Ambati Rambabu: ఛీ.. నీ బతుకు చెడ..! జనసేన పుట్టింది లోకేష్ కోసమా..!!

21 Dec, 2023 14:30 IST|Sakshi

పవన్ కల్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు ఫైర్

తుస్సుమన్న తెలుగుదేశం, జనసేన ఉమ్మడి బహిరంగ సభ

ఆరులక్షల మంది జనాలొస్తారని ఊదరగొట్టి కంగుతిన్నారు

నేతల ప్రసంగాలప్పుడే సగానికి పైగా సభ ఖాళీచేశారు

దీన్నిబట్టి ఆ రెండు పార్టీల భవితవ్యం ఏమీలేదని తేలింది

పొత్తు బీజేపీతో.. సంసారం తెలుగుదేశంతోనా..?

మీ ఇద్దరి సంబంధానికి.. బీజేపీ పెద్దల బ్లెస్సింగ్సా.. ?

మీ ఇద్దరి పొత్తు ఈరోజేం కొత్త కాదుగా..?

సాక్షి, గుంటూరు: లోకేశ్‌ యువగళం పెద్ద అట్టర్‌ ఫ్లాప్‌ అని విమర్శించారు. ముగింపు సభ అంతకంటే ఫ్లాప్‌ అని మండిపడ్డారు. యువగళం ఎవరికోసం చేశారని ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తన క్యాడర్‌ను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పవన్‌ ఎప్పుడూ చంద్రబాబుతో కలిసే ఉన్నారని అన్నారు. బాబు అయిదేళ్లు అడ్డగోలుగా పరిపాలన చేసినప్పుడు పవన్‌ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. గతంలో చంద్రబాబు, లోకేశ్‌లను పవన్‌ ఎన్నోసార్లు తిట్టారని, తిట్టిన నోటితోనే పవన్‌ మళ్లీ చంద్రబాబుతో కలిసారని గుర్తుచేశారు.

పవన్‌ ప్యాకేజీ మాట్లాడుకునే యువగళం సభకు వచ్చారని, ముందు రానని, తర్వాత ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. లోకేష్‌ను బలోపేతం చేసేందుకు జనసేన పార్టీ పెట్టారా అని మండిపడ్డారు. అమలు సాధ్యం కాని హామీలతో చంద్రబాబు మళ్లీ మోసం చేస్తున్నారని అన్నారు. ఏపీ శ్రీలంక అయిపోతుందని భయపెట్టి సిగ్గులేకుండా ఇప్పుడు చంద్రబాబు ఉచితాలు ప్రకటిస్తున్నారని దుయ్యబట్టారు.

మంత్రి అంబటి రాంబాబు ఏమన్నారంటే..

తుస్సుమన్న టీడీపీ-జనసేన బహిరంగ సభ?
తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి ఉమ్మడిగా  నిన్న విజయనగరం జిల్లా పోలిపల్లిలో బహిరంగ సభ పెట్టారు. బస్సులు, ట్రైన్‌లలో రాష్ట్ర నలుమూలల నుంచి జనాన్ని సమీకరించే కార్యక్రమం చేశారు. తెలుగుదేశం పార్టీ, జనసేన  కలిసి అద్భుతమైన ఒక బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నామని.. లోకేశ్‌ యువగళం యాత్ర ముగింపు సందర్భంగా ఈ సభను నిర్వహిస్తున్నామని చాలా ఆర్భాటం చేశారు. ఈ కార్యక్రమానికి దాదాపు ఆరు లక్షల మందికి పైగా జనం హాజరవుతారంటూ ముందుగానే ప్రచారం చేసుకున్నారు. తీరా.. అక్కడకొచ్చిన జనాన్ని చూస్తే వీళ్ల బహిరంగ సభ కార్యక్రమం కాస్త తుస్సుమంది. ఆరు లక్షల మంది జనాలు వస్తారని మీరు ప్రచారం చేసుకుంటే ఎంతమంది వచ్చారో నిజాయితీగా సమాధానం చెబుతారా..? వచ్చిన వాళ్లు ఎంతసేపు ఉన్నారు..? ఎవరి ఉపన్యాసాలు విన్నారు..? మధ్యలోనే వాళ్లంతా ఎందుకు వెళ్లిపోయారు..? వీటిపై తెలుగుదేశం, జనసేన పార్టీలు విశ్లేషించుకుంటే మంచిదని మనవి చేసుకుంటున్నాను. 

మోగలేని యుద్ధభేరి అది?
యువగళం యాత్రలో 3,132 కిలోమీటర్లు నడిచిన నారా లోకేశ్‌ ఏం తెలుసుకున్నాడు, ఏం సాధించాడు..?. రాష్ట్రంలోని ఏ సమస్యల్ని ఆయన అర్ధం చేసుకున్నా డు..? తెలుసుకున్న సమస్యలకు ఆయన పరిష్కార మార్గాలు ఏం చెప్పాడు..? అంటే, ఏమీలేవు. అదేమంటే, ఇది యువగళం.. నవశకం అన్నారు.. లోకేశ్‌ కీలక పాత్రధారి అన్నారు. ఆయనేమో ఇది యువగళం ముగింపు సభనే కాదు.. యుద్ధం ఆరంభమైందని.. ఎన్నికల యుద్ధభేరీ  మోగిస్తున్నామని అరిచాడు. అయితే, అక్కడేమీ భేరీ మోగలేదు. 

వారు కొత్తగా కలిసేదేముంది..?
తెలుగుదేశం, జనసేన పార్టీల కలయికలో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ ఒకే వేదికపై ఉండి నిర్వహించిన బహిరంగ సభ అని చెప్పుకున్నారు. అసలు, వారిద్దరూ ఎప్పుడు విడిపోయారు..? అని నేను ప్రశ్నిస్తున్నాను. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ ఎప్పుడూ విడిపోలేదు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఏవిధంగా పోటీచేస్తే బాగుంటుందో.. ఆ విధంగా పోటీ చేసే కార్యక్రమాలు చేశారు. 2014లో ఆయనకు సపోర్టు చేశారు. 2019లో విడిపోయి పోటీచేస్తే చంద్రబాబుకు ఉపయోగం కలుగుతుందని అనుకుని విడిపోయి మరీ పోటీచేశారు. ఇవాళేమో, ఓట్లు చీలకుండా ఉండేందుకు కలిసి పోటీచేస్తారంట.. జగన్‌మోహన్‌రెడ్డి గారిని ఓడిస్తారట. ఇది తప్ప ప్రజాసమస్యల గురించి మీరు బహిరంగ సభలో మాట్లాడారా..? అని అడుగుతున్నాను. 

ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి నేనొక సంగతిని గుర్తు చేస్తున్నాను. 2019 ఎన్నికల తర్వాత.. జగన్‌మోహన్‌రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేం ఆరోజు నుంచి ఈరోజు వరకు ఏం చెబుతున్నామో ఒక్కసారి ఆలోచించండి. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ ఇద్దరూ కలిసే వస్తారని చెబుతున్నాం. వారిద్దరూ కలిసే ఎన్నికల్లో పోటీచేస్తారని పదేపదే చెబుతున్నాం. కొత్తగా చెప్పిన అంశం కాదిది. ఇదేదో నిన్నటి బహిరంగ సభలో కొత్తగా ఆవిష్కరించబడిన విషయం కూడా కాదని చెబుతున్నాను. ఇవాళే మేము పోలిపల్లిలో కలిశాం. మా కలయికతో రేపు ఉమ్మడి ప్రభుత్వం రాబోతుందని చెబుతూ వారి కేడర్‌ను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరొకటి కాదని గుర్తుచేస్తున్నాను. 

చంద్రబాబు దౌర్భాగ్య పాలనకు పవన్‌కళ్యాణ్‌ బాధ్యుడే?
చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ ఈరోజు కొత్తగా కలవడమేంటి..? గతంలో 2014 ఎన్నికల్లో ఇద్దరూ కలిసే పోటీచేశారు. చంద్రబాబు మీరు కలిసిన తర్వాతనే అధికారంలోకొచ్చాడు. చంద్రబాబుతోనే జనసేన పవన్‌కళ్యాణ్‌ అంటకాగాడు. చంద్రబాబు చేతనే పరిపాలన చేయించాడు. మరి, ఐదేళ్లు ఇద్దరూ కలిసి అధికారం వెలగబెట్టి ఈ రాష్ట్ర ప్రజలకు ఏమీ చేయగలిగారు..? అని ప్రశ్నిస్తున్నాను. ప్రజల మదిలో గుర్తుండిపోయే ఒక్క మంచి పనిని మేము చేశామని చెప్పే దమ్ముందా..? అని వారిద్దర్నీ అడుగుతున్నాను. ఐదేళ్లపాటు మీ ఇద్దరి ఉమ్మడి అధికారంలో అడ్డగోలుగా పరిపాలించారన్నది వాస్తవం. జనసేన మద్ధతుతో అధికారంలోకొచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో అత్యంత దౌర్భాగ్యమైన పరిపాలన చేసింది. మరి, దీనికి పవన్‌కళ్యాణ్‌ బాధ్యుడు కాడా..? అని నేనడుగుతున్నాను. 

ఇప్పుడు లోకేష్ అద్భుతంగా కనిపించాడా.?
సరే, అప్పట్లో పవన్‌కళ్యాణ్‌ సపోర్టు చేస్తేనే చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు. ఐదేళ్ల పరిపాలన చివరిలో పవన్‌కళ్యాణ్‌ తెలుగుదేశం ప్రభుత్వం గురించి అనరాని మాటలతో తిట్టకూడని తిట్లతో దూషించాడు. చంద్రబాబును ఆయన కొడుకు లోకేశ్‌ను కూడా నేరుగా పేరు పెట్టి మరీ పవన్‌కళ్యాణ్‌ నోటికొచ్చినట్లు తిట్టాడు. లోకేశ్‌ను ఉద్దేశించి ‘నా తల్లిని దూషించావు నువ్వు. నీ సంగతి తేలుస్తాను. మరిచిపోను’ అని అన్నావు. మరి, ఇప్పుడు నువ్వు ఆ సంగతి మరిచిపోయావేమో.. ఇంకోమాట గుర్తుందా..పవన్‌కళ్యాణ్‌..? పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసి గెలవని లోకేశ్‌ పంచాయతీ రాజ్‌ మంత్రయ్యాడు ఏంటి మాకు ఈ ఖర్మ..? అని అన్నావు. మరి, నిన్నటి బహిరంగసభలో లోకేశ్‌ నీకు అంత అద్భుతంగా, అందంగా కనిపించాడా..పవన్‌..? అని నిలదీస్తున్నాను. 

పవన్ కల్యాణ్ అజ్ఞానం కనిపించింది?
లోకేశ్‌ చేసిన యాత్ర జగన్‌గారి పాదయాత్రలా కాదని, ముద్దుల పెట్టే యాత్ర కాదని అంటావా పవన్‌కళ్యాణ్‌. అసలు, జగన్ గారి పాదయాత్ర గురించి నీకు ఏం తెలుసని మాట్లాడుతావు..? జగన్‌గారు పాదయాత్రలో తనకు మద్దతుగా ఎదురొచ్చిన వృద్ధులను అప్యాయంగా పలకరించి తన గుండెలకత్తుకుని గౌరవంగా తల మీద ముద్దు పెడితే.. దాన్ని అపహాస్యం చేసే విధంగా మాట్లాడారు మీరు. పాదయాత్ర తర్వాత జగన్‌మోహన్‌రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారని గుర్తుకు తెచ్చుకోండి. ఆ పాదయాత్రకు లోకేశ్‌ పాదయాత్రకు పోలికేమైనా ఉంటుందా..?. లోకేష్ యాత్రను గొప్ప పాదయాత్రగా పోల్చే ప్రయత్నం చేశారంటే పవన్‌కళ్యాణ్‌ ఎంత అజ్ఞానంలో ఉన్నాడో అందరికీ తెలిసిపోయింది. 

టీడీపీతో పొత్తుకు బీజేపీ ఆశీస్సులున్నాయనడానికి సిగ్గు అనిపించలేదా..?
జనసేన ఆల్రెడీ బీజేపీ పొత్తులో ఉందని పవన్‌కళ్యాణ్‌ గుర్తుచేస్తూ.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నామని.. మా ఇద్దరి పొత్తుకు బీజేపీ ఆశీస్సులుండాలని చెప్పాడు. దీన్నిబట్టి ఇతని పొలిటికల్‌ లాజిక్కేంటో ఎవరికీ అర్ధంకావట్లేదు. ఇదేం అన్యాయమయ్యా..? ఇదేనా మీ నైతికతా..పవన్‌కళ్యాణ్‌ ..? అని ప్రతీ ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. బీజేపీతో పొత్తులో ఉండి తెలంగాణ ఎన్నికల్లో పోటీచేసి తుక్కుతుక్కుగా ఓడిపోయాడు. ఇవాళేమో, నేను తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నాను.. మీరు ఆశీర్వదించమని కోరుతున్నాడు. ఒకరితో పొత్తులో ఉండి మరొకరితో రహస్యంగా సంసారం చేయడం రాజకీయంగా కాకున్నా నిత్య జీవితంలో నీకెటూ అలవాటే కదా పవన్‌..? అదే పద్ధతిలో బీజేపీతో బంధం పెట్టుకుని తెలుగుదేశం పార్టీతో ఉన్న విడిపోని బంధాన్ని ఆశీర్వదించమని కోరుతూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్న వ్యక్తి పవన్‌కళ్యాణ్‌ అని అందరికీ తెలియజేస్తున్నాను. 

జనసేన పుట్టింది లోకేశ్‌ బలోపేతానికా?
ఎప్పుడైతే చంద్రబాబునాయుడును అరెస్టు చేశారో.. వెంటనే లోకేశ్‌బాబును నాయకుడ్ని చేయాలని మేం ప్రయత్నిస్తున్నాం.. అంటూ జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ అన్నాడు. ఛీ.. మీ బతుకు చెడా.. మీ జనసేన పార్టీ పుట్టింది లోకేశ్‌బాబును బలోపేతం చేయడానికా..? అని నేనడుగుతున్నాను. మీరు పార్టీ పెట్టింది మీరు రాజకీయంగా బలోపేతం కావడానికా..? తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికా..? మీది రాజకీయ పార్టీయేనా..? నిజంగా మీది రాజకీయ పార్టీనే అయితే, మరో రాజకీయ పార్టీలో అసమర్ధుడిగా తిరస్కరించబడిన లోకేశ్‌ను బలోపేతం చేస్తామంటే.. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ కూడా మౌనంగా కూర్చొన్నాడంటే... ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి ఉంటుందా..? అని ప్రశ్నిస్తున్నాను. దీనికి పవన్‌కళ్యాణ్, నాదెండ్ల మనోహర్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నాను. 

మీ ప్యాకేజీ డ్రామా అందరికీ తెలుసు
లోకేశ్‌ను రాజకీయంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో సభకు మొదట్లో మేం రాకూడదనుకున్నాం. ఆ తర్వాత మరలా రావాలని నిర్ణయించుకని వచ్చామని పవన్ కల్యాణ్ చెప్పారు. అంటే, మీరెందుకు రాకూడదని అనుకున్నారో.. మరలా ఎందుకు, ఎలా వచ్చారో.. అనేది ప్రజలకు తెలియదని మీరనుకున్నారా..? మీ ప్యాకేజీ డ్రామాలు ఎవరికీ తెలియదనుకుంటున్నారా..? చంద్రబాబు ఇంటికొచ్చి ప్యాకేజీ మొత్తం మాట్లాడుకున్న తర్వాతనే కదా.. లోకేశ్‌ ముగింపు సభకు పవన్‌కళ్యాణ్‌ బయల్దేరి వెళ్లింది..? ఇలా ఒక దౌర్భాగ్యపు రాజకీయాలు చేసే పరిస్థితికి చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు తెరదీశారు. 

సొంతిల్లు లేని సన్నాసులకు ప్రజాదరణ కరువు
ఇక, లోకేశ్‌ మాటలు చూస్తే.. అతనికి బుద్ధి, జ్ఞానం రెండూ లేవనే విషయం అందరికీ అర్థమవుతుంది. యుద్ధం ప్రారంభమైందంటాడు. తాడేపల్లి ప్యాలెస్‌ తలుపులు పగులకొడతానంటాడు. నిజంగా, లోకేశ్‌ అంత గొప్పవాడా..? అంత ప్రజాబలం ఉందా ..? అని ఆయన్ను అడుగుతున్నాను. ఎవరైనా మీ ఇంటికొచ్చి మిమ్మల్ని పిలుద్దామంటే, ఈ రాష్ట్రంలో అసలు మీకు తలుపులే లేవు. ఈ రాష్ట్రంలో ఇల్లు లేని సన్నాసులు మీరని చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, లోకేశ్‌లకు నేను మనవి చేస్తున్నాను. ఈ రాష్ట్రవాసులు కాని మీకు ఇక్కడ ప్రజాదరణ ఎలా ఉంటుందని నేను ప్రశ్నిస్తున్నాను. 

జగన్‌ ప్రజాదరణ చూసి భయపడే గుంపుకట్టారు
రాష్ట్రప్రజలకు ఒక విషయాన్ని నేను గుర్తుచేస్తున్నాను. నిన్నటి బహిరంగ సభలో వేదికపై చంద్రబాబు, లోకేశ్, బాలకృష్ణతో పాటు పవన్‌కళ్యాణ్‌ పక్క పక్కనే కూర్చొన్నారు. ఈ నలుగురు కలిసి ఒకే ఫ్రేమ్‌లోకి వచ్చారంటే, మా నాయకులు జగన్‌మోహన్‌రెడ్డి గారిని చూసి ఎంతగా భయపడుతున్నారో అర్ధం చేసుకోవాలని ప్రజలకు గుర్తుచేస్తున్నాను. ఈ రాష్ట్రంలో జగన్‌ గారు అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచీ దినదిన ప్రవర్ధనమానంలా పెరుగుతన్న రాజకీయ నాయకుడే తప్ప ఏకొంచెం కూడా ప్రజల విశ్వాసాన్ని కోల్పోనటు వంటి వ్యక్తి జగన్ గారు అని నేను మరోమారు గుర్తు చేస్తున్నాను. ఎన్ని సర్వేలు చూసుకున్నా..  50-60 శాతం కంటే ఎక్కువ మంది ప్రజలు  జగన్‌మోహన్‌రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిని చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు, 175కు 175 స్థానాలూ గెలుచుకుంటాం.  ఈ సత్యాన్ని విపక్షాలు గ్రహించాయి కనుకే అందరూ ఏకమై గుంపుగా రావాలని ప్రయత్నిస్తున్నారు. మీరు ఏకమై ఎంత గింజుకున్నా జగన్‌మోహన్‌రెడ్డిని ఏమీ చేయలేరని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు.

>
మరిన్ని వార్తలు