‘సాక్షి’ సర్వే: అబద్ధాలు తప్పవంటున్న హైదరాబాద్ వాసి

30 Jun, 2013 05:47 IST|Sakshi
‘సాక్షి’ సర్వే: అబద్ధాలు తప్పవంటున్న హైదరాబాద్ వాసి

రోజుకు ఒకట్రెండు అబద్ధాలు తప్పవంటున్న నగరవాసి... బొంకకపోతే.. బతకడం కష్టమేనట... ‘సాక్షి’ సర్వేలో వెల్లడి
‘‘నెల రోజుల పాటు నిజాలు మాత్రమే చెప్పు.. నీ ప్రేమ నిజమని ఒప్పుకుంటాను’’.... ఇది అప్పుడెప్పుడో వచ్చిన ‘ఏప్రిల్ 1 విడుదల’ సినిమాలో హీరోయిన్ కండిషన్. బతకాలంటే బొంకడం తప్పదని భావించే హీరో ఈ షరతును అంగీకరించడం... నెల రోజులపాటు అన్నీ నిజాలే మాట్లాడితే ఎంత కంగాళీ అవుతుందో.. ఎన్ని సమస్యలు వస్తాయో.. ఎన్ని కాపురాలు కూలిపోతాయో.. ఎంతమంది ప్రాణాలమీదికి వస్తుందో తెలిసి రావడం... ఇదీ ఆ సినిమా. ఆ సినిమా విడుదలై ఏళ్లయింది. అబద్ధం ఇప్పుడు మరింత బలం పుంజుకుంది. ప్రస్తుత సమాజంలో నిజాలు మాత్రమే మాట్లాడే సత్యహరిశ్చంద్రులు ఉన్నారంటే అది తప్పకుండా ఎనిమిదో వింతే. మన రోజువారీ జీవితంలో అబద్ధం ఎంతగా అల్లుకుపోయిందంటే.. చాలాసార్లు అనాలోచితంగా, అవసరం లేకుండానే అబద్ధాలాడేస్తున్నాం. అబద్ధం ఆడకుండా బతకలేం అనేంత పరిస్థితికి వచ్చేశాం. ఈ నేపథ్యంలో నగర జీవితంలో అబద్ధాల వెనకున్న నిజాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది ‘సాక్షి నెట్‌వర్క్’. ఈ సర్వే కోసం 20-50 ఏళ్ల వయసున్న 1,000 మంది స్త్రీ, పురుషులను సమాన నిష్పత్తిలో ప్రశ్నించింది. ఆ వివరాలివీ..

తక్కువే ఎక్కువ...
వీలున్నంత వరకూ అతి తక్కువ అబద్ధాలతో రోజులు గడిపేస్తున్నామని నగరవాసులు అంటున్నారు! రోజుకు ఒకట్రెండు కంటే ఎక్కువ అబద్ధాలు చెప్పడం లేదని 51.8 శాతం మంది చెబితే.. ఎడాపెడా అసత్యాలాడేస్తామని 19.6 శాతం మంది చెప్పారు.

రోజులో ఎన్నిసార్లు అబద్ధం ఆడుతున్నారు?
ఎ. ఒకటి లేదా రెండుసార్లు 518 51.8
బి. అంతకన్నా ఎక్కువ 286 28.6
సి. లెక్కలేనన్ని సార్లు 196 19.6

ఆడకపోతే.. గడవదంతే...
‘‘బొంకకపోతే బతుకు లేదు’’... అబద్ధాలు ఆడకుండా బతకటం అసాధ్యమనేది నగరంలోని 57 శాతం మంది నిశ్చితాభిప్రాయం. ప్రస్తుత ప్రపంచంలో అబద్ధం తోడు లేనిదే బతకలేం అని ఎక్కువమంది చెప్పారు.
ప్రస్తుత ప్రపంచంలో అబద్ధం ఆడకుండా బతకడం సాధ్యమా?
ఎ. కష్టపడితే సాధ్యమే 270 27
బి. అసాధ్యం 570 57
సి. సాధ్యమే 160 16

కాలక్షేపం కహానీలొద్దమ్మా...
సరదా కోసమో, అలవాటుగానో అయినదానికీ కానిదానికీ అబద్ధాలాడితే కోపమొస్తుందంటున్నారు నగరవాసులు. అయితే వీరిని చూసి జాలిపడేవాళ్లు కూడా ఉన్నారు.
అనవసరంగా అబద్ధం ఆడేవాళ్లను చూస్తే?
ఎ. కోపం వస్తుంది 622 62.2 బి. నవ్వొస్తుంది 209 20.9
సి. జాలేస్తుంది 169 16.9

ఆడపిల్లలు పుట్టినా... ఆడుతూనే ఉంటాం..
‘‘అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారు’’ అని సామెత. దీన్ని చాలా మంది నమ్మబోమని చెప్పగా.. నమ్మేవారూ ఉండటం విశేషం.

అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారనే సామెతను నమ్ముతారా?
ఎ. నమ్ముతాం 244 24.4
బి. లేదు 563 56.3
సి. కొంతవరకూ నిజమేనేమో 193 19.3
అబద్ధాలాడే వారిలో మగాళ్లే ఎక్కువని తేలింది. ఈ విషయాన్ని పురుషులలో అత్యధికులు ఒప్పేసుకున్నారు.
అబద్ధాలు ఆడే వారిలో..

ఎ. మగవాళ్లే ఎక్కువ 385 38.5
బి. ఆడవాళ్లే అధికం 312 31.2
సి. ఇద్దరూ 303 30.3

ప్రపంచం-అబద్ధం = బోర్
అబద్ధం లేకపోతే ప్రపంచం బాగోదని, బోర్ కొడుతుందని నమ్మేవాళ్లూ ఉన్నారు! అయితే, అబద్ధం అవసరం లేని ప్రపంచానికే ఎక్కువ మంది ఓటేశారు.

అసత్యం అవసరం లేని ప్రపంచం వస్తే?
ఎ. చాలా బాగుంటుంది 603 60.3 బి. బాగోదు 197 19.7
సి. బోర్ కొడుతుంది 200 20
- సాక్షి నెట్‌వర్క్

తప్పయినా తప్పదుగా...
అబద్ధం చె ప్పినప్పుడు మనసుకు కాస్త బాధేస్తుంది కానీ తప్పదు కాబట్టి ఆడేస్తున్నాం అనేవారే ఎక్కువ. అయితే, అబద్ధాలు చెబుతుంటే మహదానందంగా ఉందని అనుకునేవారూ ఉన్నారు!
అసత్యమాడినప్పుడు మనసుకు బాధ కలుగుతుందా?
ఎ. అనిపించదు 202 20.2
బి. కొంచెం 670 67
సి. ఆనందంగా ఆనిపిస్తుంది 128 12.8

బాలవాక్కు.. యువగళం..
అన్ని వయసుల వారిని లెక్క తీసుకుంటే.. చిన్నారులు, యువత తక్కువ అబద్ధాలు చెబుతున్నట్లు నగరవాసులు తేల్చారు. ఏ వయసు వారు తక్కువ అబద్ధాలు చెబుతారనే ప్రశ్నపై కాస్త మిశ్రమ అభిప్రాయాలు వెలువడినా ఎక్కువ మంది వీరికే ఓటేశారు.
ఏ వయస్సు వారు తక్కువ అబద్ధాలు చెబుతారు
ఎ. చిన్నపిల్లలు-యూత్ 456 45.6
బి. వృద్ధులు 288 28.8
సి. మధ్యవయస్కులు 256 25.6

>
మరిన్ని వార్తలు