బీజేపీ సమావేశంపై భగ్గు

14 Sep, 2013 03:44 IST|Sakshi

 అనకాపల్లి, న్యూస్‌లైన్: బీజేపీ విశాఖ జిల్లా కార్యవర్గ సమావేశానికి సమైక్య సెగ తగిలింది. సమావేశం నిర్వహిస్తున్నారని తెలుసుకున్న ఉపాధ్యాయ జేఏసీ సభ్యులు అక్కడికి వెళ్లి సమైక్యాంధ్రకు మద్దతు పలకాలని బీజేపీ నేతలను డిమాండ్ చేశారు. దీంతో వారి మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఉపాధ్యాయ జేఏసీ సభ్యులపై బీజేపీ నేతలు దాడి చేశారన్న ప్రచారంతో సమైక్యవాదులంతా పెద్దఎత్తున తరలివచ్చి మూకుమ్మడి దాడి చేశారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. బీజేపీ నేతలు క్షమాపణ చెప్పి సమైక్యాంధ్రకు మద్దతు పలికితేనే వెనుతిరుగుతామని సమైక్యవాదులు భీష్మించుకొని కూర్చొన్నారు. వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోడిగుడ్లు విసరడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. బీజేపీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు కంభంపాటి హరిబాబు వాహనంపై సమైక్యవాదులు రాళ్లు విసరడంతో అద్దాలు పగిలాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సమావేశం అర్ధంతరంగా రద్దయింది.
 
 మాకు భావప్రకటనా స్వేచ్ఛ లేదా? : బీజేపీ
 హైదరాబాద్ : బీజేపీ కార్యాలయాలపైనా, సమావేశాలపైనా దాడులను సహించబోమని ఆ పార్టీ సీమాంధ్ర ఉద్యమ కమిటీ హెచ్చరించింది. ఈ తరహా దాడులు తమ భావప్రకటనా స్వేచ్ఛను అడ్డుకోవడమేనని ప్రకటించింది. అనకాపల్లిలో జరిగిన దాడిని కమిటీ చైర్మన్ ఎడ్లపాటి రఘునాథ్‌బాబు ఒక ప్రకటనలో ఖండించారు.

>
మరిన్ని వార్తలు