టీడీపీ బెదిరింపులకు భయపడొద్దు: శిల్పా

21 Aug, 2017 16:24 IST|Sakshi
 
నంద్యాల, సాక్షి: తెలుగుదేశం పార్టీ బెదిరింపులకు నంద్యాల వాసులు భయపడాల్సిన అవసరం లేదని వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆఖరి రోజు గాంధీ చౌక్‌ లో వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిర్వహించిన రోడ్‌ షోలో శిల్పా మోహన్‌ రెడ్డి ప్రసంగించారు. 
 
చంద్రబాబు ఇళ్లు కట్టిస్తామన్న మాట పచ్చి అబద్ధమని ఈ సందర్భంగా శిల్పా తెలిపారు. భూమా నాగిరెడ్డి బతికున్న సమయంలో పదివేల ఇండ్లు ఫ్రీగా కట్టిస్తామని చెప్పారని, కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం డబ్బులు అడుగుతూ ఆ మాట నిలబెట్టుకోలేకపోయిందన్నారు. వైఎస్‌ జగన్‌ సీఎం కావటం ఖాయమని, ఆయన అధికారంలోకి రాగానే మూడు సెంట్ల స్థలం, ఉచిత ఇళ్లు మంజూరు చేస్తామని శిల్పా హామీ ఇచ్చారు. ఓట్లు వేయకపోతే రేషన్‌ కార్డులు తొలగిస్తామని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారని, ఒక్క రేషన్‌​ కార్డు పోనివ్వకుండా చూసుకునే బాధ్యత తమదేనని ఆయన తెలిపారు.  రౌడీయిజంను అదుపు చేసే చర్యల్లో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటు, వైఫై సదుపాయం ఇలాంటివన్నీ నెరవేర్చలేదని శిల్పా పేర్కొన్నారు.
 
అభివృద్ధి అంటే బిల్డింగ్‌లు కూలగొట్టడం, రోడ్లువేయటం కాదని, పరిశ్రమలు, విద్యాలయాలు రావాల్సిన అవసరం ఉందని శిల్పా అభిప్రాయపడ్డారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పట్టణానికి తాగునీటి ఇబ్బంది లేకుండా చూసుకున్నానని, శిల్పా కేబుల్‌ పేరిట తక్కువ నగదుకే సదుపాయాన్ని కల్పించానని ఆయన పేర్కొన్నారు. మీకు ఆళ్లగడ్డ రాజకీయాలు కావాలో? నంద్యాల రాజకీయాలు కావాలో నిర్ణయించుకోవాలని అన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఓటేయాలని ప్రజలకు ఆయన విజ్నప్తి చేశారు.