ఎల్లో బ్యాచ్‌ కొత్త ప్లాన్‌.. భారీ సంఖ్యలో బోగస్‌ ఓట్లు!

13 Dec, 2023 04:20 IST|Sakshi

టీడీపీ సానుభూతిపరులు.. పలు చోట్ల ఓటర్లుగా నమోదు

కుప్పం సహా 175 నియోజకవర్గాల్లో 40.76 లక్షలకు పైగా బోగస్‌ ఓట్లు

అధికార పార్టీ ఓటర్లపై గురి

కుప్పలు తెప్పలుగా ఫారం 7 దరఖాస్తులు.. విచారణ జరిపి ఆ దరఖాస్తులన్నీ నకిలీవని తేలుస్తున్న బీఎల్వోలు

దీంతో ఎన్నికల యంత్రాంగంపై దాడులకు తెగబడుతున్న పచ్చముఠాలు.. నకిలీ ఓట్లను కొనసాగించేందుకు 8జిల్లాల్లో బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు

కలెక్టర్లపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు

2014 ఓటర్ల జాబితాలో సుమారు 35 లక్షలకుపైగా దొంగ ఓట్లు

వాటిని అడ్డం పెట్టుకుని నాడు ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారంలోకి టీడీపీ

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీ పోలింగ్‌ బూత్‌ 223 పరిధిలో 17/836 ఇంటి నంబరుతో ఏకంగా 594 ఓట్లను చేర్పించారు.

నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం తంబాలగుంట (పోలింగ్‌ బూత్‌ నంబర్‌ 34)లో 1–10 ఇంటి నంబరులో 360 ఓట్లను చేర్పించారు.

ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలోని రామన్నగూడెం (పోలింగ్‌ బూత్‌ నంబర్‌ 161)లో 1–26 ఇంటి నంబరుపై 300 ఓట్లు చేర్పించారు.

అనంతపురం జిల్లా గుంతకల్లు మున్సిపాలిటీలో పోలింగ్‌ బూత్‌ నంబరు 73 పరిధిలో ఇంటి నంబరు 13/165లో 154 ఓట్లను చేర్పించారు.

సాక్షి, అమరావతి: నాలుగున్నరేళ్లుగా ముఖ్యమంత్రి జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో ప్రజాస్వామ్య ప్రక్రియపై విశ్వాసం కోల్పోయిన విపక్షం అడ్డదారులు పడుతోంది! రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల దొంగలు స్వైర విహారం చేస్తున్నారు! అధికార పార్టీ చేపట్టిన సామాజిక సాధికారయాత్ర, ఏపీకి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతుండటంతో వైఎస్సార్‌సీపీని ఒంటరిగా ఎదుర్కోవడం అసాధ్యమనే నిర్ణయానికి వచ్చిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు జనసేనతో చేతులు కలిపినా ఫలితం శూన్యమని గుర్తించారు.

పొత్తుపై అధికారిక ప్రకటన తర్వాత పవన్‌ పర్యటనలు – లోకేశ్‌ పాదయాత్రకు స్పందన లేకపోవడమే దీనికి తార్కాణం. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న టీడీపీ పెద్దలు 2019 ఎన్నికలకు మించి మరోసారి ఘోర పరాజయం తప్పదని పసిగట్టి దొడ్డిదారి పట్టారు! తమకు మాత్రమే సాధ్యమైన వ్యవస్థలోకి వైరస్‌లా చొరబడి చాపకింద నీరులా ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లను చేర్పిస్తున్నారు. 

40,76,580కిపైగా దొంగ ఓట్లు 
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అక్టోబర్‌ 27న విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌లో 4,02,21,450 మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించారు. ఇందులో సుమారు 40,76,580కిపైగా దొంగ ఓట్లను టీడీపీ నేతలు చేర్పించినట్లు ప్రజాసంఘాలు, రాజకీయ పరిశీలకులు గుర్తించారు. తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లను పలు నియోజకవర్గాల్లో ఒకే ఫోటోతో ఇంటి పేర్లు మార్చి జాబితాలో చేర్పించారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఓటు హక్కు కలిగి ఉన్న తమ పార్టీ సానుభూతిపరుల పేర్లను సైతం రాష్ట్రంలోని ఓటర్ల జాబితాలో చేర్పించారు.

ఒకే డోర్‌ నెంబర్‌పై వందల ఓట్లను నమోదు చేయించారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 46,165 పోలింగ్‌ బూత్‌ల పరిధిలోనూ ఇదే కథ. ఇప్పటికీ దొంగ ఓట్లను నమోదు చేయించే ప్రక్రియను కొనసాగిస్తున్నారు. మరోవైపు వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు జీవించి ఉన్నా చనిపోయినట్లు, స్థానికంగా నివాసం ఉంటున్నా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినట్లు చిత్రీకరిస్తూ ఆ ఓట్లను తొలగించేందుకు కుప్పలు తెప్పలుగా ఫారం–7 దరఖాస్తులు సమర్పిస్తున్నారు. బీఎల్వోల (బూత్‌ లెవల్‌ ఆఫీసర్లు) విచారణలో ఇవన్నీ వెలుగులోకి వస్తున్నాయి.   

దాడులు.. బ్లాక్‌ మెయిల్‌ 
మరోవైపు ఫారం 7లపై విచారణ జరిపి దొంగ ఓట్లను ఆధారాలతోసహా తేల్చి ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్న బీఎల్వోలు, తహసీల్దార్లపై టీడీపీ నేతలు దాడులకు దిగుతున్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో శావల్యాపురం తహసీల్దార్‌పై నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌ ఇటీవల దాడికి తెగబడ్డారు. తాము చేర్పించిన దొంగ ఓట్లను తొలగించకుండా ఏకంగా కలెక్టర్లను సైతం టీడీపీ నేతలు బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారు. అనంతపురం, శ్రీకాకుళం, అంబేడ్కర్‌ కోనసీమ, గుంటూరు, అన్నమయ్య, బాపట్ల, తిరుపతి, శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టర్లపై ఇటీవల రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడమే అందుకు నిదర్శనం.   
63 నియోజకవర్గాల్లో అసాధారణంగా పెరుగుదల 
సాధారణంగా ప్రతి వెయ్యి మంది జనాభాకు 18 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వారు 721 మంది ఉంటారు. కానీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఇటీవల విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాను పరిశీలిస్తే ప్రతి వెయ్యి మంది జనాభాకు 729 మంది ఓటర్లు ఉన్నారు. అంటే ప్రతి వెయ్యి మంది జనాభాకు సాధారణం కంటే ఎనిమిది ఓట్లు అధికంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. సుమారు 63 నియోజకవర్గాల్లో ఓటర్లు అసాధారణంగా పెరిగారు.

ఆ నియోజకవర్గాల్లో ప్రతి వెయ్యి మంది జనాభాకు 800 కంటే ఎక్కువ ఓట్లు ఉండటం గమనార్హం. దీన్ని బట్టి టీడీపీ నేతలు ఏ స్థాయిలో ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడ్డారో ఊహించవచ్చు. ఒకే వ్యక్తికి వేర్వేరు ఓటరు గుర్తింపు కార్డులతో 2019 జాబితాలో రెండు ఓట్లు ఉండగా 2023 ఓటర్ల జాబితాలోనూ వాటిని కొనసాగిస్తున్నారు. ఒకే ఇంటి నెంబరుపై టీడీపీ సానుభూతిపరుల ఓట్లను వందల సంఖ్యలో చేర్చారు. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఒకే ఇంటి నెంబరుపై 50 కంటే ఎక్కువగా సుమారు 20 లక్షలకుపైగా దొంగ ఓట్లను చేర్పించారు.  

ప్రజాస్వామ్యం అపహాస్యం 
ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఒకరికి ఒక ఓటు మాత్రమే ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉండటం చట్టవిరుద్ధం. ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి ఓటూ కీలకమే. ఒకే ఒక్క ఓటు అభ్యర్థుల తలరాతలను మార్చేస్తుంది. గెలుపోటములను నిర్దేశిస్తుంది. ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడాన్ని టీడీపీ 1995 నుంచే అలవాటుగా మార్చుకుంది. దేశంలో దొంగ ఓట్ల కార్ఖానాగా టీడీపీ గణతికెక్కింది.

ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అధికారాన్ని అడ్డుపెట్టుకుని వ్యవస్థలోకి వైరస్‌లా చొరబడి భారీ ఎత్తున దొంగ ఓట్లు చేర్పించారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలోనూ అదే కథ. ఆ దొంగ ఓట్లు అలాగే కొనసాగుతున్నాయి. వాటిని అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో గట్టె­క్కుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. 

కుట్రలు ఛేదించి అధికారంలోకి.. 
టీడీపీ అధికారంలో ఉండగా ప్రజలకు సంబంధించిన డేటాను చౌర్యం చేసి ప్రైవేట్‌ సంస్థలకు అప్ప­గించిన చంద్రబాబు వాటిని సేవామిత్ర యాప్‌తో అనుసంధానం చేసి వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించారు. 2015లో 22,76,714, 2016లో 13,00,613, 2017లో 14,46,238 వెరసి 50,23,565 ఓట్లను చంద్రబాబు తొలగింపజేశారు.

తనకు అలవాటైన రీతిలో అమలు చేసిన కుట్రను ప్రజాసంఘాలు బహిర్గతం చేశాయి. దీనిపై వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు మేరకు కేంద్ర ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించింది. అర్హుల ఓట్లను కూడా తొలగించినట్లు తేల్చిన ఎన్నికల అధికారులు 2019 ఎన్నికల నాటికి 31,97,473 ఓట్లను జాబితాలో చేర్చారు. దీంతో గత ఎన్నికల్లో 50 శాతానికిపైగా ఓట్లు సాధించి 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అఖండ విజయం 
సాధించింది. 

ఒక్కరే.. రెండు చోట్లా
► కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం రెండో పోలింగ్‌ బూత్‌ పరిధిలో ఓటరు గుర్తింపు కార్డు నెంబరు ఎక్స్‌ఎన్‌సీ 1398916తో పిచ్చుక ఉమాదేవికి (ఇంటి నెంబరు 31–11–29) ఓటు ఉంది. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం 157వ పోలింగ్‌ బూత్‌ పరిధిలోనూ ఓటరు కార్డు నెంబరు టీఎంవో 1763820తో ఆమెకు మరో ఓటు ఉంది. 

► విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం పోలింగ్‌ బూత్‌ 127 పరిధిలో యాగంటి ఆదిలక్ష్మికి ఏక్యూడబ్ల్యూ 0892779 గుర్తింపు కార్డు నెంబర్‌తో ఓటు ఉండగా అదే నియోజకవ­ర్గం పోలింగ్‌బూత్‌ 128 పరిధిలో ఏక్యూడబ్ల్యూ 0308692 గుర్తింపు కార్డు నెంబరుతో ఆమెకు మరో ఓటు ఉంది. 

హైదరాబాద్‌ ఓటర్లు.. ఏపీలోనూ ఓట్లు
సరిహద్దు రాష్ట్రాల్లో ప్రధానంగా తెలంగాణలోని హైదరాబాద్, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలో నివాసం ఉంటూ అక్కడ ఓటు హక్కు ఉన్న టీడీపీ సాను
భూతిపరుల పేర్లను ఏపీలోని 175 నియోజకవర్గాల్లోనూ ఓటర్లుగా చేర్చారు. హైదరాబాద్‌లో నివసిస్తూ అక్కడ ఓటర్లుగా నమోదైన 4.50 లక్షల మందికిపైగా ఏపీలోనూ పలు నియోజకవర్గాల్లో ఓటర్లుగా ఉన్నారు.   

నాడు.. ఐదు లక్షల దొంగ ఓట్లతో  
రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల నాటికి ఓటర్ల జాబితాలో సుమారు 35 లక్షలకుపైగా దొంగ ఓట్లు ఉన్నట్లు ప్రజాసంఘాలు గుర్తించాయి. ఆ ఎన్నికల్లో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆ దొంగ ఓట్లను తొలగించి ఉంటే 2014లోనే వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చి ఉండేదని అప్పట్లోనే ప్రజా సంఘాలు, రాజకీయ పరిశీలకులు తేల్చిచెప్పారు.    

>
మరిన్ని వార్తలు