స్మార్ట్‌కి దాతలు కావలెను

18 Feb, 2015 02:19 IST|Sakshi

గురజాల :  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డు కార్యక్రమం గురజాల నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోని అధికారులకు శాపంగా మారింది. గ్రామీణ ప్రాంతాలతో పాటు మునిసిపాలిటీ వార్డుల్లో పుట్టి పెరిగి ఉద్యోగ వ్యాపారాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన ప్రవాసాంధ్రుల నుంచి నిధులు సేకరించి గ్రామాలను అభివృద్ధి చేయాలన్నదే స్మార్ట్ విలేజ్ లక్ష్యం.
 
 స్మార్ట్ విలేజ్ కార్యక్రమం నిర్వహణకు ప్రతి మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించారు. వీరు స్థానిక ప్రజాప్రతినిధులు, ‘జన్మభూమి-మా ఊరు’ కమిటీ సభ్యులతో కలసి గ్రామాల్లో తిరిగి  సమస్యలను గుర్తించాలి. ఆ తరువాత ఎన్‌ఆర్‌ఐల నుంచి నిధులు సమీకరించి సమస్యలను పరిష్కరించాలి. గత నెలలో స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డు కార్యక్రమాలు నియోజకవర్గంలో మొక్కుబడిగా జరిగాయి. అధికారులు ఈ కార్యక్రమాన్ని నామ మాత్రంగానే నిర్వహించారు.
 
 కొందరు అధికారులు గ్రామాల్లో తిరిగి సమస్యలను అడిగి తెలుసు కున్నారు. మరికొందరు స్మార్ట్ విలేజ్ కార్యక్రమం తమ చావుకు వచ్చిందని బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. స్మార్ట్ విలేజ్ కార్యక్రమం ఆశాజనకంగా లేదనీ, దీని వ ల్ల పంచాయతీలకు ఒరిగేది ఏమీలేదని అధికారులు చెబుతున్నారు.
 
 రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేసి ఈ విధమైన కార్యక్రమాలు రూపొందిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్‌ఆర్‌ఐల నుంచి నిధులు వసూలు చేసి గ్రామాభివృద్ధి జరిగే పని కాదని పలువురు అధికారులు గుసగుసలాడుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగానే అధికారులు, ప్రజాప్రతినిధులు తలా ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని గ్రామాభివృద్ధితో పాటు మండలాభివృద్ధికి కృషి చేయాల్సి వుంది. దీనికి సంబంధించి  నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 59 గ్రామ పంచాయతీలకు గురజాల మండలం మాడుగుల గ్రామాన్ని స్థానిక శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అదే విధంగా తేలకుట్ల సర్పంచ్ తన గ్రామంలోని 10వ వార్డును దత్తత తీసుకున్నట్టు ప్రక టించారు. ఇంతకు మినహా గ్రామాలు లేదా వార్డుల దత్తతకు ప్రజాప్రతినిధులు, అధికారులు ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో స్మార్ట్ విలేజ్ సాధ్యమేనా అనే సందేహం కలుగుతోంది.
 

మరిన్ని వార్తలు