తహసీల్దార్లు కావలెను

31 Jul, 2019 10:41 IST|Sakshi

జిల్లాలో 17 మంది కొరత 

రెవెన్యూ సిబ్బందిపై పనిభారం 

పనులు జరగక ఇబ్బందుల్లో జనం 

సాక్షి, అనంతపురం అర్బన్‌: జిల్లా పరిపాలనలో అత్యంత కీలకమైన రెవెన్యూ శాఖకు సిబ్బంది కొరత పట్టిపీడిస్తోంది. దీంతో రెవెన్యూ సిబ్బందిపై పనిభారం పెరగగా...పనులు సకాలంలో జరగక ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే  భూపరిపాలన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) కార్యాలయం నుంచి తహసీల్దార్లను జిల్లాకు ఎప్పుడు కేటాయింపు జరుగుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు.  

పరిపాలనాధికారి పోస్టులే ఖాళీ 
ప్రస్తుతం జిల్లాలోని 17 తహసీల్దార్లు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఐదు రెవెన్యూ డివిజన్లు ఉండగా.. అందులో నాలుగు డివిజన్‌లలో పరిపాలనాధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కలెక్టరేట్‌లో రెండు విభాగాలకు సంబంధించి సూపరింటెండెంట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక 11 మండలాల్లో తహసీల్దారు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

తహసీల్దార్‌ పోస్టుల ఖాళీలు ఇలా... 
రెవెన్యూ డివిజన్‌ కార్యాలయాల్లో డివిజన్‌ పరిపాలనాధికారులుగా (డీఏఓ) తహసీల్దార్లు ఉంటారు. ధర్మవరం రెవెన్యూ డివిజన్‌ మినహా అనంతపురం, కదిరి, పెనుకొండ, కళ్యాణదుర్గం ఆర్డీఓ కార్యాలయాల్లో డీఏఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక కలెక్టరేట్‌లో విభాగాల సూపరింటెండెంట్లుగా తహసీల్దార్లు ఉంటారు. హెచ్‌–సెక్షన్‌ , ఈ–సెక్షన్‌లకు సూపరింటెండెంట్లు లేరు. దీంతో ఈ స్థానాల్లో డిప్యూటీ తహసీల్దార్లను నియమించాల్సిన పరిస్థితి నెలకొంది. మండలాల విషయానికి పెద్దపప్పూరు, వజ్రకరూరు, విడపనకల్లు, యల్లనూరు, బ్రహ్మసముద్రం, ఆడమడగూరు, నల్లచెరువు, నల్లమాడ, తలపుల, తాడిపత్రి, ఓడీచెరువు తదితర 11 మండలాల్లో తహసీల్దారు పోస్టులు ఖాళీగా ఉన్నాయి.   

మండలాల్లో ఇన్‌చార్జిల పాలన 
ప్రభుత్వపరంగా అమలయ్యే కార్యక్రమాల్లో చాలా వరకు రెవెన్యూశాఖ కనుసన్నల్లోనే జరుగుతుంటాయి. ఇలాంటి ప్రాధాన్యత కలిగిన శాఖలో తహసీల్దార్ల కొరత కారణంగా కొన్ని మండలాల్లో డిప్యూటీ తహసీల్దార్లను ఇన్‌చార్జిగా నియమించారు. దీంతో ఆయా మండలాల్లో సమర్థవంతమైన పాలన సాగడం లేదనే అభిప్రాయాలు రెవెన్యూ శాఖ వర్గాల నుంచే వ్యక్తమవుతున్నాయి. మరోవైపు రెవెన్యూకు సంబంధించిన పనులు కూడా సకాలంలో జరగడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

తహసీల్దారు స్థానాల ఖాళీలు ఇలా...
ఆర్డీఓ కార్యాలయాల్లో డీఏఓ పోస్టుల ఖాళీలు  - 4
కలెక్టరేట్‌లో సూపరింటెండెంట్‌ పోస్టుల ఖాళీలు - 2
మండలాల్లో తహసీల్దారు పోస్టుల ఖాళీలు - 11

మరిన్ని వార్తలు