగ్‌బాస్‌ సీజన్‌–7 విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌పై కక్షసాధింపు చర్యలు తగవని హైకోర్టు న్యాయవాది డాక్టర్‌ కే రాజేశ్‌కుమార్‌ అన్నారు. మంగళవారం ప్రశాంత్‌ తల్లిదండ్రులు గొడుగు సత్యనారాయణ, విజయమ్మలతో కలిసి సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌లో చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో ప్రశాంత్‌పై వివిధ సెక్షన్లతో కేసు నమోదైనట్లు మీడియాలో కథనాలు వస్తున్నా...ఇప్పటివరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి ఆన్‌లైన్‌లో పెట్టలేదని తెలిపారు. ఆరెస్ట్‌ చేస్తారనే భయంతో ప్రశాంత్‌తోపాటు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. సామాన్య రైతు బిడ్డగా వెళ్లి బిగ్‌బాస్‌ టైటిల్‌ను గెలుచుకున్న యువకునికి ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ ప్రశ్నించారు.

ప్రశాంత్‌ విజేతగా నిలవడం ఇష్టంలేని కొన్ని శక్తులు నగరంలో జరిగిన సంఘటనలకు కారణమన్న అనుమానం నెలకొందన్నారు. ఈ విషయంలో నిజాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. చట్ట ప్రకారం పోలీసులు వెళ్తే తాము అడ్డుపడబోమని, కానీ ప్రశాంత్‌పై కేసు నమోదు చేసినట్లయితే వెంటనే పోలీసుశాఖ వెబ్‌సైట్‌లో ఎఫ్‌ఐఆర్‌ పెట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. పల్లవి ప్రశాంత్‌ విజేతగా నిలిచిన ఆనందాన్ని కోల్పోయి..ఫోన్‌ కూడా స్విచ్ఛాప్‌ చేసుకొని ఎవరికి అందుబాటులో లేకుండా వెళ్లిపోవడం ఆందోళన కలిగిస్తుందన్నారు. అతనికి అండగా ఉంటూ న్యాయసహాయం అందిస్తానని తెలిపారు.

తల్లిదండ్రులు కంటతడి..
తమ కొడుకుపై కక్షసాధిస్తున్నారని విలేకరుల సమావేశంలో పల్లవి ప్రశాంత్‌ తల్లిదండ్రులు గొడుగు సత్యనారాయణ, విజయమ్మలు కంటతడిపెట్టుకున్నారు. చిన్నప్పటి నుంచి ప్రశాంత్‌ ఎంతోకష్టడి చివరకు తానూ అనుకున్నదని సాధించాడని, కానీ ఈ సంతోషం కొన్ని గంటలు కూడా నిలవలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కేసులు పెట్టి అరెస్ట్‌ చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అండగా నిలవాలని వారు కోరారు.

>
మరిన్ని వార్తలు