పల్లెపై పన్ను భారం?

7 Nov, 2013 02:09 IST|Sakshi

 

=కసరత్తు చేస్తున్న ప్రభుత్వం
 =పెలైట్ ప్రాజెక్టుగా ఒక మండలం ఎంపిక

 
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: పంచాయతీల ఆర్థిక పరిపుష్టి పేరుతో ప్రభుత్వం కొత్త ఎత్తుగడలకు పోతోందా?ఇందు కోసం గ్రామీణులపై పన్నుల భారానికి సిద్ధమవుతోందా? అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. పంచాయతీల్లో ఆదాయ న వనరుల అన్వేషణ, ప్రణాళికాయుతంగా నిధుల వినియోగం వంటి అంశాలపై త్వరలో పెలైట్ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఇందుకోసం జిల్లాలో ఒక మండలాన్ని ఎంచుకోనున్నారు. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వచ్చిన వెంటనే పంచాయతీ అధికారులు ఈ కార్యాచరణను అమలు చేయనున్నారు.

జిల్లాలో 920 పంచాయతీలు ఉన్నాయి. ప్రస్తుతం ఇంటి పన్నులు, ఇతరత్రా వసూళ్ల ద్వారా సుమారు రూ.11 కోట్లు వరకు ఆదాయం వస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి పంచాయతీలకు రావాల్సిన గ్రాంట్లు క్రమేపీ తగ్గిపోతూ ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం కూడా అరకొరగానే నిధులిస్తూ చేతులు దులుపుకుంటోంది. పాలకవర్గాలు లేవన్న సాకుతో రెండేళ్ల నుంచి ఒక్కపైసా కూడా పంచాయతీలకు విడుదల చేయలేదు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడింది.

గ్రామాల్లో పారిశుద్ధ్యం, ఇతరత్రా చిన్న చిన్న పనులకు డబ్బులులేని పరిస్థితి నెలకొంది. దీంతో అధికారులు ఇతర శాఖల నుంచి నిధులను మళ్లించి చిన్న చిన్న పనులను చేయిస్తూ వస్తున్నారు. అయితే ఇటీవలే ప్రభుత్వం నుంచి టీఎఫ్‌సీ కింద రూ.12.21 కోట్లు, ఎస్‌ఎఫ్‌సీ కింద రూ.4.01 కోట్లు విడుదలయ్యాయి. వాటిని జనాభా ప్రాతిపదికన పంచాయతీలకు పంపిణీ చేశారు. ప్రస్తుతం పంచాయతీల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలంటే ఈ నిధులు అసలు సరిపోవు.
 
పెలైట్ ప్రాజెక్టుగా ఒక మండలం : పంచాయతీల్లో ఆదాయ వనరుల పెంపునకు మార్గాలు, ప్రణాళికాబద్ధమైన నిధుల ఖర్చు వంటి అంశాలపై త్వరలో ఒక ప్రాజెక్టును చేపట్టాలని ప్రభుత్వం నుంచి పంచాయతీ అధికారులకు సూచనప్రాయంగా సమాచారం అందింది. గత నెల 28న హైదరాబాద్‌లో సీమాంధ్ర జిల్లాల పంచాయతీ అధికారులు, సర్పంచ్‌లతో వర్క్‌షాప్ జరిగింది.

ఇందులో ఇదే విషయం చర్చకు వచ్చినట్లు తెలిసింది. అదే సమయంలో భారీ వర్షాలు, వరదలు కారణంగా జిల్లా నుంచి పంచాయతీ అధికారులు ఆ సమావేశానికి హాజరుకాలేదు. అయితే ఆ సమావేశంలో నిర్ణయాలు, ఆ ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారం ఉన్నతాధికారుల నుంచి పంచాయతీ అధికారులకు అందింది. పెలైట్ ప్రాజెక్టుగా జిల్లాలో ఒక మండలాన్ని ఎంపిక చేయనున్నట్లు తెలిసింది. అయితే పూర్తిస్థాయిలో ప్రభుత్వం నుంచి విధి విధానాలు వచ్చిన తరువాత కార్యాచరణ సిద్ధం చేస్తామని అధికారులు చెబుతున్నారు.
 
పన్నుల భారం! : పంచాయతీలకు ఆర్థిక వనరులు సమకూర్చే పేరు తో ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం మోపేందుకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. అందుకోసమే ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పన్నుల రూపంలో వస్తున్న ఆదాయం తక్కువగా ఉండటంతో ప్రజల నుంచి మరింత అధికంగా ఆదాయాన్ని రాబట్టాలని అన్నింటిపైనా పన్నులు వేసేందుకు ప్రణాళిక సిద్ధమవుతోంది. ప్రధానంగా జీవో నంబర్ 67 ప్రకారం బిల్డింగ్ ఫీజును స్క్వేర్ మీటర్ ప్రకారం కమర్షియల్, రెసిడెన్షియల్‌కు వేర్వేరుగా, లేఅవుట్లు, ఇతరత్రా వాటి నుంచి ఆదాయాన్ని రాబట్టేందుకు రంగం సిద్ధమవుతోం ది.

ప్రస్తుత పన్నులతో పాటు ప్రకటనలు, కేబుల్ టీవీ కనెక్షన్లు, సెల్‌టవర్లపై ఇపుడు వసూలు చేస్తున్న అనుమతి ఫీజుతో పాటు అదనంగా బాధనున్నారు. పన్నుల భారం ప్రజలకు తెలియకుండా ఉంటూనే వారి నుంచి అధిక ఆదాయాన్ని పిండుకొనే విధంగా పెద్ద కసరత్తే జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే పంచాయతీల అభివృద్ధి, సక్రమంగా వనరుల వినియోగం వంటి వాటి కోసమే ఈ ప్రాజెక్టుకు రూపకల్పన జరుగుతున్నట్లు తమకు సమాచారం ఉందని అధికారులు చెబుతున్నారు.
 

మరిన్ని వార్తలు